రైతుల బతుకులతో ఆడుకుంటున్న ప్రభుత్వం
షాబాద్, న్యూస్‌లైన్: అస్తవ్యస్తమైన కరెంటు సరఫరాతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బతుకులతో ఆడుకుంటోందని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్, చేవెళ్ల నియోజకవర్గ సమన్వయకర్త రాచమళ్ల సిద్దేశ్వర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మద్దూర్ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామాలైన రాంసింగ్ తండా, బిక్యా తండాల్లో శుక్రవారం ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడు గంటల కరెంటు సరఫరా ఉంటుందన్న నమ్మకంతో రబీ సీజన్లోనూ అధిక విస్తీర్ణంలో వరి, కూరగాయలు, పూల తోటలను రైతులు సాగు చేశారన్నారు.
కాని ప్రభుత్వం ఇప్పుడు ఆరు గంటలే కరెంటు సరఫరా అని అధికారికంగా ప్రకటించిం దని, అందులోనూ నాలుగు గంటలకు మించి కరెంటు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలకు పతనం తప్పలేదని, దీనికి చంద్రబాబునాయుడే ఉదాహరణ అని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలతోపాటు రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత మహానేత వైఎస్‌కే దక్కుతుందున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు.
తండాల్లో తాగునీటి సమస్య, బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ భూముల్లో పట్టాలు ఇచ్చినా ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఎం.డి. ఖాజాపాషా, కందికొండ వెంకటేశ్‌గౌడ్, మద్దూర్ మాజీ సర్పంచ్ రెడ్యానాయక్, ఎం.డి. అబ్దుల్, షఫీ, మహేందర్, మోహన్, రెడ్యా, నర్సింహా, రవీందర్, గోపాల్, కిషన్, చందర్, హరిచంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.