ఆలయాన్ని నిర్మిస్తున్న సర్పంచ్‌కే అందులో ప్రవేశం లేదు
గాంధీనగర్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరానికి సమీపంలో రహెమాల్‌పూర్ అనే ఓ చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామానికో శివాలయం కావాలని ఆ ఊరి ప్రజలంతా దళిత మహిళా సర్పంచ్ పింటూబెన్‌ను కోరారు. పెద్ద మనసు గల ఆ సర్పంచ్ ఆలయాన్ని నిర్మించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. సర్పంచ్ కార్యాలయం నుంచి కాకుండా వ్యక్తిగతంగా కూడబెట్టుకున్న పది లక్షల రూపాయలతో శివాలయ నిర్మాణానికి నడుంకట్టారు.
ఆలయం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. దళిత కులానికి చెందిన మహిళ అవడం వల్ల ఆ ఆలయంలోకి తనకు ఎప్పటికీ అనుమతి ఉండదని ఆమెకు తెలుసు. అయినా గ్రామ ప్రజల కోరిక మేరకు ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చారు. తన 32 భీగాల వ్యవసాయ భూమి ద్వారా కూడబెట్టిన పది లక్షల రూపాయలను పింటూబెన్ ఆలయ నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. ఈ విషయం తెల్సిన ఓ జాతీయ మీడియా ఇటీవల ఆ గ్రామానికి వెళ్లి పింటూబెన్‌ను కలుసుకుంది.
ఆమె నిర్మాణంలో ఉన్న శివాలయాన్ని మీడియా ప్రతినిధులకు చూపించారు. ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన ఆమె ఆలయం లోపలికి రావడానికి నిరాకరించారు. అందుకు అగ్రవర్ణ హిందువులు ఒప్పుకోరని, గొడవ చేస్తారని చెప్పారు. ‘మీరు నిర్మిస్తున్న ఆలయంలోకి మీకు రావాలని లేదా?’ అని మీడియా ప్రశ్నించగా, ‘ఎందుకు లేదు. తరతరాలుగా మమ్మల్ని అంటరానివారుగానే చూస్తున్నారు. ఏ ఆలయంలోనికి మమ్మల్ని అనుమతించరు’ అని ఆమె చెప్పారు.
ఆమె గ్రామానికి సర్పంచ్ అయినప్పటికీ ఆమెను అగ్రవర్ణాల వారు అంటరాని వ్యక్తిగా చూడటంతో మీడియాకు ఆశ్చర్యం వేసింది. రాజకీయాలు వేరని, సమాజంలో కుల పట్టింపులు వేరని ఆమె చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆమె తెలిపారు.
ఆమె మాటల్లోని వాస్తవం ఎంతో తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు రాష్ట్రంలోని పలు ఆలయాలను సందర్శించి అక్కడి ఆలయ నిర్వాహకులను, పూజారులను వాకబు చేసింది.
కొన్ని ఆలయాల్లోకి దళితులను అసలు అనుమతించడం లేదు. మరికొన్ని ఆలయాల్లోకి దళితులను అనుమతిస్తున్నా, గర్భగుడిలోకి మాత్రం అనుమతించడం లేదు. కొంతవరకు అనుమతించే ఆలయాల్లో దూరం నుంచి దళితులు దేవుడికి మొక్కకోవాలి. పూజారులెవరూ వారిని తాకరు, నుదిటన తిలకం పెట్టరు. తీర్థ ప్రసాదాలు ఇవ్వరు. రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని స్వామి నారాయణ నూతన మందిరం, ఇక్కడ ప్రసిద్ధి చెందిన నాగాలయంలో కూడా దళితుల పట్ల ఇలాంటి వివక్షే కొనసాగుతోంది.
ఈ కాలంలో కూడా ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించగా పూజారులు ఖర్మ సిద్ధాంతాన్ని వల్లించారు. తాము దళితులను అడ్డుకోవడం లేదని, దేవుడే వారిని రావద్దని ఆదేశించారని వారన్నారు. చట్ట ప్రకారం ప్రవేశించేందుకు దళితులు ధైర్యంగా ముందుకొస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా, వాటినీ అడ్డుకుంటామని, వీలుకాకపోతే దళితులు వెళ్లాక గంగా జలాన్ని తీసుకొచ్చి ఆలయాన్ని శుద్ధి చేస్తామని పూజారులు తెలిపారు. అనవసరమైన గొడవలెందుకని దళితులే ఆలయాలకు దూరంగా ఉంటున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ పుట్టిన గడ్డపైనే ఇంకా దళితుల పట్ల వివక్షత కొనసాగడం ఏమిటో!