రూఫ్‌టాప్ సౌర విద్యుత్‌పై రేస్ పవర్ దృష్టి
సౌర విద్యుత్ రంగ సంస్థ రేస్ పవర్ ఇన్ఫ్రా తాజాగా రూఫ్‌టాప్ సోలార్ పవర్ (పైకప్పుమీద అమర్చే సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుదుత్పత్తి)పై దృష్టి సారిస్తోంది. అనుబంధ సంస్థ సోలార్ కార్ట్.. ఇప్పటికే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మొదలైన సంస్థలకు సంబంధించి సుమారు 5 మెగావాట్ల (మె.వా.) ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు సంజయ్ గుప్తా తెలిపారు. రూఫ్‌టాప్ సోలార్ పవర్‌కి సంబంధించి రాబోయే రెండేళ్లలో తెలంగాణలో 20 మె.వా., దేశవ్యాప్తంగా 50 మె.వా. లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. మరోవైపు, ఈపీసీ తదితర మార్గాల్లో తెలంగాణలో ఇప్పటిదాకా 55 మె.వా. సౌర విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టగా అందులో 45 మె.వా. పూర్తి చేసినట్లు గుప్తా పేర్కొన్నారు. మెదక్ జిల్లా దుబ్బాకలోని 20 మె.వా. సోలార్ పార్క్‌లో సుమారు 10 మె.వా. విద్యుత్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లు, మిగతాది సెప్టెంబర్ ఆఖరు నాటికి అందుబాటులోకి రాగలదని చెప్పారు. ఇప్పటిదాకా మొత్తం 290 మె.వా. సౌర విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు వివరించారు. 170 మె.వా. మేర ఆర్డర్ బుక్ ఉండగా.. ఇందులో 110 మె.వా. ప్రాజెక్టులు ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కాగలవన్నారు. గత ఆర్థిక సంవత్సరం సుమారు రూ.330 కోట్ల మేర టర్నోవరుగా నమోదైందని.. ఈసారి దాదాపు రూ. 600-650 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు గుప్తా చెప్పారు.