పెంచిన డిగ్రీ ఫీజులను తక్షణమే తగ్గించాలి
జాతీయ రహదారిపై నన్నయ’ విద్యార్థుల రాస్తారోకో
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : యూనివర్సిటీ పరిధిలో ఉభయ గోదావరి జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో పెంచిన డిగ్రీ ఫీజులను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదికవి నన్నయ యూనిర్సిటీ విద్యార్థులు రోడెక్కారు. వర్సిటీకి ఎదురుగా ఉన్న 16వ నంబరు జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించి, అనంతరం వర్సిటీ భవనం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎ. రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి ఎస్.రామ్మోహన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సెమిస్టర్ విధానంతో ఇప్పటికే రెండు పర్యాయాలు ఫీజులు చెల్లించాల్సిన వస్తున్న సమయంలో వాటిని మరింత పెంచడం అన్యాయన్నారు. రెండు సెమిస్టర్లకు బీఏలో రూ.1610, బీఎస్సీలో రూ. 1810 చొప్పున వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఇతర విద్యాలయంలోను ఇంతభారీగా ఫీజులు లేవన్నారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజుల నెపంతో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడం సరికాదన్నారు. తక్షణమే వీటిపై ప్రభుత్వం పునరాలోచించి, పెంచిన ఫీజులను తగ్గించాలన్నారు. ప్రతి డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, అనుబంధ హాస్టల్స్ని నెలకొల్పాలని కోరారు. ధర్నా అనంతరం వీసీ ఆచార్య ముత్యాలునాయుడికి వినతిపత్రం అందజేశారు. ఉభయ గోదావరి జిల్లాల పీడీఎస్యూ అధ్యక్ష, కార్యదర్శులు బి.సిద్దూ, ఆర్.తిరుపతిరావు, కె.నాని, ఈ. భూషణం, తదితరులు పాల్గొన్నారు.