rain fail
-
ఆ ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమీక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని సూచించారు. ‘భారీ వర్షాలతో వరదలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదముంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వల్ల సాధారణ కార్యకలపాలకు అంతరాయం ఏర్పడుతుంది. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండి పొంగి పోవటం వల్ల లోతట్టు ప్రాంతాలు, చిన్న బ్రిడ్జిలు, కాజ్‌వేలలో నీరు ప్రవహించే అవకాశముంది. ట్రాఫిక్ అంతరాయాలు, ప్రజలకు ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే జారీ చేసిన వరదల నిర్వహణ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను కోరింది’అని రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
మేఘమా.. కురవవే!
ఊరిస్తున్న నైరుతి - నిరాశాజనకంగా ఖరీఫ్ సీజన్ - నెల రోజులుగా ప్రభావం చూపని రుతు పవనాలు - ఇప్పటి వరకు పదునైన వర్షం కరువు - 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు - వరుణుడి కరుణ కోసం నిరీక్షణ జూన్ నెల సాధారణ వర్షపాతం : 63.9 మి.మీ., నమోదైన వర్షపాతం : 59.2 మి.మీ., ఖరీఫ్ సాధారణ సాగు : 8.01 లక్షల హెక్టార్లు ఇప్పటి వరకు చేపట్టిన సాగు : 32వేల హెక్టార్లు అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యవసాయానికి నైరుతి రుతు పవనాలే కీలకం. వీటి ప్రభావంతోనే లక్షలాది ఎకరాల్లో ఖరీఫ్ పంట సాగవుతుంది. లేదంటే.. అరకొర తేమలో విత్తనం వేసి రైతాంగం నష్టపోతోంది. ఏటా జూన్ 10 నుంచి 15 తేదీల మధ్య నైరుతి పవనాలు జిల్లాలోకి ప్రవేశిస్తాయి. అయితే ఈసారి కాస్త ముందుగా.. అంటే ఈనెల 8న రాత్రి జిల్లాను తాకినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. నైరుతి ముందస్తుగా ఊరించినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారుతోంది. ప్రస్తుతం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీల నుంచి 35-37 డిగ్రీలకు పడిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రత కూడా బాగా తగ్గుముఖం పట్టింది. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో గాలిలో తేమ శాతం పెరిగింది. ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే వాతావరణం కనిపిస్తున్నా చినుకు రాలని పరిస్థితి ఉంది. శాస్త్రవేత్తలు వర్ష సూచన చేస్తున్నా ఫలితం లేకపోతోంది. అక్కడక్కడ తేలికపాటి వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో తుంపర్లు మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం పడటం లేదు. మరోపక్క విత్తనానికి అదను కావడంతో పదును కాక రైతులు దిక్కులు చూస్తున్నారు. ఆషాడం గాలులతో మేఘాలు చెల్లాచెదురు ఆషాఢమాసంలో వీస్తున్న బలమైన గాలులతో మేఘాలు చెల్లాచెదురవుతున్నాయి. సాధారణ రోజుల్లో గాలివేగం 6 నుంచి 12 కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో ఆవరించిన మేఘాలు చెదిరిపోతున్నాయి. అక్కడక్కడ తుంపర్లు కురిపించి కనుమరుగవుతున్నాయి. బ్రహ్మసముద్రం, గుమ్మగట్ట, పామిడి, డి.హిరేహాల్, తాడిపత్రి, అనంతపురం, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు, తాడిమర్రి, కనగానపల్లి, రామగిరి, కంబదూరు, బత్తలపల్లి, రాప్తాడు, గార్లదిన్నె, పెద్దపప్పూరు, కదిరి, కొత్తచెరువు.. ఇలా దాదాపు 35 మండలాల్లో 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు హోరెత్తిస్తున్నాయి. నైరుతి రాకమునుపే మంచి వర్షాలు జూన్ 8న రాత్రి జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని రైతులు ఆనందపడ్డారు. ఇక ఏరువాక జోరందుకునే పరిస్థితి ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ.. జూన్ 1 నుంచి 8వ తేదీ మధ్య 38 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జూన్ 9 నుంచి 30వ తేదీ మధ్య 21.2 మి.మీ వర్షం మాత్రమే పడటం గమనార్హం. 32 మండలాల్లో సాధారణంకన్నా తక్కువ వర్షం కురిసింది. ఇందులోనూ జూన్ నెలలో ఎస్పీకుంట మండలంలో 8.8 మిల్లీమీటర్లు, శెట్టూరు 13.8, గమ్మగట్ట 14.7, గోరంట్ల 19.3 మిల్లీమటర్లు.. ఇలా చాలా మండలాల్లో కనీసం పదునుకు సరిపడా వర్షం కూడా కురవలేదు. గతేడాది 1.35 లక్షల హెక్టార్లలో పంటలు 2016 ఖరీఫ్‌లో జూన్ నెల ముగిసే నాటికి 1.35 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అందులో వేరుశనగ 1.18 లక్షల హెక్టార్లు, మిగతా విస్తీర్ణంలో ఇతరత్రా పంటలు వేశారు. గతేడాది జూన్‌లో వర్షపాతం 63.9 మిల్లీమీటర్లకు గాను 94.5 మిల్లమీటర్ల వర్షం కురవడంతో ఖరీఫ్ సాగు ఆశాజనకంగా సాగింది. అయితే ఈ జూన్‌లో వర్షపాతం 59.2 మిల్లీమీటర్లకే పరిమితం కావడం, అందులోనూ జూన్ మొదటి వారంలోనే బాగా కురవడం.. విత్తుకు అనుకూలమైన జూన్ 15 తర్వాత వర్షాలు లేకపోవడంతో సాగు మందగించింది. వ్యవసాయశాఖ అందించిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 35వేల హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇందులో 32వేల హెక్టార్లలో వేరుశనగ, ఇతర పంటలు మరో 3వేల హెక్టార్లలో వేసినట్లు చెబుతున్నారు. వేసిన పంటలు కూడా గాలివేగానికి వాడుతుండటం గమనార్హం. జూలైపైనే ఆశలు దాదాపు అన్ని రకాల పంటల సాగుకు జూలై నెల కీలకమని శాస్త్రవేత్తలు ప్రకటించారు. వేరుశనగతో పాటు మిగతా అన్ని పంటలు వేసుకోవచ్చంటున్నారు. జూలైలో సాధారణ వర్షపాతం 67.4 మిల్లీమీటర్లు. ఖరీఫ్ సాధారణ సాగులో 10 శాతం పంటలు కూడా సాగు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు జూలై మాసంపై ఆశలు పెట్టుకుని వరుణుడి కరుణ కోసం ఆకాశానికేసి ఆశగా ఎదురుచూస్తున్నారు. -
విత్తనంపై విముఖత
– జాడలేని వర్షం, చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితులు – వీటికి తోడు నాసిరకం, అరకొర రాయితీ కారణం అనంతపురం అగ్రికల్చర్ : రాయితీ విత్తనంపై ‘అనంత’ రైతులు అనాసక్తి చూపుతున్నారు. గత నాలుగు రోజుల విత్తన వేరుశనగ పంపిణీ సరళిని విశ్లేషిస్తే రైతుల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. 10 నుంచి 15 మండలాల్లో పంపిణీ బాగానే ఉన్నా మిగతా మండలాల్లో కౌంటర్లు బోసిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందులోనూ 10 మండలాల్లో పంపిణీ నామకేవాస్తే అన్నట్లుగా కొనసాగుతోంది. జిల్లాకు కేటాయించిన 4.01 లక్షల క్వింటాళ్లలో ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, ఎన్ఎస్సీ, వాసన్ సంస్థల ద్వారా 3.78 లక్షల క్వింటాళ్లు 63 మండలాల్లో నిల్వ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కే–6 రకం క్వింటాల్ పూర్తి ధర రూ.7,700 కాగా అందులో 40 శాతం రాయితీ రూ.3,080 పోనూ రైతు వాటాగా రూ.4,620గా నిర్ణయించి గరిష్టంగా ఒక్కో రైతుకు 4 బస్తాలు (120 కిలోలు) ఇస్తున్నారు. గతంలో గరిష్టంగా మూడు బస్తాలు (90 కిలోలు) ఇచ్చేవారు. ఈ సారి ఒక బస్తా అదనంగా పెంచినా... పంపిణీలో విత్తనకాయ తీసుకునేందుకు రైతులు పెద్దగా ముందుకు రాకపోవడం విశేషం. కౌంటర్లు వెలవెల ఈనెల 24న జిల్లావ్యాప్తంగా విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభించారు. తొలిరోజు 2,335 క్వింటాళ్లు, రెండో రోజు 12,452 క్వింటాళ్లు, మూడో రోజు 16,820 క్వింటాళ్లు. నాలుగో రోజు 19,977 క్వింటాళ్లు... మొత్తం 51,585 క్వింటాళ్లు రైతులకు పంపిణీ చేశారు. రోజుకు 15 వేలు, 16 వేలు క్వింటాళ్లు ఇస్తే 4.01 లక్షలు క్వింటాళ్లు పూర్తీ కావడానికి దాదాపు నెల రోజులు పట్టే అవకాశం ఉంది. కానీ.. నెల రోజుల పాటు పంపిణీ కొనసాగించే పరిస్థితి లేదు. 10 నుంచి 12 రోజుల పాటు పంపిణీ చేసి ముగించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. గత మూడు రోజుల పంపిణీ విషయానికి వస్తే... తలుపుల మండలంలో అతి తక్కువగా కేవలం 45 క్వింటాళ్లు అమ్ముడుబోయాయి. పుట్లూరులో 53 క్వింటాళ్లు, గాండ్లపెంటలో 59 క్వింటాళ్లు, హిందూపురంలో 65 క్వింటాళ్లు, ఎన్పీ కుంటలో 83 క్వింటాళ్లు, బెళుగుప్పలో 98 క్వింటాళ్లు మాత్రమే పంపిణీ జరిగింది. కళ్యాణదుర్గం, వజ్రకరూరు, బెళుగుప్ప, కంబదూరు, రామగిరి, సీకే పల్లి, రొద్దం లాంటి మండలాల్లో వేరుశనగ పంట విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా విత్తన పంపిణీలో అంతంత మాత్రంగానే ఉండటం విశేషం. చేతిలో చిల్లిగవ్వ లేక.. వేరుశనగ విత్తన కౌంటర్లు వెలవెలబోవడానికి ప్రధాన కారణంగా రైతుల చేతుల్లో చిల్లిగవ్వ లేకపోవడమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ఖరీఫ్‌కు సంబంధించి ప్రీమియం కట్టినా ఇప్పటికీ వాతావరణ బీమా (ఇన్సూరెన్స్) కింద రూ.434 కోట్లు పరిహారం మంజూరు కాకపోవడం, రూ.1,023 కోట్లు పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) ఇవ్వకపోవడం, రెన్యువల్స్ మినహా కొత్తగా పంట రుణాలు అందకపోవడం, మూడో విడతకు సంబంధించి రూ.416 కోట్లు రుణమాఫీ సొమ్ము విడుదల కాకపోవడంతో రైతులు ఆర్థికంగా కుదేలయ్యారు. వరుణుడు జాడ లేక జిల్లా అంతటా ఇప్పటికీ తొలకర్లు పడకపోవడంతో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధం కాని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా రాయితీ ధరలు, బయట లభిస్తున్న విత్తన ధరల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోవడం, ప్రభుత్వం ఇస్తున్న విత్తనం నాసిరకంగా ఉండటం వల్ల విత్తనంపై రైతులు అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. వంద శాతం సర్టిఫైడ్ సీడ్ అంటున్నా... విత్తనకాయలో నాసులు, పుల్లలు, రాళ్లు, రప్పలు, కల్తీ కాయలు ఉండటంతో చాలా మండలాల్లో నాణ్యతపై రైతులు పెదవి విరుస్తున్నారు. వీటితో పాటు గతంలో టీఎంవీ–2, జేఎల్–24, పొలాచీ, నారాయణి, ఐసీజీవీ–91114, ధరణి, కే–6, కే–9... తదితర రైతులకు అవసరమైన మరికొన్ని రకాలు ఇస్తుండటంతో కొంత వెసులుబాటు ఉండేది. కానీ... ఈ సారి కేవలం కే–6 రకానికి పరిమితం కావడంతో అది కూడా ఓ కారణంగా విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని మండలాల్లో టీఎంవీ–2, కే–9, ధరణి, నారాయణి లాంటి కొన్ని రకాలు కావాలంటున్నా వ్యవసాయశాఖ అధికారులు వాటిని ఇవ్వలేని పరిస్థితి ఉండటంతో విత్తన పంపిణీ అంతంత మాత్రంగానే కొనసాగుతోంది.