తిరుపతి రైలు ఇక నాలుగుసార్లు! హామీ నిలబెట్టుకున్న ఎంపీ బండి..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా ప్రజలకు శుభవార్త. కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు సర్వీసులను పెంచాలని కొంతకాలంగా ప్రయాణికుల పక్షాన ‘సాక్షి’ చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫ లించింది. ప్రస్తుతం ఆది, గురువారాలు మాత్రమే నడిచే ఈ రైలు ఇకపై వారంలో నాలుగు రోజులపాటు నడవనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ శుక్రవారం న్యూఢిల్లీలో రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి రైల్వే పెండింగ్ పనుల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే రైలు ప్రయాణికులతో విపరీతమైన రద్దీ ఏర్పడినందున వారానికి నాలుగు రోజులపాటు పొడిగించాలని కో రారు.
మంత్రి సానుకూలంగా స్పందించి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలను సమీక్షించిన అనంతరం రెండుమూడు రోజుల్లో ఏయే రోజు రైలును నడపాలనే దానిపై ప్రకటన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజల ఆకాంక్ష మేరకు కరీంనగర్–హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే పనులు పూర్తిచేసి కొత్త రైల్వే లైన్ పనులు మంజూరు చేయాలని బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసి ఆదేశించారు.
జమ్మికుంటలో హాల్టింగ్ ఉండేలా..
రాష్ట్రం నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం వ్యాపారులు, సామాన్య ప్రజలు నిత్యం జమ్మికుంటకు రాకపోకలు కొనసాగిస్తుంటారని, వారి సౌకర్యార్థం పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను జమ్మికుంట స్టేషన్లో ఆపేలా (హాల్ట్) చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు. సికింద్రాబాద్ నుంచి వెళ్లే గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12590–89), యశ్వంతపూర్ నుంచి గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12592–91), హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (12723–23), సికింద్రాబాద్ నుంచి పాట్నా వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (12791–92), చైన్నె నుంచి అహ్మదాబాద్ వెళ్లే నవజీవన్ ఎక్స్‌ప్రెస్ (12656–55) రైళ్లను జమ్మికుంట స్టేషన్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
స్పందించిన రైల్వే మంత్రి సాధ్యాసాధ్యాలు పరిశీ లించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేలైన్‌కు సంబందించి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి దుర్వాస న వెదజల్లుతుండటంతో ప్రజల నుంచి అనేక ఫిర్యాదులొస్తున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని 11ఏ, 16ఏ, 26, 101, 123ఏ, 134ఏ, 140ఏ, 164, 175ఏ, 775ల వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) డ్రైనేజీలను మంజూరు చేయాలని సంజయ్ రైల్వే మంత్రిని కోరారు.
గతంలోనే ‘సాక్షి’ ద్వారా హామీ ఇచ్చిన సంజయ్..
గతేడాది పలుమార్లు తిరుపతికి వెళ్లే రైళ్లలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ‘సాక్షి’ ఎంపీ బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన కూడా తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను బైవీక్లీని మరిన్ని రోజులు పొడిగించేలా కృషి చేస్తానని సాక్షి ఇంటర్వ్యూలో హామీ ఇచ్చారు. ఎట్టకేలకు హామీ నెరవేరడంతో జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, మంచి ర్యాల జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.