రాడ్రిగో, ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ (రాయని డైరి)
మగాడు మగాడిలా ఉండాలి. చేతిలో గన్ ఉండాలి. ట్రాఫిక్‌లో బైక్ ఉండాలి. నోట్లో నిరంతరం ఒక ‘సన్ ఆఫ్ ఎ బిచ్’ ఉండాలి. ఊరికే షేక్‌హ్యాండ్ ఇస్తుండే మగాణ్ని, మర్యాదగా మాట్లాడుతుండే మగాణ్ని, లగ్జరీ కార్లలో తిరుగుతుండే మగాణ్ని మగాడిగా గుర్తించను నేను.
అలిగే మగాడు, హర్ట్ అయ్యే మగాడు, తప్పుకుపోయే మగాడు కూడా మగాడు కాదు. శత్రువుతో ఫైట్ చెయ్యాలి. శత్రువుని ఫినిష్ చెయ్యాలి. కనీసం ‘పనిష్’ చెయ్యాలి. సిడ్నీషెల్డన్నీ, రాబర్ట్ లడ్లుమ్నీ చదవని మగాడు కూడా మగాడు కాదు నా దృష్టిలో.
వియంటియాన్ సమ్మిట్‌లో ఉన్నాం. సౌతీస్ట్ ఏషియన్ నేషన్స్‌ని ఉద్ధరించేందుకు కూర్చొని ఉన్నారు పెద్దలందరూ. బరాక్ ఒబామా కూడా ఉన్నాడు. అతడితో పాటు మరికొందరు మర్యాదస్థులు! మర్యాదస్తుల మధ్య ఎంతోసేపు మగాడిగా ఉండలేనని అర్థమౌతోంది నాకు. ఫిలిప్పీన్స్‌లో నేనేదో చేయరాని పాపం చేసి, దాన్ని కడిగేసుకోడానికని దక్షిణ చైనా సముద్రాన్ని దాటి, ఇంతదూరం..
ఈ పరమ పావనమైన సదస్సులోని వాష్ బేసిన్ కోసం వచ్చినట్టు నాకు దూరదూరంగా జరిగిపోతున్నారంతా! ఒబామా ఒక్కడు.. ‘వాట్ రాడ్రిగో’ అన్నాడు. మగాడనిపించాడు! క్రితం రోజే అతడిని తిట్టాను. ‘ఫిలిప్పీన్స్‌లో డ్రగ్ డీలర్ల క్రాక్‌డౌన్ గురించి ఫోరమ్‌లో మాట్లాడితే నీ స్పీచ్ కాగితాలు లాగేసుకుని చింపిపారేస్తాను ఏమనుకున్నావో... సన్నాఫే బిచ్’ అని తిట్టాను. సమ్మిట్‌కి రాడనుకున్నాను. వచ్చాడు! రిటార్ట్ ఇస్తాడనుకున్నాను. ఇవ్వలేదు. తర్వాత ఇచ్చాడు. ఫోరమ్‌లో నా క్రాక్‌డౌన్ గురించి మాట్లాడి!!
రైట్ వే లో ఫైట్ చెయ్యమంటాడు ఒబామా. ఏది రైట్ వే ? అవతలివాడు రాంగ్ రూట్లో వస్తుంటే మనం రైట్ వేలో వెళ్లి ఏం చేస్తాం? చచ్చిపోతాం. ఫిలిప్పీన్స్ అమెరికన్ కాలనీగా ఉన్నప్పుడు అమెరికా మాత్రం చేసిందేమిటి? క్రాక్డౌనే కదా. హిస్టరీని మర్చిపోయాడా ఒబామా? లేక నన్ను మర్చిపొమ్మంటున్నాడా?!
‘రాడ్రిగో.. యు ఆర్ ఎ ప్రెసిడెంట్. నాట్ ఎ విజిలాంటీ’.. యు.ఎన్.కు నన్ను నిందించడం ఓ అలవాటు. నావన్నీ ఎక్స్ట్రా జ్యుడీషియల్ కిల్లింగ్స్ అట! ‘చట్టం ఉంది కదా. గన్ ఎందుకు నీ చేతుల్లో?’ అంటుంది! ఓకే దెన్. ఒక్కరోజు గన్ లేకుండా బయటికి వస్తా. రెండోరోజుకి ప్రెసిడెంట్ ఉంటాడా ఫిలిప్పీన్స్‌కి?!
సమ్మిట్‌లో చైనా టాపిక్ వచ్చింది. ఒక్కరూ గన్ తియ్యలేదు! పసిఫిక్ సముద్రం చైనాకు దక్షిణం వైపున ఉంది కాబట్టి అది ‘దక్షిణ చైనా సముద్రం’ అయిపోతుందా? అలాగైతే అది ‘పశ్చిమ ఫిలిప్పీన్స్ సముద్రం’ కూడా అవ్వాలి. ఫిలిప్పీన్స్‌కి పశ్చిమాన ఉంది కదా.
ఇవన్నీ కాదు. సముద్రంపైకి ఒక్కణ్నీ ‘జెట్ స్కీ’లో వెళ్తా. పోల్ పట్టుకుని, నా కంట్రీ ఫ్లాగ్ పట్టుకుని వెళ్తా. ఫ్లాగ్‌ని ఒడ్డున పాతి, చైనా ప్రెసిడెంట్ వస్తాడేమో రమ్మంటా. చూసుకుందాం రమ్మంటా.
మాధవ్ శింగరాజు