ధర్నా విజయవంతం చేయండి
దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్
విజయనగరం పూల్‌బాగ్ : ఈ నెల ఆరో తేదీన కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవీ ప్రభాకర్ కోరారు. దళితులను చైతన్యం చేసేందుకు దళితవాడల్లో చేస్తున్న పాదయాత్ర శుక్రవారం జొన్నలగుడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో జరగనున్న దళిత స్వాభిమాన్, సంఘర్ష్, సమ్మేళనానికి దళితులందరూ హాజరుకావాలని కోరారు. దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దళితులంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీలకు ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని.. అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద మంగళవారం చేపట్టనున్న ధర్నాకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఒమ్మి రమణ, ప్రధాన కార్యదర్శి గోకా రమేష్‌బాబు, పట్టణ కన్వీనర్ వై. పైడిరాజు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలమండ ఆనందరావు, జిల్లా కన్వీనర్ జె. మణికుమార్, ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. అప్పలరాజు దొర, బి. జ్యోతి, కె. రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.