పర్యాటక కేంద్రంగా ‘రఘునాథ చెరువు’
ప్రగతినగర్ : జిల్లా కేంద్రంలోని రఘునాథ చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఆయన నగరంలోని పలు ప్రాంతాలను ముఖ్యమంత్రి అదనపు సంయుక్త కార్యదర్శి స్మిత సబర్వాల్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
ముందుగా ఖిల్లా ప్రాంతంలోని రఘునాథ చెరువు, ఖిల్లా రామాలయాన్ని సందర్శించి అక్కడి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. ఈ ప్రాంతం తెలంగాణలో తలమానికమన్నారు. ఇక్కడ తెలంగాణ మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు స్వయంగా తానే ఖిల్లా రామాలయ గోడలపై ‘నా తెలంగాణ.. కోటి రతనా ల వీణ’ అని రాసి యావత్తు తెలంగాణ ప్రజలను జైలు నుంచే ఉత్తేజపరిచారన్నారు. అదే విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ భక్తుడు భక్తరామదాసు స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే సేద తీరిన ఆనవాళ్లు కూడా ఉన్నాయన్నారు.
ఇంతటి ప్రఖ్యాతి గాంచిన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. అనంతరం అక్కడి నుంచి హమల్‌వాడి నుంచి దుబ్బ రోడ్డును పరిశీలించారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి గౌతంనగర్ వాటర్ ట్యాంకును పరిశీలించారు. తాగునీరు సక్రమంగా సరఫరా అవుతుందోలేదనని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుభాష్‌నగర్ రైతుబజార్‌ను పరిశీలించి ఇంకా పెద్ద ఎత్తున కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలన్నారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్తో పాటు నగరమేయర్ సుజాత శ్రీశైలం,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మంగతాయారు తదితరులున్నారు.