గుమస్తా జీవుల అనర్థ బతుకులు... అల్పజీవి
మన నవలలు: ఫలానా డిగ్రీ చదువు అన్నారు. చదివాడు. ఫలానా గుమస్తా ఉద్యోగం చెయ్ అన్నారు. చేస్తున్నాడు. ఉద్యోగం కోసం చదువు. చదివేదంతా ఉద్యోగం కోసమే. కాళ్లు తీసేసి కుర్చీలో కూచోబెట్టడం ఇది. జీవితాంతం పరాన్నభుక్కును చేసేయడం. ఉద్యోగం పోతే ఇంతే సంగతులు. ఈ భయం.... భయం... భయం... నరాల్లోకి ఎక్కడిదాకా పాకిందంటే ఆఖరుకు నచ్చిన ఆడది పిలిస్తే భయపడ్తూ భయపడ్తూ వెళ్లి ఎవరైనా చూస్తారేమోనని భీతిల్లి తీరా ఆమె చేరువ అయితే బిక్కముఖం వేసి నీరుగారిపోయి....
సుబ్బయ్య కొంచెం పిరికివాడు. గుమస్తా కావడం వల్ల పిరికివాడయ్యాడా పిరికివాడు కావడం వల్లే గుమస్తా అయ్యాడా చెప్పలేం కాని మొత్తం మీద పిరికివాడు. భయపడతాడు. పెళ్లాన్ని అసేయ్ ఒసేయ్ అనడానికి భయపడతాడు. ఆఫీసులో తనని ఏడిపించిన హెడ్ క్లర్క్‌ని- ఏరా ఒళ్లు కొవ్వెక్కిందా అని ఎదిరించడానికి భయపడతాడు. కుదర్దు... ఇంతే ఇస్తా అని కూరగాయలవాడితో దెబ్బలాడ్డానికి భయపడతాడు. పిల్లల మీద చేయెత్తడానికి భయపడతాడు. లోకం మీద నోరెత్తడానికీ భయపడతాడు. అధికారం అంటే భయం. పోలీసులంటే భయం. కోర్టులంటే భయం. హాస్పిటల్స్ అన్నా భయమే. చక్కగా ఒక గుల్ల కావాలి సుబ్బయ్యకి. పొద్దున తొమ్మిదింటికి ఆఫీసుకు వెళ్లడం.
గొడ్డులా చాకిరీ చేయడం. సాయంత్రం ఇంటికి తిరిగి రావడం. నిద్ర పోవడం. మళ్లీ తిరిగి ఆఫీసుకు వెళ్లడం. నెల తిరిగే సరికల్లా వచ్చిన నాలుగు డబ్బుల్తో వెచ్చాలు తెచ్చుకోవడం. గుట్టుగా సంసారం నెట్టుకురావడం. చిన్న చిన్న అవస్థలు వస్తే ఇబ్బంది పడటం. పెద్ద పెద్ద అవస్థలే దాపురిస్తే గుటుక్కుమనడం. ఒక సేఫ్ రొటీన్ జీవితం. ఇది కావాలి సుబ్బయ్యకి. దీనికి భిన్నంగా ఏది జరిగినా భయపడతాడు. హడలెత్తి పోతాడు. ఆఫీసులో బిల్స్ క్లియర్ చేసే పని అతనిది. బావమరిది ఇది గమనించాడు. ఎవరి బిల్సు క్లియర్ చేయాలో వాడి దగ్గర ఐదు వందలు అడిగి తనకు ఇమ్మన్నాడు. ఇలా చేయొచ్చా? కూడదు. కాని సుబ్బయ్యకు వేరే దారి లేదు. అడుగుతున్నది బావమరిది.
అడగమన్నది కట్టుకున్న భార్య. చెప్పిన పని చేయకపోతే చేతగానివాడంటారు. సుబ్బయ్య ఐదువందలు కాంట్రాక్టర్‌ని అడిగేశాడు. చేబదులు అన్నట్టుగా అడిగాడు. కాని అది లంచం. అతడు చేబదులే అన్నట్టుగా ఇచ్చాడు. కాని అది దక్షిణ. ఇచ్చిన ఐదు వందలు బావమరిదికి అందింది. కాని, ఆ వెంటనే సెక్షన్ కూడా మారిపోయింది. మరి? తను కాకుండా వేరెవరైనా తింటుంటే హెడ్ క్లర్క్ ఊరుకుంటాడా? మార్చాడు. దక్షిణ అని ముట్టజెప్పినవాడు ఇప్పుడు కాబూలీవాలా అయ్యాడు. తన బిల్స్ క్లియర్ చేయకుండా అప్పనంగా ఐదు వందలు తీసుకుంటే ఎవరు ఊరుకుంటారు? కాని ఐదు వందలు! జీతం వందో నూటేభయ్యో ఉన్నప్పుడు ఇంటి అద్దె ఐదూ పదీ రూపాయలు ఉన్నప్పుడు పావలాకి బేడకి కావలసిన వస్తువులు దొరుకుతున్నప్పుడు ఐదువందలంటే ఎంత పెద్ద మొత్తం. ఇప్పుడు ఏం చేయాలి? సుబ్బయ్య భయపడిపోయాడు. ఇచ్చిన కాంట్రాక్టర్ దుర్మార్గుడు. పుచ్చుకున్న బావమరిది అవకాశవాది. తానేమో పిరికివాడు. ఎలా... ఎలా... ఎలా. సుబ్బయ్య వెర్రెత్తిపోయాడు. పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని ఎక్కడికని పారిపోగలడు?
ఒక ఐదు వందల మొత్తం! అతడి జీవితంలోని ప్రశాంతతను అంతా సర్వనాశనం చేసేసింది. కాదు... అతడిలోని పిరికితనమే అతణ్ణి సర్వనాశనం చేసేసింది. ధైర్యంగా ఎప్పుడైనా ఉన్నాడా తను. ధైర్యంగా దేన్నయినా ఎదిరించాడా తను. ధైర్యంగా ఇది తప్పు అని వాదించాడా తను. ధైర్యం చేసి దీనిని సరి చేయాలి అని రంగంలో దిగాడా తను? లేదే. ఫలానా డిగ్రీ చదువు అన్నారు. చదివాడు. ఫలానా గుమస్తా ఉద్యోగం చెయ్ అన్నారు. చేస్తున్నాడు. ఉద్యోగం కోసం చదువు. చదివేదంతా ఉద్యోగం కోసమే. కాళ్లు తీసేసి కుర్చీలో కూచోబెట్టడం ఇది. జీవితాంతం పరాన్నభుక్కును చేసేయడం. ఉద్యోగం పోతే ఇంతే సంగతులు. గుమస్తా కాకపోతే ఇంతే సంగతులు. ఈ భయం.... భయం... భయం... నరాల్లోకి ఎక్కడిదాకా పాకిందంటే ఆఖరుకు నచ్చిన ఆడది పిలిస్తే భయపడ్తూ భయపడ్తూ వెళ్లి ఎవరైనా చూస్తారేమోనని భీతిల్లి తీరా ఆమె చేరువ అయితే బిక్కముఖం వేసి నీరుగారిపోయి....
మగాడిగా బతకడం అంటే స్త్రీ దగ్గర మగతనం ప్రదర్శించడం కాదు. అన్ని సందర్భాల్లోనూ మగాడిగా బతకడమే. సుబ్బయ్య గుమస్తా బతుకు అతణ్ణుంచి ఆ మగతనాన్ని హరించేసింది. ఇక మిగిలిందల్లా పిరికి పిప్పి. అతడేనా? దేశమంతా ఈ పిరికి పిప్పే. పెద్ద గుమాస్తాలు... చిన్న గుమస్తాలు.... కార్లూ టైలూ ఉన్న బడా గుమస్తాలు.... టెన్ టు ఫైవ్ బందీలు.... నోరెత్తకుండా పని చేసుకుపోయే కూలీలు...
నవల: అల్పజీవి; రచన: రాచకొండ విశ్వనాథ శాస్త్రి
తొలి ముద్రణ: 1955; రావిశాస్త్రికి విశేషమైన పేరు తెచ్చిన ఆయన తొలి నవల. జేమ్స్ జాయిస్, శ్రీశ్రీ ‘కోనేటి రావు’ పాత్రల ప్రభావంతో తాను ఈ నవల రాశానని రావిశాస్త్రి చెప్పుకున్నారు. రచనలో విశేషమైన వేగం ఆ రోజుల్లో కొత్త కావడం వల్ల కూడా దీనికి ఆదరణ లభించింది. కథ కంటే కథనమే ముఖ్యం. రాజు- మహిషి, రత్తాలు - రాంబాబు... ఆయన ఇతర నవలలు. మనసు ఫౌండేషన్ ప్రచురించిన రావి శాస్త్రి రచనలులో ఈ నవల లభ్యం. ఆ ప్రతులు దొరకని వారు జిరాక్స్ కాపీ కోసం పుస్తకాభిమాని అనిల్ బత్తులను సంప్రదించవచ్చు. ఆయన నం.9059134111
అందుకే ఒక పది మందో ఇరవై మందో కలసి ఆట ఆడిస్తుంటారు. ఓట్లు వేయకపోయావో చస్తావ్ అంటారు. చెప్పినట్టు వినకపోయావో చంపుతాన్ అంటారు. రెంటు పెంచినా, కరెంటు పెంచినా, సిలిండర్ పెంచినా, పార్కింగ్ ఫీజు పెంచినా, సినిమాహాళ్లలో నోటికొచ్చిన రేటును పెంచినా, ప్లాట్ పెంచినా, ఫ్లాట్ పెంచినా నోర్మూసుకొని ఉండాలి. రైళ్లు లేవు ఫో అంటే సణుక్కుంటూ పోవాలి. బస్సులు చంపితే ఛావ్ అంటే జీ హుజూర్ అనుకుంటూ చావాలి. అందరూ అంతే. భరించడం తప్ప మార్చడం తెలియనివారు. మార్చాలంటే లంపటంలో దిగాలి. లంపటంలో దిగితే అమ్మో.... అవతల ఆఫీసుకు వెళ్లాలి.... గుమస్తాలు!
సుబ్బయ్య కూడా అలాంటి గుమాస్తానే. ఒరే కాంట్రాక్టర్ వెధవా... నీ డబ్బు నీకు తిరిగి ఇవ్వనురా అని చెప్పడం చేతగాని గుమాస్తా. చచ్చు మనిషి. చచ్చిన మనిషి. అయితే అప్పుడప్పుడు కొంత వెలుతురు వస్తుంది. కొంత మార్చ ప్రయత్నిస్తుంది. సుబ్బయ్య జీవితంలో కూడా అలాంటి వెలుతురు వచ్చింది. ఒక స్నేహితురాలు పరిచయమైంది. ఆమె అతణ్ణి ఆదరించింది. ఊరడించింది. పవిటతో నుదుటి చెమట తుడిచి కొంచెం ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్పింది. కాని ధైర్యంగా ఉండటానికి సుబ్బయ్యకు ధైర్యం కావాల్సి వచ్చింది. అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. అతడే కాదు దేశంలోని గుమస్తాలందరూ ఆ ధైర్యాన్ని ఇంకా అందుకోవలసి ఉంది.
రావిశాస్త్రి 1953లో రాసిన నవల ‘అల్పజీవి’. పిరికితనంతో బతుకులీడ్చే మధ్యతరగతి వర్గం మీద, గుమస్తా మనస్తత్వాలతో కునారిల్లుతున్న మధ్యతరగతిలోని ప్రధాన వర్గం మీద ఆయన కొట్టిన కొరడా దెబ్బ ఇది. ఆయన బాధ ఏమిటంటే చదువుకోని వారు ఎలాగూ చస్తున్నారు. బాగా చదువుకున్నవారు లొసుగులు లోపాలను ఉపయోగించి ఎక్కడికో చేరుతున్నారు. కాని ఈ గుమస్తాలే- ఈ అపసవ్యతను తొలగించాల్సిన బాధ్యత ఉన్న ఈ గుమస్తాలే ఆ బాధ్యత నుంచి దూరంగా తొలగిపోతున్నారు. మనిషి పిరికితనం దాటాలని రావిశాస్త్రి కోరిక. ధైర్యలక్ష్మి ఉంటేనే తక్కిన లక్ష్ములన్నీ ఉంటాయని ఆయన ఈ నవలలో చెప్పదల్చుకున్నారు. లక్ష్ములు కావలసింది వ్యక్తిగతానికి కాదు. సమాజానికి. దేశానికి. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అని గురజాడ అనింది అందుకే.
చెహోవ్ వంటి మహా రచయిత ‘గుమస్తా మరణం’ వంటి కథలు రాసిందీ అందుకే. పిరికిగుణం ఉన్న సమాజం పైకి రాదు. పిరికి గుణం వల్లే మధ్యతరగతి పైకి రావడం లేదు. ఈ మాటను పదే పదే చెప్పడానికి ఇష్టపడ్డారు రావిశాస్త్రి. అందుకే ‘అల్పజీవి’ రాసినా అదేకథాంశాన్ని ‘వర్షం’ కథలో రిపీట్ చేశారు. చలిచీమలే కాదు గుమస్తాలు కూడా మహా సర్పాలను చంపగలవు అని ఆమ్ ఆద్మీ వంటి ఉదంతాలు ఒకటీ అరా కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి. అన్నివైపులా రాబందులను తరిమే పావురాల గుంపులు కమ్ముకోవాలి. అప్పుడే ‘అల్పజీవి’కి ధన్యత. రావి శాస్త్రి రచనకు సార్థకత.