ఆ గ్రామం... ఓ కోచింగ్ సెంటర్
ఆ గ్రామం ఒకప్పుడు కట్టుబాట్లకు, బాల్యవివాహాలకు మారుపేరు... మూఢాచారాలు, ఛాందస భావాలకు ఆలవాలం... నాగరకత తెలియని వెనుకబాటుతనం... అలాంటి గ్రామం ప్రస్తుతం జీవనోపాధికి రాచబాటలు పరిచే ప్రదేశమైంది. ఎంతో కష్టపడితేనే కాని రాని ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించడం నల్లేరు మీద బండి నడకలా చేసింది. ఊళ్ళో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే అన్నంతగా అందరినీ తీర్చిదిద్దిన తూర్పుగోదావరి జిల్లాలోని నాగులాపల్లి గ్రామ విజయంపై ఫోకస్...
సరిగ్గా పందొమ్మిదేళ్ల క్రితం చాలా చిత్రంగా ఈ కథ ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామంలో 1995లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు అబ్బిరెడ్డి సత్తిరెడ్డి. ఆ మాస్టారి అకుంఠితదీక్ష, పట్టుదల కారణంగా ఆ గ్రామం ఉద్యోగాలకు మారు పేరుగా నిలిచింది. నాడు ఒక మనిషి నాటిన చిన్న మొక్క నేడు వృక్షమై పండ్లు, పువ్వులతో అలరారుతోంది.
ఒకప్పుడు...
సత్తిరెడ్డి మాస్టారు చదువుకునే రోజుల్లో పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడానికి వారి ఇంట్లో చదువుకున్నవారు ఎవ్వరూ లేరు. అందువల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కొని మరీ చదువు పూర్తి చేశారు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరిస్తే పదిమందికీ విద్య నేర్పి, నిరక్షరాస్యతను రూపుమాపేలా కృషి చేయవచ్చనుకున్నారు. అనుకున్నట్లుగానే ఉపాధ్యాయుడయ్యారు. ఆ తర్వాత వివిధ పాఠశాలల్లో పనిచేసి, 2002లో ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగవిరమణ చేశారు. అయినప్పటికీ విద్యాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషిచేసి, పలువురు విద్యార్థులు ఉద్యోగస్థులుగా ఎదగడానికి తోడ్పడ్డారు.
యువతకు చేయూత...
ఈ రోజుల్లో ఉద్యోగం సాధించడం కత్తిమీద సాములా మారింది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తే కాని ఉద్యోగాలు చేజిక్కించుకోవడం కష్టం. అందుకే విద్యార్థులకు విద్యతో పాటు, పోటీపరీక్షలలో ఎలా విజయం సాధించాలో నేర్పించారు సత్తిరెడ్డి మాస్టారు. కార్పొరేట్ శిక్షణ తీసుకుంటే తప్ప పోటీపరీక్షలను ఎదుర్కోలేమనే పరిస్థితులను విద్యార్థుల మదిలో నుంచి తప్పించారు. కొందరు విద్యార్థులను కూడగట్టి, వారికి శిక్షణనిచ్చి, పోటీపరీక్షలకు పంపించారు. ఆశ్చర్యకరంగా ఆ విద్యార్థులంతా విజయం సాధించారు. దాంతో ఉద్యోగాలు సంపాదించిన ఆ విద్యార్థులంతా ఇంటింటికీ వెళ్లి ఉద్యోగస్థులందరినీ ఉత్తేజితుల్ని చేసి, ఆ గ్రామం నుంచి పోటీపరీక్షలకు వెళ్లే విద్యార్థులకు శిక్షకులుగా మారారు.
ఎటువంటి ఫలితం ఆశించకుండా చేసిన కృషి సత్ఫలితాలనివ్వడంతో ఆ గ్రామానికి చెందిన 15 మంది పూర్వ విద్యార్థులతో 2002లో నాగులాపల్లి ఎంపాయీస్ వెల్ఫేర్ సొసైటీ (ఎన్ఈడబ్లూఎస్ - న్యూస్) ప్రారంభమైంది. అది దినదిన ప్రవర్థమానమవుతూ, ప్రస్తుతం ఆ సంఖ్య 125కి పెరిగింది. వీరిలో అధికశాతం మంది ఉపాధ్యాయులే. ప్రతిఫలాపేక్ష లేకుండా పోటీపరీక్షలకు తర్ఫీదునిస్తూ... కృషితో నాస్తి దుర్భిక్షమని నిరూపించారు.
సంఘం విధివిధానాలు...
ఆ సంఘంలో సభ్యులంతా ప్రతినెలా సమావేశం ఏర్పాటుచేసుకుని, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించుకుంటారు. ఫీజు తీసుకోకుండా అన్ని పోటీపరీక్షలకు తర్ఫీదునివ్వడంతో పాటు అవసరమైతే పేదవిద్యార్థులకు పోటీపరీక్షల ఫీజులు కూడా తామే చెల్లిస్తారు. ఏ విధమైన రిజర్వేషన్ లేకుండా ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించడం నాగులాపల్లి యువతీయువకులకు ఆనవాయితీగా మారేలా చేసింది ఆ సంఘం. పేద, వికలాంగ విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం, విశేష ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, పదవతరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనివ్వడం, గ్రామంలో పాఠశాలలకు కావాల్సిన సామగ్రిని సమకూర్చడం, అక్షరాస్యతా కార్యక్రమాలు నిర్వహించడం, వేసవి సెలవుల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించి విద్యావంతులుగా తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఆశయాలు...
ప్రస్తుతం ఈ సంఘం 125 మందికి పైగా సభ్యులతో కొనసాగుతోంది. ‘‘నేను ఉద్యోగం సాధిస్తే, ఇక జీవితంలో స్థిరపడిపోయినట్లేననే స్వార్థ భావన లేకుండా, తోటివారికి సహాయం చేయకపోతే అది నన్ను అవమానించినట్లే’’ అని పలికిన ఆ మాస్టారి మాటలను తు.చ తప్పకుండా పాటిస్తున్నారు ఈ సంఘ సభ్యులు. విజ్ఞానాన్ని పదిమందికి పంచినపుడే మంచి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందగలరని ఆయన చేసిన సూచనలు ఆ విద్యార్థులను మరింత స్ఫూర్తిదాయకంగా నిలబెడుతున్నాయి. సత్తిరెడ్డి మాస్టారు 2010 సంవత్సరంలో కాలం చేసినప్పటికీ ఆయన స్ఫూర్తితో ఆ సంఘ అభివృద్ధికి ఆయన శిష్యులు నేటికీ కృషి చేస్తూనే ఉన్నారు.
- విఎస్విఎస్ వరప్రసాద్, న్యూస్‌లైన్, పిఠాపురం.
విద్యార్థుల విజయం...
నాగులాపల్లి ఎంపాయీస్ వెల్ఫేర్ సొసైటీ (న్యూస్) కృషి ఫలితంగా ఆ గ్రామంలో 600 మందికి పైగా ప్రభుత్వోద్యోగులున్నారు. ప్రస్తుతం పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న ఆర్. అమ్మిరెడ్డి, శ్రీకాకుళం ఉపాధి కల్పనాధికారి చింతపల్లి సుబ్బిరెడ్డి, అస్సాంలో మిలటరీలో కమాండర్‌గా ఉన్న విజయకుమార్లాంటి పలువురు నాగులాపల్లికి చెందినవారే.
- వైవీవీ రామారెడ్డి, అధ్యక్షులు,నాగులాపల్లి
ప్రోత్సాహమే ఉద్యోగస్థులుగా చేసింది...
ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనుకున్న తరుణంలో పైసా ఖర్చు పెట్టనవసరం లేకుండా ‘న్యూస్’ సభ్యులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. 2008 డీఎస్సీలో ఉద్యోగం సాధించాను. నాగులాపల్లి పక్కనే ఉన్న తోటూరులో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను.
- కోటా హైమావతి, టీచర్, నాగులాపల్లి