రెడ్ ఎఫ్ఎంకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రముఖ రేడియో ఛానెల్ రెడ్ ఎఫ్ఎంకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. నాలుగో విడత రేడియో తరంగాల వేలంలో ఆ సంస్థ పాల్గొనరాదంటూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తోసిపుచ్చింది. సన్నెట్ వర్క్ ఆధ్వర్యంలోని రెడ్ ఎఫ్ఎం కంపెనీలో ప్రధాన షేర్ హోల్డర్ అయిన కళానిధి మారన్పై పలు ఆర్థిక నేరాల అభియోగాలు ఉన్నందున తరంగాల వేలంలో రెడ్ ఎఫ్ఎంను అనుమతించబోమంటూ ఐ అండ్ బీ శాఖ గతంలో తీర్మానించింది.
అయితే ఆ తీర్మానం చెల్లదన్న కోర్టు.. వేలంలో పాల్గొనేందుకు ఆ సంస్థకు గ్రీన్ సిన్నల్ ఇవ్వడంతోపాటు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో సమగ్రంగా వివరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 24 కు వాయిదా వేసింది. కాగా, రేడియో తరంగాల వేలం వచ్చే సోమవారం (27న) ఢిల్లీలో జరగనుంది. 2002లో ప్రారంభమై, దాదాపు పది రాష్ట్రాల్లో ఏడుకుపైగా భాషల్లో రెడ్ ఎఫ్ఎం తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.