పెట్రోలు కూడా లేకుండా తగలబెడతా: వర్మ
వంగవీటి సినిమాలో రంగా పాత్రను సరిగా చూపించలేదని ఆరోపించిన రాధారంగా మిత్రమండలిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి మండిపడ్డారు. పనీపాటా లేకుండా వీధుల్లో తిరిగే మీలాంటి వారు రాధా రంగాల పేరు చెడగొట్టడానికే పుట్టారని విమర్శించారు. తన దిష్టిబొమ్మలను తగలబెట్టొచ్చు గానీ, తాను మాత్రం మీ లోపలి కుళ్లును పెట్రోలు కూడా లేకుండా తగలబెడతానని హెచ్చరించారు. తాను క్షమాపణలు చెప్పడం అటుంచి.. మీరు మొరగడం ఆపకపోతే మీ అసలు జాతేంటో అందరికీ తెలిసిపోతుంది ఖబడ్దార్ అంటూ మండిపడ్డారు.
తాము సినిమా షూటింగులో పాల్గొన్నప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలేవీ సినిమాలో లేవని, అసలు రంగా చేసిన సమాజసేవ లాంటివాటిని చూపించలేదని, అందువల్ల వాటిని కూడా కలిపి సినిమాను రీ రిలీజ్ చేయాలని రాధా రంగా మిత్రమండలి సభ్యులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. వర్మకు డబ్బులే కావాలనుకుంటే రాధా రంగా అభిమానులు చందాలు వేసుకుని ఇచ్చేవారని వంగవీటి రాధాకృష్ణ కూడా వర్మను విమర్శించారు. రంగా జీవితచరిత్ర తెలియని ఆయనను అసలు సినిమా తీయొద్దని, విడుదల చేయొద్దని ముందే చెప్పానని ఆయన అన్నారు.