Rachakonda Viswanatha Sastry: అల్పజీవుల బుద్ధిజీవి
మామూలుగా రాయడం రావిశాస్త్రికి రాదు. వాక్యానికి ఏ అలంకరణ చేస్తే పాఠకుడు కళ్లు తిప్పుకోలేడో ఆయనకు తెలుసు. దాన్నే విమర్శకులు శైలి అంటారు. తెలుగు సాహిత్యంలో రావిశాస్త్రి శైలి ఒక మ్యాజిక్. అతి మామూలుగా రాసే ఒక పొట్టి వాక్యం కూడా ఆయన రాసినందువల్ల దానికి ప్రత్యేక ఆకర్షణ వస్తుంది. అలాంటి శైలిని అనుకరించాలని బోల్తాపడిన వాళ్లెందరో. అది అనితర సాధ్యం. ఆధునిక కాలపు గొప్ప రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి. అత్యంత వెనుకబాటుతనానికి గురైన ఉత్తరాంధ్ర నుండి వచ్చిన ఆయన, ఆ ప్రాంత భాషకు పట్టం కట్టారు. వృత్తిపరంగా న్యాయవాది అయినందువల్ల పిపీలికాలు, అల్పజీవుల తరపున మదోన్మత్త గజాల మీద పోరాడారు. జీవితాంతం అతిసామాన్యుని పక్షాన ఉండి, అసామాన్య సాహితీ సృజన చేసిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి శత జయంతి నేడు.
మొదటిసారి గురజాడ కన్యాశుల్కం చదివినప్పుడు, ఇది దేవతలు మాత్రమే రాయగలరు అని రావిశాస్త్రి అన్నాడు. రావిశాస్త్రి రచనలు మాత్రం దేవతలు కూడా రాయలేరు. ఎందుకంటే దేవతలు సిరిమంతులు, నీతిమంతులు, బలవంతులు వంటి మర్యాదస్తుల పక్షాన వుంటారు. రావిశాస్త్రి పాత్రల్ని ఆయనే సృష్టించగలడు. వారి భాషనీ, వారి తెగువనీ, వారి దైన్య హైన్య సాహసాలనీ రావిశాస్త్రి మాత్రమే రాయగలడు. రావి శాస్త్రి స్పెషాలిటీ కేవలం శైలి మాత్రమే కాదు. ఆయన గొప్పతనమంతా ప్రమాణాలను పటాపంచలు చేయడమే. మట్టిలోంచి కన్నీటిని పిండి అందులో కడిగిన పాత్రల్ని తీసి వారిని ఈ మానవ మాయాప్రపంచంతో యుద్ధం చేయడానికి సిద్ధం చేశాడు.
ఒక కన్యాశుల్కాన్ని గురజాడ మాత్రమే రాయగలడు. ఒక మైదానం చలం మాత్రమే రాయగలడు. ఒక అల్పజీవిని రావిశాస్త్రి మాత్రమే రాయగలడు. ‘అల్పజీవి’ నుండి ‘ఆరు సారా కథలు’ మీదుగా ‘రాజు మహిషి’, ‘రత్తాలు రాంబాబు’ వంటి నవలలు దాకా రావిశాస్త్రి చేసిందల్లా తనలోని అద్భుతాన్ని అక్షరాల్లోకి అనువదించడమే. వచనాన్నీ, కవిత్వాన్నీ, వస్తువునీ... సమస్తాన్నీ కాలం మిక్సీలో వేసి తనకు మాత్రమే అబ్బిన వింత విద్యతో... సత్యాసత్య సంఘర్షణల అద్భుతాలను వెలికి తీసి, తన కాలపు రంగస్థలం మీద గెంతులేయించాడు. అది మేజికల్ రియలిజమా... చైతన్య స్రవంతి మహత్యమా! ఆయన రచనలను ఆస్వాదించడం తప్ప ఆయనలా రాయాలను కోవడం అసాధ్యం.
రావిశాస్త్రి పాత్రలు ముత్యాలమ్మ, నూకాలమ్మ, పోలమ్మ, పోచమ్మ, అంకాలమ్మలు వంటి ఎవరెవరో ఈ నీతిమంతుల ప్రపంచం మీద ఒకసారిగా విరుచుకుపడతారు. నేరస్థులు పోలీసులకు బుద్ధి చెబుతారు. ముద్దాయిలు న్యాయమూర్తులకు, అవినీతిపరులు నీతిమంతులకు, అలగాజనం ఆస్తిమంతులకు బుద్ధి చెబుతారు. ఒకసారి రావిశాస్త్రి లోకి దిగిన తర్వాత ఆ పాత్రలు మాట్లాడుతుంటే మనం తలదించుకొని ఏదో నేరం చేసినట్టు ఉండి పోతాం. ఎదురుపడితే ఏదో దారి చూసుకొని వాళ్ళ నుంచి తప్పుకుపోతాం. ఆయన అననే అన్నాడుగా ‘‘ఎల్లకాలం వాళ్ళు అలా వెంగళప్పల్లా ఉండిపోరు. ఎప్పుడో అప్పుడు ఏదో రోజున వాళ్ళందరూ ఒక్కసారిగా గప్పున తెలివి తెచ్చుకుంటారు. అప్పుడు పుణ్యం వర్ధిల్లుతుంది. అంచేత అప్పుడు మనలాంటి పాపులు జాగ్రత్తగా ఉండాలి.’’ అదీ సంగతి. వర్ణనలు బాబోయ్ వర్ణనలు అని గగ్గోలు పెట్టారు కొందరు. వర్ణనలు బోర్ కొడుతున్నాయని మహామహులైన విమర్శకులు కూడా అన్నారు. కానీ ఆ వర్ణనల వల్లే రావిశాస్త్రి ఒకే ఒక్కడుగా మిగిలిపోయాడు. రాజు–మహిషిలో అనవసరమైన వర్ణనలు మితిమీరి ఉండడమే దాని లోపం అని కదా ‘రారా’ రాద్ధాంతం. అదేమో గాని రాజు–మహిషి నవలలో మందుల భీముడు లోకంలోని పాపాల మీద ఇచ్చిన పెద్ద ఉపన్యాసం ఒక్కటి చాలు అసలు రావిశాస్త్రి అంటే వర్ణనలే అని ఒప్పేసుకుంటాం. అందుకేనేమో ఆ అసంపూర్తి నవలకు శ్రీశ్రీ ‘అపరిచయం’ రాసి దాన్ని నిజమైన క్లాసిక్‌గా వర్ణించాడు.
ఇస్మాయిల్, మార్క్సిస్టుల్లో కూడా మహాత్ములు ఉంటారని రావిశాస్త్రి గురించి మాట్లాడుతూ చేసిన వెటకారం బహుశా రారా లాంటి వాళ్లు గుర్తించాలనే కాబోలు. అదేం కాదులెండి. కేవీఆర్, చలసానిలాంటి ఉద్దండ మార్క్సిస్టులే భుజాన మోశారు కదా. అజంతా మాత్రం నిజమే చెప్పాడు. ‘‘అశ్రు గంగాజలాలలో అగ్నిసుందరిని సృష్టించిన ఒకే ఒక కథకుడు’’ అని. అంతేకాదు ‘‘అతడే అతడే అతడు నడుస్తున్నంతమేరా కదం తొక్కుతున్న శబ్ద ధీర గంభీర జీవన కథా సరిత్సాగర ఘోష’’ అని కూడా ముక్తాయింపు ఇచ్చాడు అజంతా. అందుకే రావిశాస్త్రి నిజంగా ఒకే ఒక్కడు. వన్ అండ్ ఓన్లీ. ఆయన పుట్టి వందేళ్ళు అంటున్నారు. ఇలాంటి రచయితలు వందల సంవత్సరాలకి ఒకసారి పుడతారు. వందల వేల సంవత్సరాలు జీవిస్తారు. ఆయనకు నా పాదాభివందనాలు.
- డాక్టర్ ప్రసాదమూర్తి
కవి, జర్నలిస్ట్
భూమ్మీద మనిషికి ముఖ్యమైన పనులు రెండే రెండు. ఒకటి: దొంగ తనం చేయడం. రెండు: దొంగల్ని పట్టుకు శిక్షించడం (తలుపు గొళ్ళెం కథ). రాచకొండ విశ్వనాథశాస్త్రి సాహిత్య సారమంతా ఈ రెండు వాక్యాల్లోనే ఇమిడి ఉంది. అంతేకాదు మనిషి జీవితం, మానవ చరిత్ర కూడా అందులోనే ఉన్నాయని కూడా ఆయన అన్నారు. అలాంటి జీవితాలు, జీవిత చరిత్రలు ఆయన రచనా సాగరమంత మేరా పరుచుకున్నాయి. నూరేళ్ల రావిశాస్త్రికి మనం ఏ రకంగా నివాళులర్పించగలం?
రావిశాస్త్రి గొప్పతనమూ, కళా నైపుణ్యమూ ఎక్కడు న్నాయంటే... వైవిధ్యమైన వస్తు స్వీకరణలోనూ, అనితర సాధ్యమైన శిల్ప నైపుణ్యంలోనూ. రచయితగా రావిశాస్త్రికి అనుకూల అంశం ఆయన ‘జీవితకాలం’. పుట్టి పెరిగిన కాలం ఆయనకు కలిసి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చేనాటికి న్యాయ కళాశాలలో విద్యార్థిగా జరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించాడు. కాలిక స్పృహ ఉన్నవాడు కాబట్టే ఆ చారిత్రక సందర్భాన్నీ, సంధి కాలాన్నీ చాలా గడుసుగా ఒడిసి పట్టుకున్నాడు. తత్వ, న్యాయ శాస్త్రాల అధ్యయనం వల్ల సామాజిక చలన సూత్రాలను మా బాగా ఆకళింపు చేసుకున్నాడు.
‘ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క’... అన్న ప్రజాస్వామిక భావన ఆచరణలో విఫలమైందని స్వాతంత్య్రం వచ్చిన పుష్కర కాలానికి తెలియ వచ్చింది. శాసన, న్యాయ, రక్షణ వ్యవస్థల పనితీరులో డొల్లతనం అవగతం అయింది. అంతకుముందు కష్టార్జితం, కోర్టుకు రాని సాక్షులు, నల్ల మేక, అధికారి, పువ్వులు వంటి కథలు రాసినా వర్గ దృక్పథం బల పడింది ఈ సమయంలోనే. ఆ తరువాత వెలువడినవే ‘ఆరుసారా కథలు’.
సారా కథలతో తెలుగు కథా సాహిత్యం సారవంతమయింది. అంతవరకు కానరాని కొత్త శిల్ప మర్మమేదో వాళ్ళ కంటికి జిగేల్ మని తాకింది. సారా కథలను సేవించిన శ్రీశ్రీ తన కొంగ్రొత్త అనుభూతికి ‘రసన’ అని నామకరణం చేశాడు. రచయితగా ఆయన న్యాయవాద వృత్తి సాహిత్య సృజనకు ఒక శాస్త్రీయమైన భూమికనిచ్చింది. ‘పతితులార భ్రష్టులారా’ అని శ్రీశ్రీ ఎవరినైతే ఓదార్చాడో వాళ్ళనే రావిశాస్త్రి అక్కున చేర్చుకున్నాడు. రాజు మహిషి, రత్తాలు రాంబాబు, మూడు కథల బంగారం, సొమ్మలు పోనాయండి లాంటి నవలలు; ‘నిజం’ లాంటి నాటకం ఆ నేపథ్యంలో నుంచి వచ్చినవే. ఆ పరంపరలో పుట్టినవే. ఇంట్లో, సంసారంలో, సెక్స్‌లో పడి కొట్టుకుంటున్న కథని వీధిలోకి తీసుకొచ్చానని మాత్రమే చెప్పే రావిశాస్త్రి నిజానికి చేసిన పని అంతేనా? పిల్లి పిల్లల్ని పెట్టి ఏడిళ్లు తిప్పినట్టు, కథ కాళ్ళకి బలపం కట్టి వాడల్లో, గుడిసెల్లో తిప్పిన చోట తిప్పకుండా తిప్పాడు. తన భాషా పాటవమంతా పాటకజనం నుంచే స్వీకరించాడు. మాకూ ఉన్నాడు ఒక మహా రచయిత అని తెలుగువాడు బోరవిరుచుకునేటట్టు రచనలు చేశాడు. ఆయన పేదలపక్షమే వహించాడు. ‘మనం పేదవాళ్ళం రా’ అని చిన్ననాట తల్లి ఏరోజైతే చెప్పిందో ఆ రోజు నుంచి ఆ మరణాంతం మరిచిపోలేదు.
అందుకే రత్తాలు, నూకాలు, ముత్యాలమ్మ, పోలమ్మ, బోడి గాడు లాంటి అల్పజీవుల తరఫున వకాల్తా పుచ్చుకుని వాళ్లకి జీవితం పొడవునా కొండంత అండగా నిలబడ్డాడు రాచకొండ. సార్వ భౌమారావు, మందుల భీముడు, రాజయోగి, భీమసేనారావు, లక్ష్మినాథరావు లాంటి కుహనా పెద్ద మనుషుల ‘మాయ’, ‘మోసం’ బయటపెట్టి బోనెక్కించాడు. లోకానికి ‘నిజం’ తెలియజేశాడు. రావిశాస్త్రి విరసం వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా కొంతకాలం బాధ్యత వహించాడు. తర్వాత విరసంలో లేకపోయినా చివరంటా విరసంతోనే ఉన్నాడు. రచనలు చేసిన నేరానికి ఎమర్జెన్సీలో జైలుకెళ్లి అక్కడ కూడా ఆ ప్రక్రియనే కొనసాగించాడు. చివరి నవల ‘ఇల్లు’ రాసి చివరాఖరికి సొంత ఇల్లు లేకుండానే జీవితాన్ని ముగించాడు. అసలు సిసలైన మార్క్సిస్ట్ రచయితగా నిలబడి బతికాడు. (చదవండి: అసమానతలపై ఎక్కుపెట్టిన బాణం!)
- జి.ఎస్. చలం
సాహితీ విమర్శకుడు