ఎన్టీఆర్ సుజల పథకం కోసం సాంకేతిక నిపుణుల కమిటీ
హైదరాబాద్: ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే ఇరువై లీటర్ల మంచినీటి క్యాన్ అందజేసేందుకు ఉద్దేశించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. పథకం అమలుకు విధివిధానాలు ఖరారు చేసేందుకు ముగ్గురు మంత్రుల ఉప సంఘం ఏర్పాటు కాగా.. మంత్రుల ఉప సంఘం ఈ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు పంచాయితీ రాజ్ రిటైర్టు సీఈ ఆర్. కొండలరావు చైర్మన్‌గా మొత్తం 8 మందిని ఈ కమిటీలో సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పథకం అమలులో నీటి శుద్ధి చేయడానికి ఏర్పాటు చేసే ఫ్లాంట్లకు ఎలాంటి మిషనరీలను ఉపయోగించాలి.. గ్రామాల్లో ఏర్పాటు చేసే ఫ్లాంట్‌కు ఎంత ఖర్చు అవుతుంది.. ఫ్లాంట్ నిర్వహణను మహిళా సంఘాలు, ఎన్జీవో సంస్థలను అప్పగిస్తే ఎలా ఉంటుందన్న తదితర అంశాలపై అధ్యయనం చేసి, వీలునుబట్టి జూలై పదవ తేదీలోగా కమిటీ తమ నివేదికను అందజేయాలని ప్రభుత్వం కోరింది.