రాధిక, శరత్ కుమార్ చుట్టూ బిగుస్తున్నఉచ్చు
చెన్నై : ప్రముఖ నటులు రాధిక, శరత్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రాధికా, శరత్‌కుమార్‌కు చెందిన రాడన్ గ్రూప్ కార్యాలయంలో ఐటీ సోదాలు ముగిశాయి. ఇప్పటికే శరత్‌కుమార్ ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం వరకూ శరత్‌కుమార్‌ను విచారించిన ఐటీ అధికారులు.. మంగళవారం రాడాన్‌లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలకమైన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.
ఇందుకు సంబంధించి ఐటీ శాఖ అధికారులు శరత్‌కుమార్‌కు మరోసారి నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఐటీ శాఖ విచారణకు శరత్ కుమార్‌తో పాటు రాధిక కూడా హాజరు కానున్నారు. అంతేకాకుండా శరత్‌కుమార్, మంత్రి విజయ్‌భాస్కర్ సంభాషణలపైనా ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. రాడన్ కంపెనీ నుంచి డబ్బు మరల్చినట్టుగా అనుమానిస్తున్నారు. నటిగా సినిమాలు, టీవీ సీరియల్ చేస్తున్న రాధిక, తన సొంతం నిర్మాణ సంస్థ రాడన్ ద్వారా పలు సీరియల్లను సినిమాలను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే తమిళనాడులోని ఎంజీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ డాక్టర్ గీతా లక్ష్మీ ఇవాళ ఐటీ అధికారుల విచారణకు హాజరయ్యారు.
కాగా జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో రేగిన అధికార చిచ్చు... పళనిస్వామి సీఎం కావడంతో చల్లారగా... ఆర్కేనగర్ ఉప ఎన్నిక వాయిదాతో మళ్లీ వేడి రాజుకుంది. శశికళ వర్గీయులపై ఆదాయపన్నుశాఖ నిఘా కొనసాగుతోంది. అయితే అధికార పార్టీనే లక్ష్యంగా ఈనెల 7వ తేదీన జరిగిన ఐటీ దాడుల్లో ప్రభుత్వ బండారం బట్టబయలైంది.
వైద్య మంత్రి విజయభాస్కర్, మాజీ ఎంపీ రాజేంద్రన్, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్ తదితరుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిపి కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎడపాడి సహా ఏడుగురు మంత్రులు రూ.89 కోట్ల మేర ఓటర్లను ప్రలోభపెట్టినట్లు సాక్ష్యాధారాలతో ఐటీ నిరూపించింది. మంత్రి విజయభాస్కర్‌ను తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో బరిలో ఉన్న దినకరన్‌కు శరత్ కుమార్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు ఆర్కేనగర్ ఉపఎన్నిక వాయిద పడిన నేపథ్యంలో ఇవాళ డీఎంకే నేతలు ముంబైలో ఇంఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దుచేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఆర్కేనగర్లో కోట్లు కుమ్మరించిన అన్నాడీఎంకే నేతలపై జీవితకాలం నిషేధం విధించాలని కూడా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు విచ్చలవిడిగా డబ్బులు పంచారని, ఐటీ దాడుల్లో మంత్రుల ఇంట్లో నగదు దొరికిన విషయాన్ని వారు గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు.