గౌహతి హైకోర్టు తీర్పును సమర్థించిన ఆర్.అశోక్
సాక్షి, బెంగళూరు: దేశంలో దర్యాప్తు సంస్థల్లో ఒకటైన సీబీఐకి రాజ్యాంగా పరంగా ఎటువంటి గుర్తింపులేదని చెప్పిన గౌహతి హైకోర్టు తీర్పును మాజీ ఉపముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు ఆర్. అశోక్ సమర్థించారు. బెంగళూరులోని బీటీఎం లేఔవుట్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ప్రధాని కావాలని కాంక్షిస్తూ బీజేపీ కార్యకర్తలు శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటి వరకూ వివిధ కేసుల్లో సీబీఐ ప్రవర్తించిన తీరు హాస్యాస్పదమని అన్నారు. కర్ణాటకలోని లోకాయుక్త, కేంద్ర ఎన్నికల కమిషన్ల తరహాలో సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తి సాధించినపుడు మాత్రమే సీబీఐ పారదర్శకతపై ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మాజీ మంత్రి జీవరాజ్పై నమోదైన లైంగికదాడి కేసు పూర్తిగా నిరాధారమైనదని ఆర్.అశోక్ పేర్కొన్నారు.
2010లో లైంగికదాడి జరిగితే బాధితురాలు కేసు పెట్టడానికి మూడేళ్లు సమయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. జీవరాజ్ను గత కొంతకాలంగా కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు కేసు కూడా నమోదైందని గుర్తుచేశారు. మొదట జీవరాజ్ ఎదుర్కొన్న బ్లాక్మెయిల్పై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.