భార్యపై కోపంతో ఇంటికి నిప్పు
బుట్టాయగూడెం : భార్యపై కోపంతో ఇంటికి నిప్పుపెట్టిన ఓ వ్యక్తి ఉదంతమిది. బుట్టాయగూడెం దేవుడుమాన్యం ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. బుట్టాయగూడెం దేవుడుమాన్యంకు చెందిన ఎడల్లి దుర్గ నెలరోజుల క్రితం మొగల్తూరుకు పనికి వెళ్లింది. తిరిగి సోమవారం ఉదయం ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త శ్రీను మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. వారిద్దరినీ సముదాయించేందుకు శ్రీను అత్త నరసమ్మ యత్నించింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీను అత్తతోపాటు భార్యను కొట్టాడు. దీంతో దుర్గ స్పృహæ కోల్పోయింది. అప్పటికీ కోపం తగ్గని శ్రీను ఇంట్లోకి వెళ్లి అగ్గిపెట్టె తీసుకొని గ్యాస్పైప్ను లీస్ చేసి ఇంటికి నిప్పు అంటిం చాడు. దీనిని గమనించిన సమీపంలోని కొందరు ఇంట్లోని గ్యాస్ సిలిండర్న బయటకు తీసుకువచ్చేశారు. అయితే ఒక్క సారిగా మంటలు పక్కనే ఉన్న మనిల్లి నాగేశ్వరరావు ఇంటితోపాటు నరసమ్మ ఇంటికీ ఎగబాకాయి. ఫలితంగా మూడిళ్లూ పూర్తిగా దగ్ధమయ్యాయి. నరసమ్మ, నాగేశ్వరరావు ఇళ్లలోని సామాన్లను స్థానికులు బయటకు తీసుకువచ్చే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్థానికులు శ్రీనుని ఎస్ఐ డి.రవికుమార్‌కు అప్పగించారు. జంగారెడ్డిగూడెం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. తహసీల్దార్ ఎ.జి.చిన్నికృష్ణ బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
బాధితులను ఆదుకోవాలి
ఇదిలా ఉంటే బాధితులను ఫ్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోరారు. దేవుడుమాన్యం లోని కాలిపోయిన మూడిళ్లతోపాటు దాసియ్యపాలెంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకూ ఐఏవై ఇళ్లు మంజూరు చేయాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.