రాశి మారింది...సెంటిమెంట్ పండింది!
సినిమా నేపథ్యం లేదు. లక్షల ఆస్తీ లేదు. ఉన్నదల్లా సినిమా పిచ్చి. దాంతోనే సినిమా తీసేయొచ్చా? డెఫినెట్‌గా తీసేయొచ్చు. ఇది కాశీమజిలీ కథ కాదు. నిర్మాత ‘రాశీమూవీస్’ నరసింహారావు కథ.
ఊరు రాజమండ్రి. చిన్నతనం నుంచీ సినిమాలు చూసీ చూసీ సినిమా ఫీల్డ్‌లో స్థిరపడాలనే కోరిక. ధవళేశ్వరం ఎలిమెంటరీ స్కూల్లో తనకు ఒకటో తరగతిలో పాఠం చెప్పిన రాజబాబు మాస్టారు ఇప్పుడో సూపర్ కమెడియన్. ఆయనో ఇన్స్పిరేషన్. మరో పక్క శోభన్‌బాబు అంటే విపరీతమైన అభిమానం. ఇవన్నీ కలగలిసి నరసింహారావుని కుదురుగా కూర్చోనివ్వలేదు. అప్పుడే తమిళంలో కమల్‌హాసన్ చేసిన ‘మన్మథలీల’ సినిమా పెద్ద హిట్టు. దాన్ని డబ్ చేద్దామని మద్రాసు బయల్దేరాడు. ఈలోగా నిర్మాత విజయబాపినీడు రైట్స్ కొనేశారు. ఈ విషయం తెలిసి విజయబాపినీడు దగ్గరకు వెళ్లి ‘‘నేను డబ్ చేయాలనుకున్నా... కనీసం తూర్పు గోదావరి జిల్లా పంపిణీ హక్కులు ఇవ్వండి’’ అని హామీ తీసుకున్నాడు నరసింహారావు. ‘మన్మథలీల’ విడుదలై నరసింహారావుకి రూపాయికి పది రూపాయల లాభం తెచ్చిపెట్టింది. తదుపరి వాసిరెడ్డి నాగేశ్వరరావుతో కలిసి మురళీమోహన్‌తో ‘మంగళగౌరి’ అనే సినిమా మొదలెట్టారు. మొత్తం డబ్బు పోయింది.
అయినా నరసింహారావు నిరాశపడిపోలేదు. ఆ టైమ్‌లో శోభన్‌బాబు గుర్తొచ్చాడు. ఇన్నాళ్లూ ఫ్యాన్‌గా చాలాసార్లు కలిశాడు. ఈసారి నిర్మాతగా కలిశాడు. శోభన్‌బాబుకి మాత్రం నమ్మకం కుదరక డేట్లు ఇవ్వలేదు. రచయిత సత్యమూర్తి, నరసింహారావుకు క్లోజ్‌ఫ్రెండ్. ఆయన సిఫార్సుతో శోభన్‌బాబు ‘‘సరే టెస్ట్ చేద్దాం’’ అనుకున్నాడు. అప్పట్లో ఆయన రెమ్యునరేషన్ ఆరు లక్షలు. కానీ నరసింహారావుని తొమ్మిది అడిగాడు. వెంటనే ఓకే చెప్పేయడం, 50 వేలు అడ్వాన్స్ ఇచ్చేయడం జరిగిపోయింది. దర్శకునిగా ఏ.కోదండరామిరెడ్డిని అనుకుని 10 వేలు అడ్వాన్స్ ఇచ్చొచ్చారు. శోభన్‌బాబు సందేహ పడ్డట్టుగానే అప్పుడు నరసింహారావు దగ్గర ఉన్నది 60 వేలే. అదికాస్తా అడ్వాన్స్‌గా వెళ్లిపోయింది. ఇప్పుడు సినిమా తీయడానికి డబ్బులు ఎలా? గుండె దడ దడా కొట్టుకుంటోంది. అన్నిటికంటే సంకల్పబలం గొప్పదంటారు.
నిర్మాత కావాలన్న నరసింహారావు సంకల్పం ఫలించింది. శోభన్‌బాబు ‘దేవత’ రిలీజై సూపర్‌హిట్. ఇటు పక్క కోదండరామిరెడ్డి ‘ఖైదీ’ బంపర్‌హిట్. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే బయ్యర్లు ఎగబడ్డారు! ఒక్క రూపాయి ఫైనాన్స్ లేకుండా బయ్యర్లు డబ్బు గుమ్మరించిపోయారు. ఇప్పుడు సినిమా పని మొదలైంది. రజనీకాంత్, రాధ, అంబిక నటించిన తమిళ సినిమా ‘ఎంగయో కేట్ట కురళ్’ నరసింహారావుకి బాగా నచ్చేసింది. దీన్నే రీమేక్ చేస్తే? అయితే.. అది యావరేజ్ సినిమా. కానీ వెనుక సత్యమూర్తి ఉన్నాడనే మొండి ధైర్యం. నిర్మాత పంజు అరుణాచలం దగ్గరకెళ్లి పాతికవేలకి రైట్స్ కొన్నాడు. దాన్ని సత్యమూర్తి బ్రహ్మాండంగా చిత్రిక పట్టాడు. ఒరిజినల్ కన్నా బ్రహ్మాండంగా కథ తయారీ. మాటలూ సత్యమూర్తివే.
అదే ఆయనకు డైలాగ్ రైటర్‌గా తొలి సినిమా. సుహాసిని, రాధిక, గుమ్మడి, మురళీమోహన్, రావుగోపాల్రావు, అల్లు రామలింగయ్య... ఇలా అందరి డేట్లూ తీసేసుకున్నారు. బేనర్ పేరు ఏం పెట్టాలి? మద్రాసులో నరసింహారావు ఇంటి పక్కనే ‘మరో చరిత్ర’ సరిత ఉంటారు. ‘‘మద్రాసులో రాశీ సిల్క్స్ ఫేమస్. మీరు రాశీ మూవీస్ అని పెట్టుకోండి’’ అని సలహా ఇచ్చిందామె. అలా ‘రాశీమూవీస్’ సంస్థ పుట్టింది. షూటింగ్ స్టార్ట్. అంతా మద్రాసులోనే. 27 రోజుల్లో సినిమా కంప్లీట్. 23.5 లక్షల బడ్జెట్. 27 లక్షలకు వ్యాపారం. రిలీజ్‌కి ముందే మూడున్నర లక్షల టేబుల్ ప్రాఫిట్. 1984 ఫిబ్రవరి 2న సినిమా రిలీజ్. కర్చీఫ్ లేకుండా సినిమా చూడకూడదని ప్రేక్షకులకు అర్థమైపోయింది. సినిమా సూపర్‌హిట్. బయ్యర్లకు డబ్బులే డబ్బులు.
వైజాగ్ 3 లక్షల పాతికవేలకు కొన్న బయ్యర్‌కి పాతిక, 30 లక్షలు వచ్చిందంటే ఈ సినిమా రేంజ్ అర్థం చేసుకోవచ్చు. 16 కేంద్రాల్లో వందరోజులు ఆడింది. ఇదే కథ హిందీలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘సుహాగ్’గా వచ్చింది. కన్నడంలో కూడా ఎవరో సంగ్రహించి సినిమా తీసేశారు. ‘బావా మరదళ్లు’ వల్ల నరసింహారావుకి రెండు లాభాలు. నిర్మాతగా సెటిల్మెంట్. శోభన్‌బాబు కోటరీలో ప్లేస్మెంట్. ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇచ్చారు శోభన్‌బాబు. ఈ 30 ఏళ్లలో నరసింహారావు 16 సినిమాలు తీశారు. అందులో ఆరు సినిమాలు శోభన్‌బాబుతోనే. రాశీమూవీస్ అంటే శోభన్‌బాబు సొంత సంస్థ అన్నంతగా మమేకమైపోయారు. శోభన్‌బాబుతో ‘మహారాజు’, ‘పున్నమి చంద్రుడు’, ‘భార్యాభర్తలు’ లాంటి మంచి సినిమాలు తీశారు. ‘పున్నమిచంద్రుడు’ సినిమా టైమ్‌లో శోభన్‌బాబుకి 3 లక్షలు బాకీ పడ్డారు.
ఆయన అడగలేదు కానీ, ఈయనలో ఏదో గిల్టీ ఫీలింగ్. సినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత 3 లక్షలు తీసుకెళ్లి శోభన్‌బాబుకి ఇచ్చేశారు. ‘ఎక్కడిదీ డబ్బు?’ అనడిగాడు శోభన్‌బాబు. ‘‘మద్రాసులో ఉన్న స్థలంలో సగం అమ్మేశాను’’ అని చెప్పారు నరసింహారావు. ‘‘చూడు... నరసింహారావు. నీకు ముగ్గురు కూతుళ్లు. ఇక్కడ నువ్వు సంపాదించుకున్నది ఏమీ లేదు. ఆ ఆస్తి కూడా వాళ్లకు మిగల్చవా?’’ అని క్లాస్ పీకి, అప్పటికప్పుడు ఆ స్థలాన్ని మైనర్ ప్రాపర్టీ కింద ముగ్గురమ్మాయిలకి రాయించేశారు. ఆ తర్వాతి కాలంలో నరసింహారావుకి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ఆ స్థలాన్ని అమ్మలేని పరిస్థితి. అప్పుడు పది లక్షల స్థలం ఇప్పుడు చాలా విలువ పెరిగిపోయింది. ఇదంతా శోభన్‌బాబు చలవే అని నరసింహారావు చెబుతారు.
‘నన్ను టెస్ట్ చేయడానికి శోభన్‌బాబు ముందు ఎక్కువ పారితోషికం చెప్పారు కానీ, ఫైనల్‌గా మామూలుగానే డబ్బు తీసుకున్నారు. నిర్మాతగా ఇన్నేళ్లు నిలబడ్డానంటే దానికి ప్రధాన కారణం శోభన్బాబుగారే. రచయిత సత్యమూర్తిగారి సపోర్ట్ కూడా మరిచిపోలేను. ఈ సినిమాకు రకరకాల టైటిల్స్ అనుకున్నాం. నేను ఛాంబర్ నుంచి మొత్తం సినిమాల లిస్ట్ తెప్పించి చూస్తే ‘బావా మరదళ్లు’ ఆసక్తికరంగా అనిపించింది. అదే మా కథకు సరిపోతుందనుకున్నాం. బాలనటిగా మీనాకు ఇదే తొలి సినిమా. ఎస్పీ బాలసుబ్రమణ్యంగారి అమ్మాయి పల్లవి ఇందులో ఫస్ట్‌టైమ్ పాట పాడింది. శోభన్‌బాబుగారితో సుహాసినికిదే తొలి సినిమా. ఆ తర్వాత వీరిద్దరిదీ ఎంత పెద్ద హిట్ కాంబినేషన్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా రిలీజైన 50 రోజుల తర్వాత స్లాబ్ సిస్టమ్ మొదలైంది. టిక్కెట్ల అమ్మకాన్ని బట్టి పన్ను కట్టే పద్ధతి కాకుండా, ఒక వారంలో 21 ఆటలకు పూర్తిగా పన్ను కట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినా మా సినిమా ఎక్కడా తగ్గలేదు.