‘ఆర్పీ’ నిందితుల అరెస్ట్
పరారీలోనే ప్రధాన సూత్రధారి సాధూ
మునుగోడు : నల్లగొండ జిల్లాలో ఆర్పీ (రేడియేషన్ పవర్) దందా పేరిట అమాయకులను బురిడీ కొట్టించి రూ. లక్షలు వసూలు చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి సాధూ ఇంకా పరారీలోనే ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. మునుగోడు మండలంలోని సింగారం వాసి షేక్ అఫ్జల్ నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కి వెళ్లాడు. అక్కడ మల్లేపల్లికి చెందిన సాదూతో పరిచయం ఏర్పడింది. అప్పుడే తన వద్ద ఆర్పీ ఉందని రూ.లక్ష పెట్టుబడి పెడితే పదిరెట్లు అంతకన్నా ఎక్కువ లాభం వస్తుందని సాదూ నమ్మబలికాడు. దానిని లండన్ మెటల్ కంపెనీకి విక్రయిస్తే రూ. 2 లక్షల కోట్లు వస్తాయని, వీసా తదితర ఖర్చులకు డబ్బు అవసరమని, పెట్టు బడి పెడితే రూ. వెయ్యి కోట్లు ఇస్తామని అఫ్జల్‌కు ఆశ చూపగా, వెంటనే అతను రూ. 4 లక్షలు ఇచ్చాడు.
కమీషన్ ఇస్తానని..
అఫ్జల్ ఏడాది గడిచాక సాదూని సంప్రదిస్తే డబ్బులు సరిపోవని, ఎవరైనా ఉంటే పెట్టుబడి పెట్టించు.. కమీషన్ కూడా ఇస్తానని చెప్పాడు. దీంతో అఫ్జల్ తనకు పరిచయం ఉన్న సింగారంకు చెందిన పిట్టల రఘు, మునుగోడుకు చెందిన నీల పుల్లయ్య, జక్కలవారిగూడేనికి చెందిన జక్కల మల్లేశ్, జక్కల లింగస్వామిలను ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వారితో పాటు బంధువులు, స్నేహితుల వద్ద ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 6 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టించాడు. ఐదుగురు ఏజెంట్లు సింగారం, జక్కలవారిగూడెం, మునుగోడు, చీకటిమామిడి, చొల్లేడు తదితర గ్రామాల్లోని 50 మంది సభ్యుల నుంచి రూ. 52 లక్షలకు పైగా వసూలు చేశారు. కమీషన్‌తో జల్సాలు చేశారు.
రెండు నెలల క్రితం ప్రిన్స్ రంగప్రవేశం
రెండు నెలల క్రితం తన సోదరుడైన ఫర్హాన్ అహ్మద్ ఖాన్ (ప్రిన్స్)ని ముఠా సభ్యులకు పరిచయం చేశాడు. మీరు ఇకనుంచి వసూలు చేసిన దాంట్లో మీరు సగం తీసుకొని, మాకు సగం ఇవ్వాలని చెప్పాడు. అప్పటి నుంచి ఈ ముఠా సభ్యు లు ప్రిన్స్‌తో కలసి రూ.35 లక్షలకు పైగా బ్యాంక్ ఖాతాల పేరుతో వసూలు చేసి అతడికి ఇచ్చారు. నిందితుల నుంచి రూ. 32 లక్షల ఆస్తులను పోలీసులు రికవరీ చేసుకున్నారు. సూత్రధారి సాదూ పరారీలోనే ఉన్నట్లు సీఐ తెలిపారు.