ragyanaik
-
భార్య సహకారంతో తోడల్లుడి దారుణం.. 225 రోజులకు దొరికిన అస్తిపంజరం
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం నేపథ్యంలో గత సంవత్సరం ఆగస్టు 19న రాగ్యానాయక్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, బతికుండగానే కాళ్లు చేతులు కట్టేసి కృష్ణా నది బ్యాక్ వాటర్‌లో ముంచి హత్య చేసిన విషయం తెలిసిందే. కేసును చేధించిన రాయదుర్గం పోలీసులు అప్పట్లో మృతదేహం కోసం ముమ్మరంగా గాలించినా మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు. కృష్ణానదిలో బ్యాక్ వాటర్ తగ్గడంతో 225 రోజుల తర్వాత చేపల వలలో చుట్టి ఉన్న అస్థి పంజరాన్ని గుర్తించిన తుంగపాడు, లావు తండా వాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శుక్రవారం రాయదుర్గం పోలీసులు అక్కడికి వెళ్లి అస్థి పంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా, తుంగపాడు గ్రామానికి చెందిన రాగ్యానాయక్(28), పెద్దవూరకు చెందిన రోజాతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రాగ్యానాయక్ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ మణికొండలో నివాసం ఉండేవారు.. ఇబ్రహీంపట్నం మండలం, గున్గల్ సమీపంలోని ఎల్లమ్మతండాకు చెందిన అతడి తోడల్లుడు లక్పతితో రోజా వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.ఈ క్రమంలో లక్పతి రాగ్యానాయక్‌ను చంపుతానని బెదిరించినట్లు అతని బంధువులు అప్పట్లో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా లావుతండాలో రాగ్యానాయక్ స్థలాన్ని కొనుగోలు చేసిన లక్పతి అతడికి రూ. 3 లక్షలు బాకీ ఉన్నాడు. గత ఆగస్టు 19న బొంగులూర్ గేట్ వద్దకు వస్తే డబ్బులు ఇస్తానని రాగ్యానాయక్‌ను అక్కడికి పిలిపించుకున్నాడు. దేవరకొండలో డబ్బులు రావాల్సి ఉందని చెప్పి కారులో వెంట తీసుకెళ్లారు. లక్పతితో పాటు అతని స్నేహితులు మన్సింగ్, బాలాజీ, శివ తదితరులు రాగ్యానాయక్‌కు మద్యం తాగించి నేరుడుగొమ్మ మండలం, బుగ్గతండా వద్ద కాళ్లు చేతులు కట్టి, శరీరానికి ఐరన్ రాడ్లు కట్టి, చేపల వలలో చుట్టి, పడవలో తీసుకెళ్లి కృష్ణా నది మధ్యలో పడేశారు. తన భర్త నాలుగు రోజులుగా ఇంటికి రాలేదని, ఫోన్ పని చేయడం లేదని ఆగస్టు 23న అతడి భార్య రోజా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు రోజా ప్రవర్తనపై అనుమానంతో విచారణ చేపట్టగా లక్పతితో వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా రాగ్యానాయక్‌ను హత్య చేసినట్లు లక్పతి అంగీకరించడంతో నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న అస్థిపంజరానికి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఇందులో కొన్ని ఎముకలను డీఎన్ఏ టెస్టుకు పంపనున్నట్లు ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు. రాగ్యానాయక్ హత్య కేసులో అస్తి పంజరం కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. -
మెడికల్ కళాశాల నిర్మాణానికి ఫిబ్రవరిలో శంకుస్థాపన
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: వచ్చే ఫిబ్రవరి రెండో వారంలో జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయిస్తానని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. నల్లగొండ పట్టణంలోని గాంధీనగర్‌లో రూ 18 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అం తకు ముందు స్థానిక గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ తనకు పదవులు ఆవసరం లేదని, ప్రజల సంక్షేమం, అభివృద్ధే ముఖ్యమని స్పష్టం చేశారు. తాను ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాతో పాటు నియోజకవర్గంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయించడమే తన లక్ష్యమన్నారు. ప్రజలకు సేవ చేయడానికే తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. గాంధీనగర్‌లోని నిరుపేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇప్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాదయాత్రతో, మోటర్‌బైక్‌పై ప్రయాణించి వార్డులో నెలకొన్న సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, నాయకులు చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, వంగూరు లక్ష్మయ్య, గుమ్ముల మోహన్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాతంగి సత్యనారాయణ, అబ్బగోని రమేష్, వేణు, శ్రీనివాస్, కాసరాజు వాసు, మార్త యాదగిరిరెడ్డి, మెరుగు గోపి, అంబర్ల సత్యనారాయణ పాల్గొన్నారు. రాగ్యానాయక్ సేవలు మరువలేనివి మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ చేసిన సేవలు మరవలేనివని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొనియాడారు. రాగ్యానాయక్ 13వ వర్ధంతి సందర్భంగా నల్లగొండలోని గడియారం సెంటర్లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగాా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల పెన్నిధిగా పేరుగాంచిన రాగ్యానాయక్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దేవరకొండలో ఏర్పాటు చేయనున్న రాగ్యానాయక్ విగ్రహానికి తనవంతుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.