కొత్త అమ్మాయి...సరికొత్త రచన
ఇంగ్లిష్ సాహిత్యంలో తాజా భారతీయ సంచలనం ‘ది పెట్‌పోస్ట్ సీక్రెట్’. యువ పాఠకులను సమ్మోహపరచి, వారి తల్లిదండ్రుల హృదయాలలో సైతం చోటు సంపాదించుకున్న ఈ నవలలో.. చదవడానికి ఎంత ఉందో, రచయిత్రి గురించి చెప్పుకోవడానికీ అంతే ఉంది!
అమెరికాలోని బ్రౌన్ యూనివ ర్శిటీ నుంచి బీయస్సీ సైకాలజీ, ‘శిశు అభివృద్ధి’ ప్రధాన అంశంగా ఎం.ఎ. చేసిన రాధికా ధరీవాల్ తొలి నవల ‘ది పెట్‌పోస్ట్ సీక్రెట్’. అమ్మానాన్నల నుంచి దృఢచిత్తాన్ని, సంకల్పబలాన్ని వారసత్వంగా కాక, ఒక స్ఫూర్తిగా అందిపుచ్చుకున్న ఈ ఢిల్లీ అమ్మాయి, ప్రచురణ రంగంలో ఉన్న తండ్రి వృత్తి రీత్యా చిన్న వయసులోనే ప్రపంచంలోని భిన్న సంస్కృతులను చూడగలిగారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, హంగేరి, ఫిలిప్పీన్స్, అమెరికాలలో కొన్నాళ్లు ఉండి వచ్చారు. 1868 నాటి ‘లిటిల్ ఉమన్’ నవలలోని స్త్రీవాద భావాలు గల ప్రధాన పాత్ర జోసెఫైన్ మార్చ్‌తో తనను తను తరచు పోల్చుకునే రాధిక.. ఒక మనిషి ఉనికిని తెలిపేది వారి వ్యక్తిత్వమేనంటారు. ఇదే విషయాన్ని ‘ది పెట్‌పోస్ట్ సీక్రెట్’లో అందంగా, ఆహ్లాదంగా, ఆకట్టుకునేలా చెప్పారు.
‘ది పెట్‌పోస్ట్ సీక్రెట్’లో ప్రధానంగా మూడు పాత్రలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైన పాత్ర ఉడుత. తర్వాతి రెండు పాత్రలు ఒక కుక్క, ఒక కాకి. కుక్కకి ‘డెస్’ అని, కాకికి ‘అజుల్ఫా’ అని పేర్లు ఉన్నాయి కానీ, రచయిత్రి ఎందుకనో ఉడతకి ‘ఉడత’ (ఇంగ్లిష్‌లో ‘స్క్విరల్’) అనే పేరును ఉంచేశారు. ఈ టీనేజ్ స్క్విరల్ ఎంతో అందమైనది, ఒద్దిక గలది. కష్టపడి పనిచేస్తుంటుంది. విధేయంగా ఉంటుంది. ఇంతకీ ఇది పనిచేసేది ఒక ముంగీస దగ్గర. ఇక పని ఏమిటంటే పెట్పోస్టింగ్. ఉత్తరాలు బట్వాడా చేయడం. బద్దకస్తుడైన ముంగీస బాసు దగ్గర స్క్విరల్.. ఒక బానిస మాదిరిగా వెట్టి చాకిరీ చేస్తుంటుంది. తన శక్తిసామర్థ్యాలు తనకు తెలియక అలా పడి ఉంటుంది. ఆ క్రమంలో జరిగిన ఒక చిన్న సంఘటన పర్యవసానంగా స్క్విరల్ తనెంత ధైర్యవంతురాలో, ఎంత గొప్ప వ్యక్తిత్వం గలదో తెలుసుకుంటుంది.
రెండో పాత్ర ‘డెస్’. ఇది పగ్, బీగిల్ జాతి లక్షణాలు కలగలిసిన శునకం. దీని వయసు, స్క్విరల్ వయసు ఒకటే. దీని దృష్టి ఎప్పుడూ తిండి మీదే. రచికరమైన భోజనం అంటే పడిచస్తుంది. తిన్నంత తిని, తాగినంత తాగుతుంది. డెస్ కూడా స్క్విరల్లా అందమైనదే కానీ, అనాథ మాత్రం కాదు. ఎంతగానో ప్రేమించే కుటుంబం ఉంటుంది. ముగ్గురు అక్కలుంటారు. స్క్విరల్ పరిచయం అయీ కాగానే దానికి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. మూడోది ‘అజుల్ఫా’. ఇదొక కాకి. పరిమాణంలో పెద్దది. బలమైనది. చిన్న కళ్లు, సన్న గొంతు. వయసులో స్క్విరల్, డెస్ల కన్నా పెద్ద. ఒక సంఘటనతో ఇవి మూడూ మంచి ఫ్రెండ్స్ అయిపోతాయి.
ఇక కథలోకి వెళ్తే.. అనాథ అయిన స్క్విరల్కి ఓ రోజు అనూహ్యంగా పెళ్లి పిలుపు అందుతుంది! అది ఆశ్చర్యపోతుంది. వెళ్లాలని నిశ్చయించుకుంటుంది. పెళ్లి జరుగుతున్నది సంపన్నులైన వధూవరులకు. ఆ పెళ్లిలోనే వధువు సోదరుడైన డెస్తో స్క్విరల్కి పరిచయం అవుతుంది. కొద్దిసేపట్లోనే ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. స్క్విరల్ మనసు విప్పుతుంది. తనో అనాథనని చెబుతుంది. డెస్ హృదయం కరిగిపోతుంది. స్క్విరల్ను ఓదార్చుతాడు. ఆ సందర్భంలో అనుకోకుండా.. పెళ్లయినవాళ్లు మాత్రమే తాగవలసిన ‘వెడ్డింగ్ వైన్’ను ఇవి రెండూ సేవిస్తాయి. డెస్కి ఏమీ అవదు కానీ, ఆ ప్రభావంతో స్క్విరల్కు తీవ్రమైన తలనొప్పి ప్రారంభం అవుతుంది. చనిపోయిన తల్లి తనతో ఏదో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.
సరిగ్గా అప్పుడే పెళ్లింటిపై కాకుల గుంపు దాడి చేస్తుంది. ఆ గుంపులో మంచిదైన ‘అజుల్ఫా’ సహాయంతో స్క్విరల్, డెస్ తప్పించుకుంటాయి. ఈ క్రమంలో ఈ మూడూ కలసి అనేక సాహసాలు చేస్తుంటాయి. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంటాయి. ఒక దుష్ట మార్జాలం సూచనతో కాకుల గుంపు, తేనెటీగల గుంపు తమపై దాడి చేస్తున్నాయని గ్రహించి వాటితో పోరాడుతుంటాయి. ఆ తరుణంలో స్క్విరల్కు ఓ మంత్రదండం గురించి తెలుస్తుంది. దాన్ని కనుక సంపాదిస్తే ఎవరినైనా ఇట్టే బానిసలుగా చేసుకోవచ్చు. లేదా ఎవరికైనా ఇట్టే విముక్తి కల్పించవచ్చు. అయితే ఆ మంత్రదండాన్ని సాధించడం తేలిగ్గా జరిగే పని కాదు. సాహసాలు చెయ్యాలి, ప్రమాదపు అంచుల్లోకి వెళ్లి రావాలి. అయినా సరే స్క్విరల్ కార్యదీక్షకు పూనుకుంటుంది. చివరికి విజయం సాధిస్తుంది. తన జన్మ పరమార్థాన్ని, జన్మ రహస్యాన్ని తెలుసుకుంటుంది. ఆ ఆయుధం మరేదో కాదు, తన శక్తిని తాను తెలుసుకోవడం!
రాధికా ధరీవాల్ను మంచి రచయిత్రిగా నిలబెట్టే నవల ఇది. పాత్రలను, సందర్భాలను, సన్నివేశాలను చాలా పకడ్బందీగా అక్షరబద్ధం చేశారు రాధిక. ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్ కాలిన్స్ ఇండియా నుంచి వెలువడిన ఈ రచన... రచయిత్రి పడ్డ నాలుగేశ్ల శ్రమకు ఫలితం. పాఠకులకు మనోల్లాసం.
నాలుగేళ్ల క్రితం ఓ రోజు..
అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. నా గ్రేట్ డేన్ (కుక్కపిల్ల)ను తీసుకుని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి కారులో వెళ్తుంటే ఓ చోట సిగ్నల్ పడింది. కారును ఆపి, విండోలోంచి బయటికి చూస్తుంటే ఓ ఉడుత కనిపించింది. ఎక్కడ సంపాదించిందో ఓ బ్రెడ్డు ముక్కను కొరికి తింటోంది. ఇంతలో ఓ కాకి గబాల్న వాలి, ఉడుత చేతుల్లోంచి బ్రెడ్డు ముక్కను లాగేసుకుని తినడం మొదలు పెట్టింది. కొద్ది క్షణాల తర్వాత అక్కడికో కుక్క వచ్చి కాకిని తరిమేసి బ్రెడ్డు ముక్కను నోట కరచుకుంది. ఇదంతా చూస్తున్నప్పుడు నాకేమీ అనిపించలేదు కానీ, ఆ రాత్రి నిద్రపట్టలేదు. పట్టినా నిద్రలోకి ఉడుత, కాకి, కుక్క వచ్చేస్తున్నాయి. రోజూ ఆలస్యంగా నిద్ర లేచే దాన్ని ఆ వేళ ఉదయం ఐదు గంటలకే లేచి కూర్చున్నాను. ఏదో రాయాలనే తపన. జీవన పోరాటంలో భాగంగా ప్రాణులు ప్రవర్తించే తీరును థీమ్‌గా తీసుకుని ఆరోజే ఒక కథను అల్లుకున్నాను. పాత్రల్ని కల్పించాను. అది నవలగా రూపాంతరం చెందడానికి ఏడాదిన్నర పట్టింది. కానీ ఏదో అసంతృప్తి. తర్వాతి రెండున్నర ఏళ్లలో ముప్పైసార్లు నవలను తిరగరాశాను. అలా ‘ది పెట్‌పోస్ట్ సీక్రెట్’ ఒక కొలిక్కి వచ్చింది.
- రాధికా ధరీవాల్