'వారినేమనరు.. మమ్మల్ని మాత్రం తిడతారు'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న తన ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై మరోసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విమర్శల దాడి చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల విషయంలో ఆమె చేసిన దానికంటే తన మద్దతుదారులను ఉద్దేశించి అంటున్న మాటలే చాలా కఠినంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20శతాబ్దంలో ఫాసీజం, నాజీజం, కమ్యూనిజంపై అమెరికా పైచేయి సాధించిందని, ఇప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదం అంతు చూడాల్సిన సమయం వచ్చిందని ట్రంప్ అన్నారు.
ప్రస్తుతం ఉన్న అమెరికా అధ్యక్షుడు(బరాక్ ఒబామా)కానీ, తన ప్రత్యర్థి హిల్లరీ కానీ ర్యాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం గురించి కనీసం ఒక్కమాటైనా మాట్లాడటం లేదని, అంతకంటే ఘాటుగా తన మద్దతుదారులను మాత్రం తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన అమెరికా దేశభక్తులంతా తమ ప్రచారంలో పాలుపంచుకుంటున్నారని, వారిలో పోలీసులు, సైనికులు, ఇతర ముఖ్యులు ఉన్నారని, మిలియన్లకొద్ది మద్దతుదారులను హిల్లరీ కించపరుస్తారా అని ప్రశ్నించారు. మరి ఎలా ఎందుకు ర్యాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం గురించి ఆమె ఒక్కసారైనా మాట్లడరు అని నిలదీశారు.