ఆధారాలు లేవు...
► రామచంద్రపురం మఠాధిపతి రాఘవేశ్వరస్వామిజీకి ఊరట
► అత్యాచార ఆరోపణలు కొట్టివేత
సాక్షి, బెంగళూరు: రామకథ గాయని ప్రేమలతపై అత్యాచారానికి పాల్పడినట్లు సరైన ఆధారాలు లేకపోవడంతో రామచంద్రపురం మఠాధిపతి రాఘవేశ్వరస్వామిజీపై నమోదైన కేసును కొట్టివేస్తూ స్థానిక సెషన్స్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. వివరాలు... రాఘవేశ్వరస్వామీజీ తనను భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ప్రేమలత దాదాపు ఏడాది క్రితం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిపిన స్థానిక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ముదిగౌడ ‘బాధితురాలి ఆరోపణలకు, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో పాటు డీఎన్ఏ నివేదికకు పొంతన కుదరడం లేదు. అంతేకాకుండా చార్జ్‌షీట్ కూడా ప్రేమలత ఆరోపణలను ప్రతిబింబించడం లేదు. అందువల్ల రాఘవేశ్వరస్వామిజీపై నమోదైన కేసును కొట్టివేస్తున్నాం.’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కోర్టు తీర్పు పట్ల రామచంద్రపుర మఠం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.