పట్టాలెక్కిన ‘పారాదీప్’
బడ్జెట్లో ప్రకటించిన వీక్లీ రైలు
ఇప్పటికే మూడు రైళ్లు ప్రారంభం
విశాఖపట్నం సిటీ : విశాఖపట్నం-పారాదీప్-విశాఖపట్నం(22810/22809) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. రైల్వే మంత్రి సురేష్‌ప్రభాకర్ ప్రభు రిమోట్ కంట్రోల్ సాయంతో ఢిల్లీ నుంచి ప్రారంభించినట్టు ప్రకటించగా బుధవారం మధ్యాహ్నం విశాఖ రైల్వేస్టేషన్ లో ఎంపీ హరిబాబు జెండా ఊపి ప్రారంబించారు. 2014-15 రైల్వే బడ్జెట్లో ప్రకటించిన నాలుగు రైళ్లలో మూడు రైళ్లు ఇప్పటికే పట్టాలెక్కగా బుధవారం విశాఖ-పారాదీప్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ పట్టాలపై పరుగులు తీసింది. చిన్న చిన్న ప్రాజెక్టులు మినహా రైళ్లన్నీ పట్టాలెక్కడంతో వచ్చే బడ్జెట్‌పై కొత్త రైళ్ల రాక కోసం ఎదురు చూస్తున్నారు. గత బడ్జెట్లో ప్రకటించిన నాలుగు రైళ్లలో మూడు రైళ్లను వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రారంభం కావడం పట్ల ఎంపీ హరిబాబు రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఒక్క రైలునైనా ప్రారంభించేందుకు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజే స్తూనే కాస్త అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ రైలు రెండు పోర్టు సిటీలను కలుపుతుందని ఆనందం వ్యక్తం చేశారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ కొత్త రైళ్ల ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఎం అనిల్‌కుమార్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.ఎల్వేందర్ యాదవ్ పాల్గొన్నారు.
ఇక ప్రతీ వారం పారాదీప్‌కు..!
ఇక ప్రతీ వారం పారాదీప్‌కు వెళ్లే మార్గం విశాఖ వాసులకు దక్కింది. ఎక్కువ మంది మత్స్యకారులు ఒడిశాలోని పారాదీప్‌కు వెళ్లి అక్కడి నుంచి వేటకు వెళుతుంటారు. ఈ రైలు రాకతో మత్స్యకారులు సుమారు 550 కిలోమీటర్లు సముద్ర మార్గంలో కాకుండా రైలు మార్గంలో వెళ్లి అక్కడి నుంచి చేపల వేటకు వెళ్లే అవకాశాలున్నాయి. ఈ రైలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రతీ ఆదివారం రాత్రి 11.50 గంటలకు విశాఖలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు పారాదీప్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రతీ బుధవారం రాత్రి 10.30 గంటలకు బయల్దేరి గురువారం ఉదయం 8.30 గంటలకు విశాఖకు చేరుతుంది. విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, సోంపేట, ఇచ్చాపురం, బ్రహ్మపురం, ఛత్రపూర్, కుర్దా రోడ్, భువనేశ్వర్, మంచేశ్వర్, కటక్, రహమ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఈ రైల్లో మొత్తం 19 బోగీలుంటాయి. వీటిలో ఏడు స్లీపర్ క్లాస్, ఎనిమిది జనరల్ బోగీలుంటాయి.