ఎల్నినో... ఏమి చేయునో
ఎరువుల పరిశ్రమపై రుతుపవనాల ప్రభావం రాబోబ్యాంక్ నివేదిక
ముంబై: బలహీనంగా ఉన్న రూపాయి, ఎల్ నినో కారణంగా వర్షాలు ముఖం చాటేసేలా ఉండడం, సబ్సిడీ వ్యవస్థ... వెరసి ఎరువుల రంగంపై మరింత ప్రభావంపడే అవకాశాలున్నాయని బ్యాంకింగ్, ద్రవ్య సేవల సంస్థ రాబోబ్యాంక్ తాజా నివేదికలో పేర్కొన్నారు. ‘ఎరువులకు డిమాండు ఒత్తిడి ఉంది. సబ్సిడీల భారం భరించలేక ఎరువులు, రసాయనాల శాఖ సతమతం అవుతోంది. బలహీనమైన రూపాయి, రుతుపవనాలు ఎరువుల డిమాండుపై ప్రభావం చూపే అవకాశం ఉంది’ అని ఎరువుల పరిస్థితిపై రూపొందించిన తాజా త్రైమాసిక నివేదికలో తెలిపారు.
ఈ రిపోర్టులోని ఇతర ముఖ్యాంశాలు:
యూరియా సబ్సిడీల చెల్లింపులకు ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ అష్టకష్టాలు పడుతోంది. మునుపటి యూపీఏ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్లో ఎరువుల సబ్సిడీలకు 1,100 కోట్ల డాలర్లు కేటాయించింది. గతేడాది కూడా సబ్సిడీలు చెల్లించలేక సదరు మంత్రిత్వ శాఖ ఇక్కట్లను ఎదుర్కొంటున్నపుడు బ్యాంకులు రంగప్రవేశం చేసి రుణాలు సమకూర్చాల్సి వచ్చింది.
యూరియాకు డిమాండు జూలై వరకు మందకొడిగానే ఉండవచ్చు. చైనా నుంచి ఎగుమతుల ప్రారంభం కోసం ఇండియా ఎదురుచూస్తోంది. ఏప్రిల్లో దేశంలో 6.75 లక్షల టన్నుల యూరియా నిల్వలున్నాయి. మార్చితో పోలిస్తే ఇది 2 రెట్లు అధికం.ఎరువుల ధరల్లో క్షీణత కన్పిస్తోంది. వచ్చే త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.
భారత్లో ఫాస్ఫేట్ ఎరువుల పరిస్థితి ఏమంత బాగాలేదు. రూపాయి మారకం విలువ బలహీనపడితే ఫాస్ఫేట్ దిగుమతుల భారం పెరుగుతుంది. అన్ని రకాల ఎరువులదీ ఇదే పరిస్థితి.