సీమలో సమ్మర్ క్యాపిటల్!
తిరుపతి: ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అట్టహాసంగా నూతన రాజధాని అమరావతి నిర్మాణ కార్యక్రమాల్లో తలమునకలవుతుంటే..మరో వైపు రాయలసీమ ఐక్యవేదిక నేతలు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. రాష్ట్రానికి అమరావతే కాకుండా రాయలసీమప్రాంతంలోనూ ఓ రాజధానిని నిర్మించాలనే వాదన ముందుకొచ్చింది. ఈ మేరకు రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల సాధన ఐక్యవేదిక అధ్యక్షుడు, మాజీ మంత్రి టీజీ. వెంకటేశ్ డిమాండ్ చేశారు. అంతేకాక రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల సాధన కోసం కూడా పోరాడాలని పిలుపునిచ్చారు.
సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో టీజీ వెంకటేశ్ మాట్లాడారు. అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించకపోతే అందరి నోట్లో మట్టికొట్టినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీమలోని సాగునీటి ప్రాజెక్టులు గుండ్రేవుల, సిద్ధేశ్వరం, వేదవతి ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఉద్యమం ద్వారానే హక్కుల సాధన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందకుంటే మరొకసారి మోసపోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికే మద్రాసు, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయామని, మళ్లీ అమరావతిలో పెట్టుబడులు పెట్టి అదేవిధంగా బయటకు రావాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండాలంటే సీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ప్రత్యేకహోదా అంశం పై విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ముందు స్పెషల్ గ్రాంటులు తీసుకుని ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే బాగుంటుందని టీజీ అన్నారు. రాయలసీమ హక్కుల వేదిక ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి రెండింటిపైనా పోరాడుతుందని, దీనికి ప్రజల మద్దతు అవసరమని పేర్కొన్నారు.