నటుల కంటే కథలు కీలకం
పెద్ద నటుల కోసం కథలను ఫణంగా పెట్టి మార్పులు చేయడం తనకు ఎంతమాత్రమూ ఇష్టముండదని నటుడు, దర్శకుడు రజత్ కపూర్ అంటున్నాడు. కథే తన సినిమాకు నాయకుడని చెప్పాడు. దర్శకుడిగా రఘు రోమియో, మిక్స్డ్ డబుల్స్, మిథ్య వంటి సినిమాలు ఇతనికి మంచి పేరు తెచ్చాయి. ‘నేను తరచూ సినిమాలు తీసే దర్శకుణ్ని కాదు. స్క్రిప్టు రాయడానికి చాలా సమయం తీసుకుంటాను. మననిత్యం జీవితంలో ఎదురయ్యే సమస్యలే ప్రధానాంశంగా నా కథలు ఉంటాయి. ఇవన్నీ సామాన్యుల కోసమే. ఎవరైనా ప్రధాన పాత్ర పోషించవచ్చు. పెద్ద తారల కోసం కథల్లో మార్పులు చేయను’ అని స్పష్టంగా చెప్పాడు. రజత్ తాజాగా ఢిల్లీ నగరం నేపథ్యంగా సాగే ఆఖో దేఖీ సినిమా తీస్తున్నాడు. ఈ హాస్యసినిమా రాజే బావుజీ అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది.
ప్రతిరోజూ తాను ఎదుర్కొనే అనుభవాలను దూరంగా ఉండే కుటుంబ సభ్యులతో పంచుకోవడాన్ని ఇందులో చూడవచ్చు. దీని కథ రాయడానికి రజత్‌కు ఎనిమిదేళ్లు పట్టింది. ‘మనకు ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. అయితే మన కళ్లతో చూసి లేదా అనుభవించిన వాటిని మాత్రమే నమ్ముతాం. ఇలాంటి కథలు ఎంతో మందికి తట్టిఉంటాయి. ఇది హాస్యంతో కూడిన తాత్విక, కుటుంబ సినిమా’ అని వివరించాడు. ఇందులో ప్రధానపాత్రలో సంజయ్‌మిశ్రా, రజత్ కనిపిస్తారు. సంజయ్‌ను దృష్టిలో ఉంచుకొనే ఈ కథ తయారు చేశానని, అతని నటన ఎంతో సహజంగా ఉంటుందని ప్రశంసించాడు. ఆఖో దేఖీని పూర్తిగా ఢిల్లీలోనే తీశారు. ఇది ఈనెల 21న థియేటర్లకు వస్తోంది. తను పుట్టిపెరిగింది పాతఢిల్లీలోనే కాబట్టి సినిమా షూటింగ్ అంతా అక్కడే జరిగిందని, ఇందుకోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నామని చెప్పాడు. దిల్ చాహతా హై, కార్పొరేట్, మాన్సూన్ వెడ్డింగ్, భేజాఫ్రై, దస్విదానియా సినిమాల్లో రజత్ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.