ఖాళీ చేసిన మూల
స్టేషన్లోకి ట్రెయిన్ వచ్చి చాలా సేపయింది. కుడిచేత్తో టిక్కెట్టూ, ఎడం చేత్తో తోలుసంచీ పట్టుకుని పరిగెత్తేడు రాజు ప్లాట్ఫారం వైపు. పచ్చకోటు తొడుక్కొని ముందు పోతూన్న ఒకణ్ణి తోసేయబోతూంటే, ‘‘ఎందుకలా గాభరా పడతావయ్యా! ఎక్కడానికి టైముందిలే’’ అని కసిరేడు టికెట్ కలెక్టరు.
టికెట్ కలెక్టరు ఆపినందుకూ కసిరినందుకూ కించపడలేదు రాజు. ‘‘ఆహా! ఇంకా టైముందండీ?’’ అని నిట్టూర్చి ప్రశ్నించేడు. ‘‘ఓ! చచ్చినంత’’ అన్నాడు టీసీ టికెట్ పంచ్ చేస్తూ.
పచ్చకోటు తొడుక్కున్నవాడు ప్లాట్ఫారంలోకి ముందుగా పోయేడు. ఆ వెనకే రాజు కూడా వెళ్లేడు.
మేనల్లుడి పెళ్లికి వెళ్లకపోతే బావుండదని బయల్దేరేడు. బండి తప్పిపోయిందని అక్కయ్య నమ్మదు, బావకి కోపం వస్తుంది. పెళ్లిళ్ల రోజులవడం చేత జనం కిటకిటలాడుతున్నారు.
చివరిదాకా నడిచి ‘‘అదృష్టం బావుంది’’ అనుకున్నాడు. ఆఖరి కంపార్ట్మెంటు ఖాళీగా వుంది. కిటికీలోంచి లోనికి చూస్తే వెనకవైపు కిటికీ దగ్గర కార్నర్ సీట్లో ఎవరూ ఉన్నట్టు లేదు. మరీ అదృష్టం! సంతోషిస్తూ లోనికి ఎక్కబోయేడు రాజు.
అతనికంటే ఒక్కడుగు ముందయేడు పచ్చకోటువాడు. తిన్నగా పోయి కిటికీ పక్క మూల సీట్లో కూర్చున్నాడు. అతణ్ణి మనసులో తిట్టుకొంటూ గత్యంతరం లేక అతనికి ఎదుట సీట్లో కూర్చున్నాడు రాజు. కొంచెం సర్దుకొని, టిక్కెట్టు పర్సులో భద్రంగా పెట్టి, సంచీ వారకి పెట్టి, చెప్పులు కిందకి విడిచి, మఠం వేసుక్కూర్చుని కంపార్ట్మెంటంతా కలయజూసేడు. పదిమందికంటె ఎక్కువ లేరు. అంత తక్కువ మంది ఉన్నప్పటికీ తనకి కార్నర్ సీటు దొరకనందుకు పచ్చకోటువాణ్ణి చూస్తే ఒళ్లు మండుకొచ్చింది.
పచ్చకోటు చెప్పలేనంతగా మాసింది. అతను తొడుక్కున్న షర్టు తెల్లగా పువ్వులా ఉంది. కట్టుకున్న మాసీ మాయని పంచ అక్కడక్కడ చిరిగింది. నెత్తిమీద పెట్టుకున్న నల్లటి మరాఠీ టోపీ కింద జుత్తు బాగా పండినట్టు కనిపిస్తోంది. వయసు నలభైకి మించకపోవచ్చు. ముక్కు ఎత్తుగా ఉండడం చేతా, కళ్లు లోతుకు పోవడం చేతా, మనిషి గెద్దలా ఉన్నాడు. అతను ఎవ్వరివైపూ చూడ్డం లేదు. కిటికీలో ఎడం చెయ్యి ఆన్చుకొని, కాల్తున్న సిగరెట్టు కుడిచేత్తో పట్టుకొని ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు.
‘‘వీడి పిండాకూడుగాని పచ్చరంగు కోటు తొడుక్కోడం ఏమిటి?’’ అని రాజు అనుకొంటూండగా ట్రెయిన్ కదలింది. రాజు న్యూస్ పేపర్ తీసేముందు చుట్ట ముట్టించేడు. పేపర్లో నచ్చిన వార్తలేవీ కనిపించడం లేదు. మలయా పరిస్థితి గురించి, కొరియా యుద్ధం గురించి చేటభారతం రాసేరు. వెధవ గోల! థూ! ఉమ్ముకోవడానికి కిటికీ దగ్గరికి పోవాలి. అక్కడే కూర్చుంటే ఎంత బావుండేది! పేపరు మడత పెట్టేశాడు. చేసేదిలేక అటూ ఇటూ చూస్తున్నాడు. ఏదో స్టేషను దగ్గరవుతూన్నట్టుంది. కళ్లు మూసుకొని కిటికీవార పడుకున్నా బావుండేది.
‘‘మీరెక్కడండీ దిగుతారూ?’’ అని పచ్చకోటువాణ్ణి ప్రశ్నించేడు. అతను జవాబు చెప్పలేదు. ప్రశ్న విన్నట్టుగానే లేదు. లోతుకుపోయిన కళ్లతో లోతుల్లోకి చూసుకొంటున్నాడు. జవాబు చెప్పడేం?
‘‘ఏమండోయ్, మిమ్మల్నే’’ గట్టిగా అరిచేడు రాజు. సుఖంగా నిద్ర పోదామని సిద్ధమయ్యేసరికి పక్కనున్నవాళ్లు అల్లరిచేస్తే ఎంత కోపంగా ఉంటుందో అలావుంది పచ్చకోటువాడి ముఖం. ‘‘ఎక్కడకో అక్కడికి వెళ్తాను’’ అని విసురుగా తలమీద టోపీ తీసి బల్లమీద పడేశాడు.
ఏమిటీ? వీడి పొగరూ? టోపీ తీసేయడంతో అతని ఎండిన పీచు జుత్తు గాలికి చెదురుతోంది. చెవులు పెద్దవిగా కనిపిస్తున్నాయి. గెడ్డం బాగా మాసింది. రాజు కంటికి అతను వికృతంగా కనిపించేడు.
మర్యాదా లేదు మప్పితం లేదు. జవాబివ్వలేదేం సరిగ్గా! రోజల్లా నా ఎదట దిష్టిపిడతలా కూర్చుంటాడు కాబోలు.
వీడెక్కడికి వెళ్తే నాకేం? వల్లకాట్లోకి పోతాడు. కాని, పెట్టేబేడా తెచ్చుకోలేదే వీడు! వాటం చూస్తే టిక్కెట్ కొన్నవాళ్లా లేడు. టికెట్ కలెక్టర్ వస్తే దింపించి పారేయవచ్చు.
ఒక స్టేషనప్పుడే దాటిపోయింది. టీసీ ఇంకా రాడేం? పూర్వం ఇలాగే ఉండేదా? అడుగడుక్కీ వచ్చి చెక్ చేసేవారు. ఛా! డబ్బిచ్చి వచ్చినవాడు బాధపడ్డం! కాణీ ఇవ్వకుండా వచ్చినవాడు సుఖపడ్డం!
పచ్చకోటువాడు దగ్గడం ప్రారంభించేడు, బాధగా, కఫంగా, అసహ్యంగా. దగ్గి దగ్గి కిటికీలోంచి పైకి ఉమ్మి కోటుచేత్తో మూతి తుడుచుకొని ‘‘హమ్మయ్యా’’ అని ఆయాసం తీర్చుకున్నాడు.
వీడికి క్షయ రోగం ఉన్నట్టుంది. జబ్బులున్నవాళ్లని ట్రెయిన్లోకి ఎందుకు రానిస్తారో! ఈ వెధవ ఈ క్షణంలో చస్తే నేనయితే విచారించను. భూభారం ఎంత తగ్గినా తగ్గడమే!
మరో స్టేషన్ వచ్చింది. ట్రెయినాగింది. ఇద్దరు బికార్లు దిగిపోయేరు. ఈ బికారి కూడా దిగిపోతే బావుణ్ణు అని రాజు అనుకొంటూ ఉండగానే పచ్చకోటువాడు ఏదో నిశ్చయానికి వచ్చినట్టుగా గభాల్న లేచి కంపార్ట్మెంట్లోంచి వెనక గుమ్మంలోంచి వెనకవైపుకి దిగిపోయేడు.
నిజంగా పోయినట్టేనా? టోపీ వదిలేసేడే? మళ్లీ వస్తుంది కాబోలు శనిదేవత. టీసీ వస్తాడని భయపడ్డాడో ఏమో?
వెనక్కి తిరిగి చూస్తే ప్లాట్ఫారం కనిపిస్తోంది. బండీ కదుల్తే బావుండుననుకొంటూ లేచి ఎదట కిటికీలోంచి పైకి చూసేడు.
ఇడుగో పచ్చకోటువాడు! ఇక్కడే నిల్చున్నాడు. బండి కదల భయం, మళ్లీ ఎక్కిపోతాడు. అతన్ని చూస్తూ అలాగే నిల్చుండిపోయేడు రాజు, కిటికీ దగ్గర.
చలికాలపు ఎండలో పచ్చకోటువాడు ప్రశాంతంగా గంభీరంగా నిల్చున్నాడు. అతని కళ్లలో వెలుగు కనిపిస్తోంది. అతన్లో ఏదో తేజస్సు ప్రజ్వరిల్లుతున్నట్టుగా ఉంది. జగత్తునంతా తృణీకరించి చూస్తున్నట్టుగా ఉన్నాడు.
అబ్బో! వీడికి ఇంత డాబు ఎక్కణ్ణించి వచ్చింది? అని రాజు అనుకొంటూ ఉండగానే ఇంజన్ గర్జించింది. గాడీ కదిలింది.
పచ్చకోటువాడు బండీ ఎక్కడానికి తొందరపడలేదు. నిల్చున్నచోటు నుంచి కదల్లేదు. వీడు ఇక్కడే ఉండిపోతాడు కాబోలు. బతికేను. ట్రెయిన్ పదిగజాలు నడిచింది. పాతిక గజాలు దాటింది. అంతే! కాని అదేమిటి? అదేమిటి?
పచ్చకోటువాణ్ణి చూస్తూన్న రాజు ఒక్క కేక వేసేడు. ఎవరో చెయిన్ లాగారు. ఎంతో అయిష్టతతో బండి ఆగింది.
రాజుకి ముఖం తిరిగింది. మూర్ఛ వచ్చేట్టయింది. పచ్చకోటువాడి మెడ రైలు పట్టాపైన. ట్రెయిన్ చక్రాల కింద. అవతల తల; ఇవతల మొండెం; ఇందాట్టా ప్రాణం; ఇప్పుడిప్పుడే మరణం!
ఒక్కసారిగా, ఒకేసారిగా, ‘‘అయ్యయ్యో, అయో అయో, ఎంత పనెంత పని చేసేడు, ఎలా ఎలా ఎలా చేసేడు, శంకరా హరహరా, ఈశ్వరా సర్వేశ్వరా.’’
బండీలో ఉన్న జనం అంతా వెనకవైపుకే దిగుతున్నారు. గోలగోల, ఒకటే గోల. పోలీసులు, టీసీలు, ప్రయాణీకులు, కేకలు. చేత్తో సంచీ పట్టుకొని, బండి దిగి అటువైపుకి తొందరగా గాభరాగా నడిచేడు రాజు.
‘‘అబ్బ! ఒక్క సెకెండే చూసేను. కాని నాకీ జన్మలో నిద్రపట్టదు’’ అని ఎటూ వెళ్లక మధ్య నిల్చున్న పెద్దమనిషి ఎవరితోనో అంటున్నాడు.
అందర్నీ అటువైపునుంచి తోసుకువస్తూన్న కూలిమనిషిలా కనిపించే అడమనిషి వెక్కివెక్కి ఏడుస్తూ వస్తోంది.
‘‘ఏమవుతాడమ్మా? నీ కతనేమవుతాడు?’’ అని పదిమంది ప్రశ్నించేరామెని.
‘‘ఏమవుతాడు బాబూ! మీ కేమవుతాడో నాకూ అదే అవుతాడు. నిండు ప్రాణం పోతే ఏడుపురాదూ’’ అన్నదామె కళ్లు తుడుచుకొంటూ.
చుట్టూ చేరినవాళ్ల మధ్య సందుల్లోంచి చనిపోయినవాడి అరిపాదాలు మాత్రం కనిపిస్తున్నాయి. ‘‘ఇహ నే చూడలేను భగవంతుడా’’ అనుకొన్న రాజు, వెనక్కి తన కంపార్ట్మెంటు వైపుకి మళ్లేడు.
ఎదట కార్నర్ సీట్లో నామాలు పెట్టుకున్న వృద్ధుడెవరో కూర్చున్నాడు. రాజు కూర్చున్నాక, టోపీ చూపిస్తూ ‘‘ఎవరో కాని టోపీ మర్చిపోయి దిగిపోయినట్టుందండీ’’ అన్నాడు రాజుతో.
‘‘ఇందాట్లా చచ్చిపోయిన వాడిదండీ ఆ టోపీ!’’
‘‘ఇక్కడేనా ఏమిటి వాడు కూర్చున్నాడు?’’ అని టోపీకి కొంచెం ఎడంగా జరిగేడు నామాలవాడు. కొంతసేపు తటపటాయించి, ఏదో పనున్నట్టుగా లేచి గేటువైపు వెళ్లి అక్కడ బల్లమీద కూర్చున్నాడు. చావంటే ఎంత భయం!
ట్రెయినింకా కదల్లేదు. ఇంకా ఆలస్యం అవుతుంది కాబోలని ఎవరో విసుక్కుంటున్నారు. కిటికీలోంచి పైకి చూస్తున్నాడు రాజు.
ఆకాశం చెప్పలేనంత నీలంగా ఉంది. దూరంగా మామిడితోటలకీ తాటితోపుకీ వెనక కనపడీ కనపడక దాగుంది ఏదో వూరు. తెల్లటి చుక్కల్లా బాతులు ఈదే చెరువు నీటిలో దూరంగా అచలంగా నిల్చున్న నీలి కొండలూ, ఎండలో వెండి ముద్దల్లా కనిపించే తెల్లమబ్బులూ కదిలిపోతున్నాయి. చెరువుకి పక్కగా ఉన్న తాటాకుల ఇంటిముందు విరియపూసిన గన్నేరు చెట్టు బరువుగా కొమ్మలు వంచుకొంది. బాగా ఎదిగిన అమ్మాయెవరో కొమ్మల్ని వంచి నీలంగా ఉన్న చీరచెంగులోకి కెంపుల్లాంటి పువ్వుల్ని కోసి పడేసుకొంటోంది. దూరం నుంచి చూస్తూంటే అంతా ప్రశాంతంగా హాయిగా కనిపిస్తోంది. అవన్నీ అదంతా చూస్తోన్న రాజెందుకోగానీ వికల మనస్కుడయ్యేడు.
ఈ నీలపు కొండలూ, నీలి ఆకాశం, ఈ శీతాకాలపు ఎండా, బాతులు ఈదే చెరువూ, పువ్వులు కోసే జవ్వనీ, ఏవీ ఏదీ ఎవర్నీ కూడా చూడలేదే పచ్చకోటువాడు! ఈ జీవితంలో ఎట్టి బాధల్ని భరించలేక, ఎన్నెన్ని బాధలు చూడలేక చూడకుండా పోయేడు పచ్చకోటువాడు? అని రాజు ఆలోచిస్తూ ఉండగా ఇంజన్ పెనుబొబ్బ పెట్టింది. రెయిల్ కదిలింది.
ఎండలో మిలమిల్లాడుతూ పరిగెడుతూన్న టెలిగ్రాఫ్ తీగల వైపూ, స్తంభాల వైపూ చూడక చూస్తోన్న రాజుకి గుండెల్లో ఎంతో బరువుగా, మనసులో ఎంతో దిగులుగా ఎందుకుందో అర్థం కాలేదు.
రావిశాస్త్రి
సుప్రసిద్ధ రచయిత రావిశాస్త్రి (1922–93) కథ ‘కార్నర్ సీట్’కు సంక్షిప్త రూపం ఇది. 1953లో ‘కాంతా కాంత’ కలంపేరుతో అచ్చయింది. సౌజన్యం: కథానిలయం. అల్పజీవి, రాజు మహిషి, రత్తాలు రాంబాబు, ఆరు సారా కథలు, రుక్కులు రావిశాస్త్రి రచనల్లో కొన్ని.