7 నుంచి రైల్వే వాత
న్యూఢిల్లీ: వచ్చే వారం నుంచే రైల్వే చార్జీల మోత మోగించనుంది. ప్రయాణికుల చార్జీలు, సరుకుల రవాణా రుసుం పెంచాలని నిర్ణయించింది. ఈమేరకు ఏసీ, స్లీపర్ తరగతుల చార్జీలు 2 శాతం, సరుకుల రవాణా రుసుం సుమారు 1.7 శాతం పెరగనున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచే పెంచిన చార్జీలు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆర్నెల్ల కాలంలో తలెత్తిన రూ. 1,250 కోట్ల నష్టా న్ని చార్జీల పెంపు ద్వారా భర్తీ చేసుకోవాలని రైల్వే భావిస్తున్నట్లు ఆ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.
2011-12లో బడ్జెట్లో ప్రకటించినట్లుగా ఇంధన సర్దుబాటు అంశం (ఎఫ్ఏసీ) ఆధారంగానే తాజా పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. దాదాపు 15 శాతం విద్యుత్తు చార్జీలు, 7.3 శాతం డీజిల్ ధర పెరగడంతో పడిన అదనపు భారం అంశాన్నీ రైల్వే పరిగణనలోకి తీసుకొంది. మరోవైపు సరుకుల రవాణాపై ‘రద్దీ కాల రుసుం’ పేరుతో 15 శాతం లెవీని ఈనెల 1 నుంచి రైల్వే అమల్లోకి తీసుకొచ్చిన సంగతి విదితమే. ప్రయాణికుల సేవలపై ప్రభుత్వం ఇస్తున్న క్రాస్ సబ్సిడీ ఈ సంవత్సరంలో ఇప్పటికే రూ. 26,000 కోట్లు దాటిన దృష్ట్యా చార్జీల పెంపు ప్రతి పాదనను పరిశీలిస్తున్నట్లు రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే ప్రకటించిన మర్నాడే రైల్వే తన నిర్ణయాన్ని వెలువరించింది.