ఆపన్నులకు సాయంచేస్తూ...
పల్లెల్లో వైద్యం చేయాలంటే ఉత్సాహంగా ముందుకు ఉరికేవారెవరుంటారు చెప్పండి. ఒకవేళ పల్లెకి వెళ్లినా మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే డాక్టర్లు ఎంతమంది ఉంటారు?
ఈ రెండు పనులూ చేయడం డాక్టర్ వెంకయ్య గొప్పతనం. ఇక పదేళ్లపాటు కళాకారిణిగా రాణించి ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేస్తూ అందరి మన్ననలు అందుకున్న వ్యక్తి రాధా కె. ప్రశాంతి. ఒకరు మహిళల ఆరోగ్యానికి రక్షణగా నిలిచిన పురుషుడైతే, మరొకరు ఆపన్నులకు అండగా మారిన స్త్రీమూర్తి. గత 23 ఏళ్లనుంచి కేంద్ర మహిళా సంక్షేమశాఖవారు ఇస్తున్న ‘స్త్రీ శక్తి పురస్కార్’కు ఈ ఏడాది మన రాష్ర్టం నుంచి వీరిద్దరూ ఎంపికయ్యారు. డాక్టర్ వెంకయ్యకి ‘రాణిరుద్రమదేవి’ కేటగిరిలో, రాధా కె ప్రశాంతికి ‘కణ్ణగి’ కేటగిరిలో అవార్డులిచ్చి సత్కరించారు.
మొన్నీమధ్యే కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీ వెళ్లారు రాధా కె ప్రశాంతి. బాబా దర్శనం అయిపోయాక పిల్లలు సరదాగా అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తామంటే ఒంటెలున్న ప్రాంతానికి వెళ్లారు. పిల్లలు ఒంటెలు ఎక్కి ఆడుకుంటున్నారు. ప్రశాంతి మాత్రం ఆ ఒంటెలు నడిపేవారి గుడిసెల దగ్గరికి వెళ్లి వారి జీవనవిధానాలను గమనిస్తున్నారు. ఇంతలో ఒక గుడిసెలోనుంచి ఓ వృద్ధురాలి ఏడుపు వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే మంచంపై పడుకుని ఏడుస్తున్న తల్లిని చూస్తూ ఓ నలభై ఏళ్ల వ్యక్తి నవ్వుతున్నాడు. ఆ వ్యక్తి మానసిక వికలాంగుడని చూడగానే ప్రశాంతికి అర్థమైంది.
ఆ వృద్ధురాలు ప్రశాంతిని చూసి బయటికి వచ్చి భోరున విలపిస్తూ...ఒక్క వందరూపాయలుంటే ఇమ్మని అడిగింది. ఎందుకని అడక్కుండానే ‘ఇంత విషం కొనుక్కుని నేను తాగి, నా బిడ్డకు కూడా పోస్తానమ్మా...’అంటూ వేడుకుంది. ప్రశాంతి పది రూపాయలిచ్చి తప్పుకోలేదు. షిరిడిలో తనకు తెలిసిన పెద్దాయన్ని కలిసి ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించే ఏర్పాటు చేశారు. ఆ వృద్ధురాలి చేతిలో పదివేల రూపాయలు పెట్టి ప్రతి నెలా ఎంతోకొంత డబ్బు పంపిస్తానని చెప్పి చిరునామా వివరాలు తీసుకుని వచ్చారు. ‘గుడిలో కాదు...నాకు ఆ గుడిసెలో బాబా కనిపించాడని’ చెబుతున్న రాధా కె ప్రశాంతి ఇప్పటివరకూ ఇలాంటి సేవాకార్యక్రమాలు చాలా చేశారు.
ఒక పక్క కళాకారిణిగా, మరో పక్క స్వచ్ఛంద సేవకురాలిగా అందరి మన్ననలూ అందుకుంటున్న ఆమె జీవితంలో ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో.
ఆంధ్రప్రదేశ్- ఒరిస్సా సరిహద్దులో గజపతి జిల్లా దగ్గర కాశీనగర్ ప్రశాంతి స్వస్థలం. తండ్రి వెంకయ్యనాయుడు వ్యాపారాలు చేసి బోలెడంత సంపాదించినా ఆయనకొచ్చిన బ్లడ్ క్యాన్సర్ ఆస్తినంతా మింగేసింది. అక్కడి నుంచి ప్రశాంతి కష్టాలు మొదలయ్యాయి. పొద్దుమొహం ఎరుగని తల్లి, ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. అన్ని బాధ్యతల్ని తన భుజాన వేసుకుంది. తండ్రి మరణంతో తొమ్మిదో తరగతితోనే చదువాపేసిన ప్రశాంతి అప్పటికే పరిచయమున్న నాటకపరిషత్లను నమ్ముకుని ముందుకు సాగింది. ఒకసారి విశాఖపట్నంలో ప్రశాంతి భరతనాట్య ప్రదర్శనను చూసిన సినిమావాళ్లు ‘చూడ్డానికి అచ్చం రాధలా ఉంది’ అంటూ సినిమారంగంలోకి ఆహ్వానం పలికారు. ‘పరువు-ప్రతిష్ఠ’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ప్రశాంతి 1992 నుంచి 2000 వరకూ దాదాపు 100 సినిమాల్లో నటించారు. 500 నాటకాల్లో నటించి కళాకారిణిగా 200 బెస్ట్ పర్ఫార్మర్ అవార్డులు అందుకున్నారు.
‘స్టెప్’ పేరుతో...
కష్టార్జితంతో కుటుంబాన్ని ఒడ్డుకి చేర్చిన ప్రశాంతి మనసు వెన్న. కష్టపడుతున్నవారు కంటపడగానే ఆమె కరిగిపోతుంది. ‘‘సినిమాల్లోకి వచ్చాక కాస్త చేయి తిరగడం మొదలైంది. ఖర్చులు పోను...మిగతా డబ్బుతో కనిపించిన పేదలకు కడుపునింపే పనిని మొదలుపెట్టాను. పేరు కోసం కాదు...నా తృప్తి కోసం. మా ఊళ్లో ‘పోతన్న’ దేవాలయం కట్టించాను. తర్వాత అక్కడి దళితులకు ఆర్థిక సాయం చేయడం, ఇక్కడ హైదరాబాద్లో కొన్ని స్వచ్ఛందసంస్థలకు వెళుతూ వారికేదైనా ఆర్థిక సాయం చేయడం వంటి పనులు చేస్తుండేదాన్ని. నా పెళ్లయ్యాక 2000 సంవత్సరంలో పూర్తిగా సినిమాలకు దూరమైపోయాను. అప్పుడు ‘స్టెప్’(సొసైటీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎకనామికల్లీ పూర్)ని నెలకొల్పాను. ఈ సంస్థ పేరుతో కొన్ని స్వచ్ఛందసంస్థల్లో ఉన్న వృద్ధులకు కంటి ఆపరేషన్లు చేయించడం, అనాథపిల్లలకు భోజనం, దుస్తులకు డబ్బులు ఇవ్వడం వంటివి చేస్తున్నాను. గత ఏడాది ముగ్గురు పేదలకు గుండె ఆపరేషన్లు కూడా చేయించాను’’ అని చెప్పారు ప్రశాంతి.
ఎల్లలు లేవు...
ప్రశాంతి చేస్తున్న సేవలు ఫలానా ప్రాంతానికే అని పరిమితం కాలేదు. ఆ మధ్యన శ్రీకాకుళం జిల్లా బామిని దగ్గర ఒక పల్లెటూళ్లో పేదలు ఇల్లులేక ఇబ్బందిపడుతున్నారని తెలిసి ప్రశాంతి దానిపై దృష్టి పెట్టారు. ‘‘ నేను కొంత డబ్బు ఇచ్చి తెలిసినవారి దగ్గర కూడా కొంత విరాళాలు తీసుకుని వారికి ఇల్లు కట్టించి ఇచ్చాం. హైదరాబాద్లో ‘వేగేశ్న ఫౌండేషన్’ వాళ్లకి ఆర్థికసాయం చేయడంలో మా సంస్థ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఒకమాటలో చెప్పాలంటే స్పందించడం, సాయం చేయడం నాకు బాగా అలవాటైపోయిన విషయాలు’’ అని చెప్పే ప్రశాంతి తనకు స్త్రీశక్తి అవార్డు రావడాన్ని ప్రశంసకంటే బాధ్యతగా భావిస్తున్నారు. ‘స్టెప్’ సంస్థను మరింత విస్తరించి పేదపిల్లలకు, వృద్ధులకు మరిన్ని సేవల్ని అందించాలనుకుంటున్న ప్రశాంతి ఆలోచన, ఆశయం ఆదర్శప్రాయమే!