భారమంతా సీలేరుపైనే..
సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో రబీసాగు ఇక పూర్తిగా సీలేరుపై ఆధారపడాల్సిందే. సాగు కీలక దశకు చేరుకున్న ఈ సమయంలో సహజ జలాలు గణనీయంగా పడిపోవడంతో సీలేరు నుంచి వచ్చే నీటినే పంట చేలకు మళ్లిస్తూ అధికారులు రబీని గట్టెక్కించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటి వరకు సగానికి పైగా సీలేరు నుంచి వచ్చే నీటిపైనే సాగు జరగగా, ఇక నుంచి మొత్తం సీలేరు నుంచి వచ్చే నీటిపైనే నెట్టుకు రావాల్సి ఉంది. పంట చేలు పాలుపోసుకుని గింజగట్టి పడే దశకు చేరుకుంది. సాగు ఆలస్యం కావడం వల్ల మార్చి నెలాఖరు నాటికి పూర్తికావాల్సిన రబీ ఏప్రిల్ నెలాఖరు నాటికి కాని పూర్తికాని పరిస్థితి నెలకొంది.
అందువల్ల ఎంతలేదన్నా ఏప్రిల్ 20వ తేదీ వరకు డెల్టా కాలువలకు సాగునీరందించాల్సి వస్తోంది. రబీ డిసెంబర్ 1 నుంచి మొదలు కాగా మార్చి 6వ తేదీ వరకు మూడు ప్రధాన పంట కాలువలకు 70.982 టీఎంసీల నీరు అందించారు. దీనిలో సీలేరు నుంచి వచ్చింది 40.338 టీఎంసీలు కాగా, సహజ జలాలు 30.644 టీఎంసీలు. మరో 40 రోజుల పాటు కనీసం 21 టీఎంసీల నీరు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డెల్టా కాలువలకు 7 వేల క్యూసెక్కులకు పైబడి నీరు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 10 తరువాత 5 వేల క్యూసెక్కులు సరిపోతుంది. సగటు ఆరు వేల క్యూసెక్కులు అంటే 40 రోజుల కాలానికి 2.40 లక్షల క్యూసెక్కులు అవసరం. 11 వేల 575 క్యూసెక్కులు ఒక టీఎంసీ. ఆ విధంగా చూస్తే కనీసం 21 టీఎంసీల నీరు అవసరం.
డిసెంబర్ 1 నుంచి మార్చి 6వ తేదీ వరకు
వినియోగించిన నీరు
70.982 టీఎంసీలు
తూర్పుడెల్టాకు
20.994
మధ్యడెల్టాకు
13.901
పశ్చిమడెల్టాకు
35.982
సీలేరు డిసెంబర్ నెలలో
9.809
జనవరి నెలలో
12.182
ఫిబ్రవరి నెలలో
14.778
మార్చి 6వ తేదీ వరకు
3.569
మొత్తం
40.338
సహజ జలాలు
30.644
పడిపోతున్న సహజ జలాలు
ఇంతవరకు సహజ జలాల రాక ఆశాజనకంగా ఉన్నా ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గిపోతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శనివారం నీటి రాక 8 వేల 100 క్యూసెక్కులు కాగా, దీనిలో సీలేరు వాటా 7వేల 831 క్యూసెక్కులు. అంటే సహజ జలాల రాక కేవలం 269 క్యూసెక్కులు మాత్రమే. వచ్చిన నీటిని తూర్పుడెల్టాకు 2300, మధ్యడెల్టాకు 1,500, పశ్చిమ డెల్టాకు 4,300 చొప్పున మొత్తం 8,100 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గడిచిన పది రోజులుగా వస్తున్న నీటికన్నా వదిలేది ఎక్కువ కావడం వల్ల బ్యారేజ్ వద్ద పాండ్ లెవెల్ తగ్గుతోంది. నీటి విడుదల అంతంత మాత్రం కావడం, కాలువలపై వంతుల వారీ విధానం వల్ల పంట చేలకు నీరందక రైతులు పాట్లు పడుతున్నారు.
మరో 40 రోజుల పాటు వచ్చే సహజ జలాలు 2 టీఎంసీలు మాత్రమే. దీంతో సీలేరు నుంచి 19 టీఎంసీల నీటిని పవర్ జనరేషన్, బైపాస్ పద్ధతిలో విడుదల చేయాల్సి ఉంది. బలిమెలలో మన వాటా ఇంకా 40 టీఎంసీలు, సీలేరు, డొంకరాయల ప్రాజెక్టుల్లో 5 టీఎంసీలు కలిపి మొత్తం 45 టీఎంసీల వరకు ఉన్నందున డెల్టాకు ఇబ్బంది ఉండదని సాగునీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రబీ గట్టెక్కించేందుకు మొత్తం మీద 91 టీఎంసీల వరకు నీరు వినియోగిస్తుండగా అందులో సీలేరుది 60 టీఎంసీలు కావడం గమనార్హం. గతంలో రబీ సీజన్లో సీలేరు నుంచి వచ్చే 40 టీఎంసీలు సాగుకు సరిపోయేవి. అత్యవసర పరిస్థితుల్లో మరో 5 టీఎంసీలు అదనంగా తెచ్చేవారు. కానీ కొన్నేళ్లుగా రబీ సీజన్లో 55 నుంచి 60 టీఎంసీలు వినియోగించాల్సి వస్తోంది.