మేఘాద్రి మింగేసింది
మేఘాద్రి మరోసారి కన్నీటి చెరువైంది. గత ప్రమాదాలను తలపించేలా మళ్లీ మృత్యు కుహారమైంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ విద్యా కుసుమాన్ని కబళించగా.. మరో విద్యార్థి గల్లంతయ్యాడు. సంక్రాంతి పండగ ముందు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది.
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మేఘాద్రి రిజర్వాయర్‌లో సరదాగా ఈతకు దిగిన ఓ విద్యార్థి మృతి చెందగా.. మరో విద్యార్థి ఊబిలో కూరుపోయి గల్లంతయ్యాడు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఎన్ఏడీ జంక్షన్లో చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 10 మంది యువకులు గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మేఘాద్రి రిజర్వాయర్‌కు వెళ్లారు. సెల్ఫీలు తీసుకుంటూ కొద్ది సేపు కాలక్షేపం చేశారు. జలాశయం వద్ద కూడా ఫొటోలు తీసుకున్నారు. అనంతరం ఇక్కడ మెట్ల వద్ద శిరపురపు జగదీష్(18), పోతంశెట్టి సత్యశ్రీకర్(18), ప్రణిత్(18) ఈతకొట్టాలని భావించారు. తొలుత జగదీష్ దిగగా ఊబి లాగేసింది.
కొంచెం దగ్గర్లో ఉన్న ప్రణీత్ స్నేహితుడికి చేయి అందించడానికి ప్రయత్నించాడు. ఒడ్డున ఉన్న కొందరు స్విమ్మర్లు కర్రను జగదీష్ చేతికి అందించారు. ఇలా ప్రణీత్ చేయి విడిచి కర్ర పట్టుకున్న క్షణాల్లో జగదీష్ చేయి జారిపోయింది. ఆ సమయంలో సంఘటనను చూస్తూ ఉండలేక ఈత వచ్చిన శ్రీకర్.. స్నేహితుడ్ని రక్షించుకునే ఆరాటంలో దూకేశాడు. దురదృష్టం... శ్రీకర్‌నూ ఊబి లాగేసింది. ప్రణీత్ ప్రణాలతో జాగ్రత్తగా ఒడ్డుకొచ్చేశాడు. సమాచారం అందుకున్న పెందుర్తి సీఐ జె.మురళి హుటాహుటిన యల్లపువానిపాలెం నుంచి గజ ఈతగాళ్లు ఓంకార్, నూకరాజు, సిబ్బందితో చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీకర్ మృతదేహాన్ని ఈతగాళ్లు ఒడ్డుకు చేర్చగా.. గల్లంతైన జగదీష్ జాడ తెలియలేదు. మర్రిపాలెం అగ్నిమాపక సిబ్బంది, అధికారులు భద్రత పరికరాలతో వచ్చి ఫ్లడ్‌లైట్ల సాయంతో వలలు వేసి గాలింపు చేపడుతున్నారు. తహసీల్దార్ లాలం సుధాకర్‌నాయుడు, సహాయ పోలీసు కమిషనర్ అర్జున్ గాలింపు చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
శోకసంద్రంలో శ్రీకర్ తల్లిదండ్రులు
ఈ ఘటనతో జగదీష్, శ్రీకర్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రీకర్ కుటుంబం ఎన్ఏడీ జంక్షన్ వద్ద బుచ్చిరాజుపాలెంలో ఉంటోంది. తండ్రి మురళీకృష్ణ ఎన్ఏడీ జంక్షన్లో స్వీట్‌షాపు నిర్వహిస్తున్నారు. మురళీకృష్ణకు ఉన్న ఇద్దరి కుమారుల్లో శ్రీకర్ రెండో వాడు. మధ్యాహ్నం కళాశాల నుంచి వచ్చి ఇంట్లో భోజనం చేయకుండానే స్నేహితుల్ని కలిసి వస్తానంటూ వెళ్లి, ఇలా విగతజీవిగా వచ్చాడని శ్రీకర్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. శ్రీకర్ చిన్నాన్నలు దుఃఖం సాగరంలో మునిగిపోయారు.
కళాశాలకని వెళ్లి మృత్యుకుహకు..
శిరపురపు జగదీష్‌ది పెందుర్తి మండలం మల్లునాయుడుపాలెం గ్రామం. తండ్రి గణపతి విశాఖ–1 ఆర్టీసీ డిపో డ్రైవరుగా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమారుల్లో జగదీష్ రెండో వాడు. ఇంటి నుంచి ఉదయాన్నే కళాశాలకని చెప్పి బయలుదేరి వెళ్లాడు. క్యారేజి పట్టుకెళ్లమంటే ఇవాళ ఉపవాసం ఉంటానని చెప్పాడు. సంక్రాంతి పండుగ కదా.. త్వరగా వచ్చేయ్‌రా బాబూ అని తండ్రి గణపతి కోరితే ఇవాళ కుదరదని, శుక్రవారం నుంచి పండగ సెలవులని చెప్పడంతో తండ్రి సాయంత్రం వరకూ చూసి డ్యూటీకి బయలు దేరాడు. ఇంతలో వినకూడని కబురు చెవిలో పడింది. మేఘాద్రి రిజర్వాయర్‌లో కుమారుడు గల్లంతయ్యాడన్న వార్తతో గుండెలవిసేలా తల్లిదండ్రులు రోదించారు. కళాశాల నుంచి మధ్యాహ్నం బట్టలు కొనుక్కోడానికి వెళ్లి ఉంటే తన కుమారుడికి ఇలా జరిగేది కాదని సంఘటనా స్థలంలో గణపతి కన్నీరుమున్నీరై విలపించారు.