Railway Tourism
-
ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: కొన్నిచోట్ల పచ్చదనం.. మరి కొన్నిచోట్ల దట్టమైన అడవిని తలపించేలా గుబురుగా పెరిగిన చెట్లు.. కొండలు, లోయలు. మైమరిపించే అనంతగిరి ప్రాంతం.. విదేశీ వలస పక్షుల స్వర్గధామం భిగ్వాన్ బ్యాక్‌వాటర్ ప్రాంతం.. పశ్చిమ కనుమలను ముద్దాడుతూ ముందుకు సాగే బీమా నది. దానిపై నిర్మించిన ఉజ్జయినీ డ్యాం.. ఇవన్నీ రెప్ప వాల్చనీయవు.. మరో లోకానికి తీసుకువెళతాయి. చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ ప్రయాణం చేస్తుంటే ఆ మజానే వేరు. రైలు ప్రయాణికులకు అలాంటి మధురానుభూతిని మిగిల్చేలా ఓ సరికొత్త అవకాశాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. మూడురోజుల క్రితమే ప్రారంభం ఇరువైపులా పెద్ద పెద్ద గాజు కిటికీలు, రూఫ్ భాగంలో కూడా బయటి ప్రాంతాలు కనిపించేలా ప్రత్యేకంగా అద్దాలు..ఇదే విస్టాడోమ్ కోచ్. రైల్వే పర్యాటక ప్రాంతాల్లో ఈ కోచ్‌లను వినియోగిస్తోంది. ఈ కోచ్ లోపల ఉండే ప్రయాణికులు బయటి ప్రాంతాలను ఎలాంటి అడ్డూ లేకుండా వీక్షించవచ్చన్న మాట. తాజాగా అలాంటి ఓ కోచ్‌తో కూడిన రైలు తెలంగాణ ప్రయాణికులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అరకు మీదుగా సాగే రైలుకు గతంలో ఈ కోచ్‌ను ఏర్పాటు చేయగా, ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి పుణెకు వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు కూడా ఈ కోచ్ అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్–పుణె మధ్య ప్రకృతి రమణీయతను పంచే ప్రాంతాలున్నందున, ఈ మార్గంలో కూడా ఇలాంటి కోచ్‌ను అందుబాటులోకి తెస్తే బాగుంటుందని భావించిన రైల్వే శాఖ మూడు రోజుల క్రితం దీన్ని ప్రారంభించింది. సికింద్రాబాద్–పుణె మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్ గతంలోనే ప్రారంభించారు. కోవిడ్ లాక్డౌన్ తర్వాత అది నిలిచిపోయింది. మళ్లీ పరిస్థితులు మెరుగుపడ్డాయని భావిస్తుండటంతో ఆగస్టు 10న పునరుద్ధరించారు. అయితే దీనికి విస్టాడోమ్ కోచ్‌ను జత చేసి ప్రవేశపెట్టడం విశేషం. సెల్ఫీలూ క్లిక్ చేయొచ్చు ఈ శతాబ్ది రైలులో మొత్తం 12 ఏసీ కోచ్‌లుంటాయి. ఇందులో ఒక విస్టాడోమ్ కోచ్, 2 ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు, 9 చైర్‌కార్ కోచ్‌లుంటాయి. ఇవన్నీ అధునాతన లింక్ హఫ్మాన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లు. విస్టాడోమ్ కోచ్‌లో ఫుల్ పుష్బ్యాక్తో ఉండే 40 సీట్లుంటాయి. ఇవి 360 డిగ్రీల మేర రొటేట్ చేసుకునేలా ఉంటాయి. కుర్చీలను పూర్తిగా కిటికీ వైపు తిప్పుకుని కూర్చోవచ్చు. వెలుపల చూడదగ్గ దృశ్యం మరో వైపు ఉంటే, వెంటనే కుర్చీలను అటు వైపు పూర్తిగా తిప్పుకోవచ్చు. ఆకాశం వైపు చూడాలంటే పూర్తిగా పుష్బ్యాక్ చేసి చేరగిలా పడుకుని చూడొచ్చు. కోచ్ వెనకభాగం మొత్తం పెద్ద అద్దంతో కిటికీ ఉంటుంది. అందులోంచి కూడా బయటకు చూసేందుకు వీలుగా విస్టాడోమ్‌ను చివరి కోచ్‌గా ఏర్పాటు చేశారు. ఇక విశాలంగా ఉంటే ఈ కోచ్‌లో సీట్లు ఉండే ప్రాంతం పోను కొంత భాగాన్ని లాంజ్‌గా ఏర్పాటు చేశారు. అక్కడ ప్రయాణికులు నిలబడి చుట్టూ చూడొచ్చు.. సెల్ఫీలు తీసుకోవచ్చు. ఆ ప్రాంతంలో కోచ్ లోపలివైపు గోడలకు టీ, స్నాక్స్ పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు ఉంది. ఇందులో ఎల్ఈడీ లైటు వెలుగులు, ఆటోమేటిక్‌గా తెరుచుకునే తలుపులుంటాయి. మంగళవారం మినహా ప్రతిరోజూ మంగళవారం మినహా మిగతా అన్ని రోజులు తిరిగే ఈ రైలు 8.25 గంటల వ్యవధిలో గమ్యం చేరుతుంది. ఇందులో టికెట్ చార్జీలు వేర్వేరుగా ఉంటాయి. విస్టాడోమ్ కోచ్‌లో ఒక్కో ప్రయాణికుడు రూ.2,110 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రైలు (నంబర్ 12026) సికింద్రాబాద్ స్టేషన్లో మధ్యాహ్నం 2.45కు బయలుదేరి పుణెకు రాత్రి 11.10కి చేరుకుంటుంది. పుణెలో (12025) ఉదయం ఆరు గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.20కి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. బేగంపేట, వికారాబాద్, తాండూరు, వాడి, కలబుర్గి, షోలాపూర్ స్టేషన్లలో ఆగుతుంది. -
‘రైల్వే టూరిజం’ కొత్త యాత్రలు
చంద్రశేఖర్‌కాలనీ : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ద్వారా ఈ సారి సరికొత్త తీర్థయాత్రల దర్శనీయ పుణ్యక్షేత్రాలతో కొత్త యాత్రలను ప్రారంభించిందని కార్పొరేషన్ మేనేజర్ కె. అమ్మారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పూరిజగన్నాథ ఆలయం, భువనేశ్వర్, లింగరాజ రాజధాని, పిప్లి, రఘురాజ్వాల్ ఆలయాలకు, కొనార్క్ లోని సూర్య దేవాలయం, చంద్రబాగ బీచ్, చిల్యా లేక్ ఒరిస్సా గోల్డెన్ త్రైయాంగ్ల్ ఆరు రాత్రులు, ఏడు పగలు దినాలలో సాగే ఈ ప్రయాణంలో స్లీపర్ తరగతి రైలు ప్రయాణం, భోజన సదుపాయం,పర్యాటక ప్రదేశాలలో నాన్ ఏసీ రోడ్డు ప్రయాణం,వసతి,గైడ్, ప్రయాణ బీచు సౌకర్యం కల్పించబడుతాయని వివరించారు. రైలు నంబర్ 17016 విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రత్యేక బోగిలో న వంబర్ 28 న సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ,గుంటూరు, విజయవాడ, రాజమండ్రి మీదుగా భువనేశ్వర్‌కు చేరుతుందన్నారు. తిరిగి డిసెంబర్ 5 న సికింద్రాబాద్‌కు ఉదయం 7.30 గంటలకు చేరుకుంటామని, ఈ ప్రయాణం ఖర్చు ఒక్కొక్కరికి రూ. 9,675 ఉంటుందని ఆయన తెలిపారు. పూరి జగన్నాథ్ ధాం, గోవా బీచ్ రైలు ప్రయాణ యాత్రలకు 5 శాతం రాయితీ కూడా కల్పించి నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీ సీ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చన్నా రు. 5 శాతం రాయితీ ఐఆర్సీటీసీ ఆఫీసులో బుక్ చేసుకొన్న వారికే వర్తిస్తుందన్నారు. ఇంకా వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఐఆర్‌సిటిసిటూరిజం.కామ్, 040 277702407, 9701360701 నుంచి చివరగా మూడు అంకెల గల 647, 653, 697,698, 707,729 సెల్‌ఫోన్ నంబర్లకు, లేదా నిజామాబాద్‌లోని 08462-225539, 94405 02075 సెల్‌నంబర్‌కు సంప్రదించవచ్చని ఆయన సూచించారు.