రోహిత్ వేముల తల్లి తీవ్ర వ్యాఖ్యలు, అరెస్ట్
హైదరాబాద్: రోహిత్ వేముల వర్ధంతి సభ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీ ప్రాంగణంలో సభ నిర్వహణకు అనుమతిలేని కారణంగా పోలీసులు.. విద్యార్థులెవ్వరినీ లోనికి అనుమతించలేదు. దీంతో ప్రభుత్వానికి, వీసీకి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలుచేశారు. చివరికి గేటుబయటే సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రోహిత్ తల్లి రాధిక ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
"ప్రభుత్వంతో నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఇప్పటికే కులం నిర్ధారణ పేరుతో నన్ను తీవ్రంగా వేధించారు"అని రాధిక అన్నారు. రోహిత్ లేఖరాసిన వెంటనే యూనివర్సిటీ అధికారులకు స్పందించి ఉంటే తనకు పుత్రశోకం ఉండేదికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై యూనివర్సిటీల్లో ఏ ఒక్కరూ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు.
రాధిక సహా విధ్యార్థుల అరెస్ట్
రోహిత్ వర్ధంతి సభ సజావుగా పూర్తవుతున్నవేళ.. హెచ్‌సీయూ వీసీ అటుగా రావడంతో మళ్లీ కలకలం రేగింది. విద్యార్థులు ఒక్కసారిగా వీసీని చుట్టుముట్టి ముట్టడించారు. రోహిత్ తల్లి రాధిక కూడా విద్యార్థులతోకలిసి ముట్టడికార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది గమనించిన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు విఫలయత్నం చేశారు. చివరికి కొందరు విద్యార్థినాయకులు సహా రాధికను అరెస్ట్‌చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.