1న మోదీ, కేసీఆర్ పాలనలపై చార్జిషీట్
ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా వెల్లడి
సంగారెడ్డి టౌన్: జూన్ 1న తలపెట్టిన ‘తెలంగాణ ప్రజా గర్జన సభ’ ద్వారా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పాలనా వైఫల్యాలపై ఏఐసీసీ ఉపాధ్య క్షుడు రాహుల్‌గాంధీ చార్జిషీటు విడుదల చేస్తారని ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతి యా అన్నారు. రాహుల్ పాల్గొనే సభకు సంబంధించి సోమవారం వేదిక భూమి పూజ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. సభ అనంతరం రాహుల్‌గాంధీ విడుదల చేసిన చార్జిషీటును రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పోలింగ్ బూత్‌స్థాయి వరకు తీసుకెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. 111 సీట్లు గెలుస్తామని కేసీఆర్ చెప్పారని, అత్యంత ప్రజాదరణ గల నేత అయితే మిగతా పార్టీల వారిని తమ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను వీడే నాయకులతో నష్టం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో 50 శాతం టిక్కెట్లు యువతకు ఇస్తామన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమన్నారు.
కాగా సభకు రాహుల్‌గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో ఎస్పీజీ డీఐజీ సౌమిత్రాదాస్ సోమవారం సభాస్థలిని పరిశీలించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎస్పీ కార్యాలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి తదితరులతో డీఐజీ సౌమిత్రాదాస్ సమావేశమయ్యారు.