‘ఖైదీల విడుదల’పై ఇతర రాష్ట్రాలకూ నోటీసులు
సెప్టెంబర్ 17న తుది విచారణ జరుపుతామన్న సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: క్షమాభిక్షపై ఖైదీలను విడుదల చేయాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గతంలో ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు.. తాజాగా దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలకూ నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లోగా వాటికి జవాబివ్వాలని ఆదేశిస్తూ.. ఈ వ్యవహారంపై సెప్టెంబర్ 17న తుది విచారణ చేపడతామని పేర్కొంది. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి 150 ఏళ్లు పూర్తయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని 2007లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,500 మంది ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేయాలని నిర్ణయించగా.. న్యాయవాది ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి దాన్ని సవాల్‌చేస్తూ పిటిషన్ వేయడంతో ఆ ప్రక్రియ నిలిచిన సంగతి తెలిసిందే.
తుది విచారణ నిమిత్తం ఈ వ్యాజ్యం సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. ఖైదీల విడుదలకు సంబంధించి మిగతా రాష్ట్రాలను కూడా ప్రతివాదులుగా చేర్చారా? అని జస్టిస్ సదాశివం పిటిషనర్ తరఫు న్యాయవాది గల్లా సతీష్‌ని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలను ప్రతివాదులుగా పేర్కొనలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రమే సవాల్ చేసినట్టు ఆయన బదులిచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. ఖైదీలకు క్షమాభిక్ష వ్యవహారంపై విచారిస్తున్నందున మిగతా రాష్ట్రాలకు కూడా నోటీసులు జారీచేయాలని, ఆయా రాష్ట్రాలు నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.
కాగా, తన క్లయింట్‌పై మావోయిస్టు ముద్ర వేశారని, పోలీసులు పర్సనల్ ఫైల్ తెరిచారని, దీనికి సంబంధించి తాము దాఖలు చేసిన వ్యాజ్యకాలీన దరఖాస్తును విచారించాలని సతీష్ విన్నవించారు. దీనికి సదాశివం స్పందిస్తూ.. తుది విచారణ సమయంలో దాన్నీ విచారిస్తామని చెప్పారు. తమిళనాడులో ఖైదీల విడుదలకు సంబంధించి సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను కూడా ప్రస్తుత పిటిషన్‌కు జత చేయాలని, రెండింటినీ కలిపి తుది విచారణ జరుపుతామని జస్టిస్ సదాశివం రిజిస్ట్రీని ఆదేశించారు.