అమ్మ తొలిసారి వచ్చింది
న్యూఢిల్లీ: దేశానికి రాజైనా తల్లికి కొడుకే. ఎప్పుడూ బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ కాసేపు పనులన్నీ పక్కనబెట్టి తన తల్లి హీరాబెన్‌తో అప్యాయంగా గడిపారు. మోదీ స్వయంగా ఆమెను వీల్‌చైర్‌లో తీసుకెళ్లి గార్డెన్ చూపించారు. తల్లికి నీళ్లు అందించి సేవలు చేశారు.
నరేంద్ర మోదీ ప్రధాని అయిన రెండేళ్ల తర్వాత హీరాబెన్ తొలిసారి ఢిల్లీ రేస్ కోర్సు రోడ్డులోని ఆయన అధికార నివాసం 7 బంగ్లాకు వచ్చారు. హీరాబెన్ కొన్ని రోజులు అక్కడ ఉండి గుజరాత్‌కు తిరిగి వెళ్లారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఢిల్లీలో ఒంటరిగా ఉంటున్న మోదీ తల్లితో అప్యాయంగా గడిపారు. మోదీ తన తల్లితో దిగిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'నా అధికార నివాసానికి అమ్మ తొలిసారి వచ్చింది.
చాలా రోజుల తర్వాత ఆమెతో విలువైన సమయం గడిపాను. అమ్మ గుజరాత్‌కు వెళ్లింది' అని మోదీ ట్వీట్ చేశారు. సోఫాలో కూర్చుని హీరాబెన్‌కు నీళ్ల గ్లాసు ఇస్తున్నపుడు, ఆమెను వీల్‌చైర్‌లో తీసుకెళ్తూ గార్డెన్లో మొక్కలు చూపిస్తున్నప్పటి ఫొటోలను మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మోదీ తల్లి గుజరాత్లో మెహ్సనా జిల్లాలోని సొంతూరు వాద్నగర్లో నివసిస్తున్నారు.