స్వర్ణ దేవాలయంలో రెండువర్గాల ఘర్షణ
అమృత్సర్, చండీగఢ్: సిక్కుల పుణ్యక్షేత్రమైన అమృత్సర్ స్వర్ణదేవాలయంలో శుక్రవారం ఉదయం రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. సుమారు అరగంటపాటు జరిగిన ఘర్షణలో 12 మందివరకు గాయపడ్డారు. అకల్తక్త్ భవనం వెలుపల కత్తులు, బల్లాలు, కర్రలతో రెండు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి.
దీంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి 30 ఏళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో అకాలీదళ్ చీలికవర్గం నేత సిమ్రన్‌జిత్‌సింగ్ మాన్ మద్దతుదారులు కొందరు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేయడంతో గొడవ ప్రారంభమైందని అమృత్సర్ పోలీస్ కమిషనర్ జతిందర్ సింగ్ తెలిపారు. దానికితోడు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) సెక్యూరిటీ గార్డులు ఈ కార్యక్రమంలో సిమ్రన్‌జిత్‌సింగ్ మాన్ ప్రసంగించకుండా అడ్డుకున్నారని ఆయన వివరించారు.
దాంతో గొడవ ముదిరి ఇరువర్గాలు విచక్షణారహితంగా కత్తులు, బల్లాలతో కొట్టుకున్నాయని, ఈ సంఘటనలో ఎస్జీపీసీ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ఐదుగురు సభ్యులు గాయపడ్డారని చెప్పారు. స్వర్ణదేవాలయంలో భద్రత, ఇతర వ్యవహారాలన్నీ ఎస్జీపీసీ టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణలోనే ఉంటాయని, దాంతో ఆలయంలోకి పోలీసులను అనుమతించలేదని జతిందర్ సింగ్ తెలిపారు.
ప్రస్తుతం ఉద్రిక్తత చల్లారిందని, పరిస్థితి అదుపులో ఉందని వివరించారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టినట్టు అకల్తక్త్ జతేదార్ జ్ఞాని గుర్బచన్ సింగ్ తెలిపారు. కొన్ని అసాంఘిక శక్తుల కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు ప్రాథమిక విచారణద్వారా తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఆలయంలో పూజాదికాలు, ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగలేదని అధికారవర్గాలు తెలిపాయి.
ఎస్జీపీసీ, అకాలీదళ్ నాయకత్వంలోని పంజాబ్ ప్రభుత్వం సిక్కుల సమస్యలను పట్టించుకోవడంలేదని, పరిష్కారంకోసం నిలదీసినవారిని వేధిస్తున్నారని సిమ్రన్‌జిత్‌సింగ్ మాన్ ఆరోపించారు. 1984 జూన్‌లో స్వర్ణదేవాలయంలో తిష్టవేసిన మిలిటెంట్లను ఏరివేయడానికి అప్పటి ప్రభుత్వం ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలో వెయ్యిమందివరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఏటా సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ బ్లూసార్ జరిగి 30 ఏళ్లయిన సందర్భంగా అమృత్‌సర్‌లో బంద్ పాటించారు.
సీఎం బాదల్ ఖండన
స్వర్ణదేవాలయంలో రెండువర్గాలు ఘర్షణకు దిగిన సంఘటనను పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. స్వర్ణదేవాలయంలో చోటుచేసుకున్న సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులను ఎంతో బాధించిందని ముఖ్యమంత్రి విచారం వ్యక్తంచేశారు. కాగా ఈ సంఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.