R C Khuntia
-
ఓట్ల కోసం బీజేపీ ఏమైనా చేస్తుంది: కుంతియా
సాక్షి, హైదరాబాద్ : శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి మతంతో ఎందుకు ముడిపెడుతున్నారని పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్ సీ కుంతియా ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకు రావడం ద్వారా ఓ మత వర్గాన్ని టార్గెట్ చేసినట్లు అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయనిక్కడ మాట్లాడుతూ.. రాజ్యాంగ పీఠికలో మనకు స్వేచ్ఛ.. హక్కును ఇచ్చిందని, దీనిని మార్చలేమని అన్నారు. సీఏఏ, ఎన్నార్సీ వంటివి రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓ నినాదంతో ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు రామ్ జన్మభూమి నినాదం ఎత్తుకుందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ ఏమైనా చేస్తుందని, నోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద లైన్లలో నిలబడి 200 మందికి పైగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. (సీపీ అంజనీ కుమార్‌పై విరుచుకుపడ్డ ఉత్తమ్) దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యిందని కుంతియా విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల ముందు శరద్ పవార్‌కు వ్యతిరేకంగా దాడులు జరిపించారని ఆరోపించారు. 2014 నుంచి దేశంలో జరుగుతున్న ప్రతి ఉద్యమంలో రాహుల్ గాంధీ చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. ఏఐసీసీ ఆదేశాలతో ‘భారత్ బచావో’ అనే నినాదంతో ర్యాలీ చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ర్యాలీ చేయనీయడం లేదని మండిపడ్డారు. పోలీసులు రాజ్యాంగ బద్దంగా పనిచేయాలని సూచించారు. కేసీఆర్, ఎంఐఎం ప్రధాని నరేంద్రమోదీ కోసం పనిచేస్తున్నారని కుంతియా విమర్శించారు. చదవండి: 'కేసీఆర్ పాలన సామాజ్య్ర వాద శక్తులకంటే దారుణం' -
రైతు బంధు ఎన్నికల జిమ్మిక్కు: కుంతియా
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఎన్నికల జిమ్మిక్కు అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా విమర్శించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, నాలుగేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేయని కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడటంతో మళ్లీ అధికార దాహంతో ప్రవేశపెట్టారని ఆరోపించారు. ఈ పథకానికి తాము వ్యతిరేకం కాదని, పెట్టుబడి సాయం కింద కౌలు రైతులను విస్మరించడం సరికాదని అన్నారు. ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఇచ్చిన రుణమాఫీ హామీని ఒకే దఫాలో చేయకపోవడం వల్ల రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు లభించిన గిట్టుబాటు ధర ఇప్పుడు లభించడం లేదన్నారు. పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా పెట్టుబడి కింద నిధులివ్వడం వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. రైతుబంధు పథకం కూడా టీఆర్ఎస్ నేతలకే ప్రయోజనకరంగా ఉందని, రైతులకు ఉపయోగపడదన్నారు. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగా టీఆర్ఎస్ చేస్తున్న ఈ మోసాన్ని ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. -
కుంతియాకు ఆ అధికారం లేదు..
నల్లగొండ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోనే ముందుకెళ్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా వ్యాఖ్యలతో కోమటిరెడ్డి సోదరులు విభేదించారు. 2019వరకూ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కొనసాగుతారని చెప్పే అధికారం కుంతియాకు లేదని వారు స్పష్టం చేశారు. దీనిపై త్వరలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలుస్తామన్నారు. యువకుల నాయకత్వంలోనే కాంగ్రెస్ ముందుకు వెళుతుందని కోమటిరెడ్డి సోదరులు అభిప్రాయపడ్డారు. త్వరలోనే సోనియా, రాహుల్‌ను కలుస్తాం తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియా వచ్చి చెప్పినంత మాత్రాన అయ్యేదేమీలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..కార్యకర్తలు, జనాలకు దగ్గరగా ఉండే నాయకుల నాయకత్వం కోరుకుంటున్నారని పరోక్షంగా పీసీసీ నాయకత్వ మార్పు మాట్లాడారు. తొందర్లోనే రాహుల్, సోనియా గాంధీలను కలిసే అవకాశముందని, కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దని కోరారు. త్వరలోనే యువరక్తం ఉన్న నాయకుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రభుత్వం మూడున్నరేళ్లుగా భర్తీ చేయలేని ఉద్యోగాలను ఒక్క ఏడాదిలో ఎలా భర్తీ చేస్తుందని ప్రశ్నించారు. వెంటనే లక్ష ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అధిష్టానానిదే తుది నిర్ణయం తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియాపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. భువనగిరిలో విలేకరులతో మాట్లాడుతూ.. 2019 వరకూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని అనే అధికారం కుంతియాకు లేదని, ఆ వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. హైకమాండ్‌కు ప్రస్తుత నాయకత్వం నచ్చకపోతే ఎన్నికల్లోగా మార్చవచ్చునని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఒక నయీంను చంపి వంద నయీమ్‌లను సృష్టించాడని ఆరోపించారు. వినాశకాలే విపరీతబుద్ధి అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే నయీం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే భువనగిరి నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు.