బ్లేడుతో భార్యపై భర్త దాడి
కాగజ్‌నగర్ రూరల్ : భార్యపై భర్త బ్లేడ్‌తో దాడిచేసి గాయపర్చిన సంఘటన కాగజ్‌నగర్‌లోని డీఎస్పీ కార్యాలయం ఎదుట శనివారం జరిగింది. బా ధితులు, పోలీసుల కథనం ప్రకారం.. బెజ్జూర్ మండలం ఖర్జెల్లి గ్రామానికి చెందిన రాచకొండ లచ్చన్న వివాహం 1999లో మంచిర్యాలకు చెందిన శారదతో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు మణికంఠ, రామకృష్ణ. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో 2011 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. లచ్చన్న బల్లార్షాలో ఉంటుండగా.. శారద పిల్లలతో కలిసి వరంగల్‌లో ఉంటూ మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తోంది. ఖర్జెల్లిలోని లచ్చన్నకు చెందిన ఆస్తి విషయమై శారద పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
అయినా వీరు వినకపోవడంతో కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్‌బాబు వద్దకు కౌన్సెలింగ్ నిమిత్తం పంపించారు. శనివారం వీరిద్దరికి డీఎస్పీ తన కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. పిల్లలు ఉన్నందున కలిసి ఉండాలని డీఎస్పీ సూచించారు. మధ్యాహ్నం వరకు ఆలోచించి నిర్ణయం చెప్పాలని పేర్కొన్నారు. అనంతరం కార్యాలయం నుంచి బయటకు రాగానే అప్పటికే తన వద్ద ఉన్న బ్లేడ్‌తో శారద మెడపై లచ్చన్న దాడి చేశాడు. శారద తన చేయి అడ్డుపెట్టగా చేతికీ తీవ్ర గాయమైంది. అక్కడే ఉన్న కాగజ్‌నగర్ రూరల్ సీఐ రవీందర్ లచ్చన్నను అదుపులోకి తీసుకుని శారదను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నామని టౌన్ ఎస్‌హెచ్‌వో రవికుమార్ తెలిపారు.