ఆ యాడ్ తీయడం తప్పే.. క్షమించండి
చైనాలో కియోబీ అనే లాండ్రీ డిటర్జెంట్ బ్రాండ్ ప్రకటన జాతి దురహంకారానికి ప్రతీకగా ఉందంటూ సర్వత్రా విమర్శలు రావడంతో ఈ కంపెనీ వెనక్కి తగ్గింది. ఈ యాడ్ చాలామంది హృదయాలను గాయపరిచిందని, ఇందుకు క్షమాపణలు చెబుతున్నామని ఓ ప్రకటనలో కోరింది. ఈ యాడ్‌ను ఆన్లైన్ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
'ఈ వాణిజ్య ప్రకటన వల్ల ఆఫ్రికా జాతీయుల మనసు గాయమైంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని క్షమాపణ చెబుతున్నాం. జాతి దురహంకారాన్ని మేం ఎప్పుడూ వ్యతిరేకిస్తాం. ఆన్లైన్ ఈ యాడ్‌ను తొలగిస్తున్నాం. ఇంటర్నెట్ యూజర్లు, మీడియా దీన్ని సర్క్యులేట్ చేయదని భావిస్తున్నాం' అని కియోబీ లాండ్రీ డిటర్జెంట్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
కియోబీ లాండ్రీ డిటర్జెంట్ బ్రాండ్ ప్రకటనలో.. ఓ యువతి దుస్తులు ఉతికేందుకు వాషింగ్ మిషన్ వద్దకు రాగా, ఆమెకు ఓ నల్లటి యువకుడు కన్నుకొడతాడు. ఆమె అతడిని దగ్గరకు పిలిచి వాషింగ్ మిషన్‌లోకి తోసేసి దాని పైకెక్కి నవ్వుతూ కూర్చుంటుంది. కాసేపటి తర్వాత వాషింగ్ మిషన్ మూత తీసి చూస్తే.. అతడు తెల్లటి చైనీస్ వ్యక్తిలా మారిపోతాడు. చైనా టీవీలో ఈ ప్రకటన ప్రసారం కావడం, కొన్ని థియేటర్లలో కూడా ఇది రావడంతో వెంటనే ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ఇది జాత్యంహకార పూరితంగా ఉందని జనం భగ్గుమంటున్నారు. ప్రధానంగా ఆఫ్రికా జాతులకు చెందినవాళ్లను కించపరిచే ఇలాంటి ప్రకటనలను ఎలా ఇవ్వనిస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో కియోబీ లాండ్రీ డిటర్జెంట్ కంపెనీ నష్టనివారణ చర్యలకు పూనుకుంది.