అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమైన విషయం విధితమే. రెండు ఇన్నింగ్స్‌ల్లో 3, 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే ఈ పింక్ బాల్ టెస్టులో తన ఓపెనింగ్ స్ధానాన్ని కేఎల్ రాహుల్‌కు త్యాగం చేసిన రోహిత్ శర్మ.. ఏకంగా ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.
రోహిత్ శర్మ తన భార్య రెండో కాన్పు కోసం తొలి టెస్టుకు గైర్హారయ్యాడు. దీంతో అతడి స్ధానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. పెర్త్ టెస్టులో రాహుల్ బాగా రాణించడంతో రెండో టెస్టులో కూడా అతడినే ఓపెనర్‌గా కొనసాగించింది.
ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ మెనెజ్‌మెంట్ నిర్ణయం బెడిసి కొట్టింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, రవిశాస్త్రి జట్టు మెనెజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేశారు. బ్రిస్బేన్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ ఎప్పట్లాగే ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయాలని వీరిద్దరూ అభిప్రాయపడ్డారు.
‘రోహిత్ దూకుడుగా ఆడాలంటే అతనికి ఓపెనింగ్ స్థానమే సరైంది. తన శైలి ఆటతీరు ఆవిష్కృతం కావాలంటే, యథేచ్ఛగా బ్యాటింగ్ చేయాలంటే తనకు నూటికినూరు శాతం నప్పే ఓపెనింగ్‌లో బ్యాటింగ్‌కు దిగాలి. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ అంత సౌకర్యంగా కన్పించలేదు. అతడు కొంచెం డీలా పడినట్లు అన్పించిందని శాస్త్రి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
అదే విధంగా ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్ టాక్‌తో గవాస్కర్ మాట్లాడుతూ.. "రోహిత్ తిరిగి మళ్లీ తన ఓపెనింగ్ స్ధానానికి రావాలి. రాహుల్ ఎందుకు ఓపెన్ చేశాడో మనకు అందరికి తెలుసు. తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేనందున రాహుల్ ఆ స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.
ఆ మ్యాచ్‌లో జైశ్వాల్‌తో కలిసి 200 పరుగుల పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అందుకే రెండో టెస్టులో కూడా రాహుల్‌కు ఛాన్స్ ఇచ్చారు. కానీ అతడు రాణించలేకపోయాడు. కాబట్టి రోహిత్ మళ్లీ ఓపెనర్‌గా రావాలని నేను భావిస్తున్నాను" అని అతడు చెప్పుకొచ్చాడు.
చదవండి: IND vs AUS: 'రోహిత్ ఇంకేం నిరూపించుకోవాలి.. అతడి సత్తా ఏంటో మనకు తెలుసు'
Comments
Please login to add a commentAdd a comment