20న ‘వెంగమాంబ’ గ్రంథావిష్కరణ
వర్ధన్నపేట : మండలకేంద్రానికి చెందిన సుతారి రాధిక రచించిన తరి గొండ వెంగమాంబ వేంకటాచల మహత్యం గ్రంథావిష్కరణ ఈనెల 20న హైదరాబాద్‌లోని త్యాగరాయగానసభలో నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ప్రభాకర్‌రావు, కార్యదర్శి మద్దాళి రఘురాం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాకతీయ యూనివర్సిటీలో సుతారి రాధికకు ఈ గ్రంథ పరిశీలనలో డాక్టరేట్ లభించింది. రాధిక కేయూలో ఎంఏ తెలుగు చదివి తరిగొండ వెంగమాంబ శ్రీ వెంకటాచల మహాత్మ్యంపై పీహెచ్డీ చేశారు.
కేయూ ప్రొఫెసర్ అనుమాండ్ల భూమయ్య నేతృత్వంలో పరిశోధన నిర్వహించి రెండు సంవత్సరాల క్రితం అవార్డుకు ఎంపికయ్యారు. ఇటీవల వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వెంకటరత్నం చేతుల మీదుగా కాన్వొకేషన్ అందుకున్నారు. గ్రంథావిష్కరణను కిన్నెర ఆర్ట్స్ థియటర్స్, త్యాగరాయగానసభ సంయుక్త ఆధ్వర్యంలో చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారి, సభాధ్యక్షుడిగా ప్రొఫెసర్ అనుమాండ్ల భూమయ్య, ప్రముఖ రచయిత డాక్టర్ ఆర్.అనంతపద్మనాభరావు, ప్రముఖ రచయిత్రి ఎన్.అనంతలక్ష్మి, త్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా వేంకటదీక్షితులు పాల్గొననున్నారు.