రైలొచ్చినా.. గేటు వేయలేదు
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : రైల్వే గేటు వేయకపోవడాన్ని గమనించిన రైలు డ్రైవర్ అప్రమత్తతతో రైలును నిలిపి వేయడంతో పట్టాలు దాటుతున్న వాహనదారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రై లు నిలుపకుండా అలాగే వచ్చుంటే ప్రమాదం జరిగి ఉండేదని గేట్ మన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి ముంబయి వెళ్లే దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లికి చే రుకునే సమయానికి గేటు వేయలేదు. విధుల్లో ఉండాల్సిన గేట్‌మన్ గదికి తాళం వేసి ఎక్కడికో వెళ్లాడు.
గేటు తెరిచి ఉండటంతో రైలు వస్తున్న విషయం గమనించని వాహనదారులు, పాదచారులు పట్టాలు దాటుతున్నారు. అదే సమయంలో రైలు కూత విన్పించి చూసేసరికి సమీపంలోనే ఆగిన ఎక్స్‌ప్రెస్ రైలు కన్పించడంతో అందోళనకు గురయ్యారు. రైలు కూతతో అక్కడికి చేరుకున్న గేట్‌మన్ హడావుడిగా గేటు వేశాడు. గేటు ఎందుకు మూయలేదని ప్రశ్నించిన ప్రజలతో ‘ఏం ప్రమాదం జరగలేదు కదా.. ’అంటూ దురుసుగా మాట్లాడినట్లు న్యూడెమొక్రసీ మండల కార్యదర్శి అంబట్ల రాజేశ్వర్ విలేకరులతో తెలిపారు. గేట్‌మన్ నిర్లక్ష్యంపై రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.