
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఎన్నికల జిమ్మిక్కు అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా విమర్శించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, నాలుగేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేయని కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడటంతో మళ్లీ అధికార దాహంతో ప్రవేశపెట్టారని ఆరోపించారు. ఈ పథకానికి తాము వ్యతిరేకం కాదని, పెట్టుబడి సాయం కింద కౌలు రైతులను విస్మరించడం సరికాదని అన్నారు.
ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన రుణమాఫీ హామీని ఒకే దఫాలో చేయకపోవడం వల్ల రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు లభించిన గిట్టుబాటు ధర ఇప్పుడు లభించడం లేదన్నారు. పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా పెట్టుబడి కింద నిధులివ్వడం వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. రైతుబంధు పథకం కూడా టీఆర్‌ఎస్ నేతలకే ప్రయోజనకరంగా ఉందని, రైతులకు ఉపయోగపడదన్నారు. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగా టీఆర్‌ఎస్ చేస్తున్న ఈ మోసాన్ని ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment