వక్ఫ్ భూములు హాంఫట్
నిజామాబాద్ అర్బన్/సుభాష్‌నగర్: జిల్లాలోని వక్ఫ్ బోర్డు భూములు మాయమవుతున్నాయి. ఏళ్ల తరబడి కబ్జాలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకూ అక్రమ నిర్మాణాలు వెలుస్తుండడంతో వక్ఫ్ బోర్డు భూములు కనిపించకుండా పోతున్నాయి. అధికారుల పరిశీలన లేకపోవడం, ఉన్నవాటిపై విచారణ లేకపోవడంతో ఈ భూముల మనుగడ ప్రశ్నార్థకంగా మా రింది.
కబ్జాదారులు దర్జాగా పట్టాలు పొంది, ప్రశ్నించేవారిని మచ్చిక చేసుకుని వాటిని ఆక్రమించుకుంటున్నారు. సుమారు 60 శాతం భూములు ఆమ్రణదారుల చేతిలో ఉన్నాయి. నిజామాబాద్ డివిజన్లో 1,629.27ఎకరాలు, బోధన్ డివిజనలో 3,209 ఎకరాలు, కామారెడ్డి డివిజన్లో 482 ఎకరాలు, మొత్తం 5,319 ఎకరాల వక్ఫ్‌బోర్డుకు చెందిన భూములున్నాయి. ఇందులో సుమారు 3,216 ఎకరాలు కబ్జాకు గురయయ్యాయి. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంతం, ఖలీల్‌వాడి, కోటగల్లీ, కంఠేశ్వర్, గూపన్ పల్లి శివారులో, మరికొన్ని చోట్ల 50 ఎకరాల వరకు భూములు ఆక్రమణలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి.
కబ్జాదారులు వక్ఫ్ బోర్డు అనుమతి పేరిట ఈ భూములలో కొనసాగుతున్నారు. కొన్ని చోట్ల ఒక్కసారి తీసుకున్న అనుమతితో ఏళ్ల తరబడి నిబంధనలకు విరుద్ధంగా అనుభవిస్తున్నారు. రెంజల్ మండలం నీల, కందకుర్తి, బోధన్ డివిజన్లోని పలు ప్రాంతాలలో వక్ఫ్‌బోర్డు భూములు కబ్జాకు గురయ్యాయి. కౌలాస్, దుర్కి ప్రాంతాలలో సుమారు 1,600 ఎకరాల భూమి కబ్జాలో ఉంది. కామారెడ్డి, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ ప్రాంతాలలో సుమారు నాలుగు వందల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. డిచ్పల్లి, భీంగల్, బాల్కొండ, నవీపేట ప్రాంతాలలో దాదాపు 630 ఎకరాలు కబ్జాలో ఉన్నాయి.
మొత్తం వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి 5,319 ఎకరాలలో సర్వే నిర్వహిస్తే మరిన్ని అమ్రాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. 80 శాతం భూములు కబ్జా లో ఉన్నట్లు తేలే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా అధికారులు ఈ కబ్జా భూములపై సర్వే చేపట్టలేదు. కొన్ని చోట్ల ఆ భూములకు కేర్‌టే కర్గా ఉన్న ముతవల్లీలు నిబంధనలకు విరుద్ధంగా లీజులకు ఇస్తున్నారు. కొందరు ఇతరులకు విక్రయించారు. వీటిపై కూడా ఎలాంటి పరిశీలన లేదు. దీంతో భూములు మాయమవుతున్నాయి. సర్వే చేపట్టాలని మైనార్టీ నాయకులు కోరుతున్నా ఫలితం లేకుండా పోతోంది.