రైల్వే రిజర్వేషన్ ప్రయాణికులకు శుభవార్త!
విజయవాడ, న్యూస్‌లైన్: రైళ్లలో కన్ఫర్మ్ అయిన రిజర్వేషన్ టికెట్‌పై ప్రయాణించే వ్యక్తికి బదులు సంబంధిత కుటుంబసభ్యుల్లో ఎవరైనా ప్రయాణం చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతిచ్చినట్లు తెలిసింది. అయితే అధికారికంగా సమాచారం అందలేదని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్ టికెట్ కన్ఫర్మ్ అయిన వ్యక్తి ఏదైనా కారణాలతో చివరి క్షణంలో ప్రయాణం చేయలేకపోతే అతని కుటుంబానికి చెందిన ఇతరులెవరైనా అంటే భార్య, కుమారుడు, కుమార్తె దానిపై వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇలా ప్రయాణ ం చేయడానికి ముందు సంబంధిత వ్యక్తులు ఆ టికెట్ తీసుకుని రిజర్వేషన్ విభాగం సూపర్వైజర్ లేదా స్టేషన్ మాస్టర్ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అదే విధంగా ఆ కుటుంబసభ్యులనే విషయాన్ని ధ్రువీకరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దీనిపై రెండు,మూడు రోజుల్లో ఉత్తర్వులు అందే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని దళారులు తమకు అనుకూలంగా మలచుకునే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్ల ఆ టికెట్‌దారుల కన్నా బ్రోకర్లకే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉందని కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త నిబంధనలు ఏ మేరకు అమలవుతాయో వేచి చూడాల్సిందే!