ఆ విమానాన్ని ఇండియా ఏం చేయబోతోంది?
ఢాకా నుంచి మస్కట్ కు 173 మంది ప్రయాణికులతో బయలుదేరిన బంగ్లాదేశ్ విమానం ‘మెక్ డానెల్ డగ్లాస్ ఎం.డి. 83’.. ఐదున్నరేళ్ల క్రితం రాయ్‌పుర్ (ఛత్తీస్‌గఢ్) లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆరోజు నుంచీ ఈరోజు వరకు ఆ విమానం అదే ప్లేస్ లోనే ఉండిపోయింది! తీసుకెళ్లమంటే బంగ్లాదేశ్ తీసుకెళ్లడం లేదు! పోనీ పార్కింగ్ చార్జీలైనా కట్టమంటే కట్టడం లేదు. (1.25 కోట్లు). ‘ఓర్నాయనోయ్.. అంతా!’ అంటోంది. ఎందుకు ఆ విమానం ఇంకా అక్కడ ఉంది? వాళ్ల అధికారులెవరూ ఎందుకు వచ్చి తీసుకెళ్లడం లేదు! ఇప్పుడా విమానాన్ని ఇండియా ఏం చేయబోతోంది?
ఇది పాత కథ మాత్రమే కాదు, ఇప్పటికైతే అంతులేని కథ కూడా! ఐదున్నరేళ్ల క్రితం 2015 ఆగస్టు 7 తేదీ రాత్రి ఏడు గంటలకు ‘మెక్ డానెల్ డగ్లస్ ఎండి 83’ అనే బంగ్లాదేశ్ బోయింగ్ విమానం మన దేశంలో దిగే పని లేకుండానే దిగింది! బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బయల్దేరిన ఆ విమానం నేరుగా ఒమన్ రాజధాని మస్కట్ వెళుతున్నప్పుడు గగనతలంలో ఒక ఇంజిన్ చెడిపోయింది. పైలట్ ఆ సంగతిని గుర్తించేటప్పటికి వారణాసి, రాయ్‌పుర్ మధ్య గగనతలంలో ఉంది. అప్పటికప్పుడు అత్యవసర ల్యాండింగ్‌కి దగ్గరగా ఉన్న రాయ్‌పుర్ (ఛత్తీస్ గఢ్) లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో విమానాన్ని దింపేశాడు. లోపల ఉన్న 173 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తర్వాత వాళ్లంతా తమ గమ్యస్థానానికి చేరుకున్నారు.
అయితే ఈ ‘డగ్గాస్ 83’ విమానం మాత్రం తిరిగి బంగ్లాదేశ్ చేరుకోలేదు. ఆనాడే కాదు, మర్నాడు, ఆ మర్నాడు, ఆ నెల, ఆ తర్వాతి నెల, ఆ ఏడాది, తర్వాతి ఏడాదీ.. పైకి లేవనే లేదు. ఇవాళ్టికీ ఉన్నచోటే ఉండిపోయింది. ఎయిర్‌పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ఎ.ఎ.ఐ.) పార్కింగ్ స్థలం అది. అక్కడ పార్క్ చేసినందుకు బంగ్లాదేశ్ వాళ్ల ‘యునైటెడ్ ఎయిర్వేస్’ (ఈ డగ్లాస్ 83 విమానం వాళ్లదే) కోటీ 25 లక్షల రూపాయల పార్కింగ్ చార్జీలను ఎ.ఎ.ఐ.కి బకాయీ పడింది. ఇమ్మంటే ఇవ్వదు. విమానాన్ని తీసుకుపొమ్మంటే పోదు. చూసి చూసి ఏదో ఒకటి తేల్చమని ఈ జనవరి 18న ఎ.ఎ.ఐ. మరొకసారి గుర్తుచేసింది. విజ్ఞప్తులు, ఆదేశాలు పని చేయకపోవడంతో ఇప్పుడు లీగల్‌గా తేల్చుకునేందుకు సిద్ధమైంది.
రాయ్‌పుర్ స్వామి వివేకానంద విమానాశ్రయంలో ఉన్నవే ఎనిమిది పార్కింగ్ బేస్‌లు. వాటిల్లో ఒక విమానం అక్కడే ఫిక్స్ అయిపోవడంతో ఇబ్బందిగా ఉన్నప్పటికీ గత ఐదున్నరేళ్లు గా ఆ ఎయిర్పోర్ట్ సర్దుకుపోతోంది. ఎంత సర్దుకుపోయినా ఒక హద్దయితే ఉంటుంది. ఆ హద్దు కూడా దాటి, ఇప్పుడిక ఆ విమానాన్ని అక్కడి నుంచి లేపే ప్రయత్నం మొదలుపెట్టింది ఎ.ఎ.ఐ. డంప్ యార్డ్‌కు పంపడానికి లేదు. పార్కింగ్ ప్లేస్‌లో అలా పడి వుంటుందిలే అనుకోడానికీ లేదు. పైగా రెండు మూడు మరమ్మతులు చేస్తే పైకి ఎగిరే విమానమే అది. ‘కొనేవాళ్ల కోసం చూస్తున్నాం. కాస్త టైమ్ ఇవ్వండి’ అని మాత్రం బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్ అంటోంది. ‘‘ఏమైనా ఇంకో వారం మాత్రమే చూస్తాం’’ అని రాయ్‌పుర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాకేశ్ సహాయ్ అంటున్నారు. అని రెండు రోజులు అయింది.
అసలు డగ్లాస్ 83 అత్యవసరంగా ల్యాండ్ అయిన మూడు వారాల తర్వాత గానీ బంగ్లాదేశ్ పౌర విమానయాన శాఖ అధికారులు పర్యవేక్షణ కోసం రాయ్‌పుర్ రాలేదు! వాళ్లొచ్చి వెళ్లిన కొన్ని నెలల వరకూ మళ్లీ అట్నుంచొకరు ఇటు రాలేదు. ఆ వచ్చినవాళ్లు చెడిపోయిన ఇంజన్ తీసి కొత్తది బిగించారు. ఇక అక్కడి నుంచి విమానాన్ని తీసుకెళ్లాలంటే బంగ్లాదేశ్ విమానయాన శాఖ నుంచి తప్పనిసరిగా ‘ఎగిరే యోగ్యత పత్రం’ రావాలి. అది రాలేదు. ఇది ఎగర లేదు! ఏళ్లు గడిచిపోతున్నాయి. మనవాళ్లు ఇప్పటికి ఉత్తరాలు, ఈమెయిళ్లు కలిపి సుమారుగా ఓ 50 వరకు పంపారు. నెల నెలా గుర్తు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడూ ఒకటే సమాధానం.. ‘ఎగిరే యోగ్యత పత్రం’ అందగానే తీసుకెళతాం అని! రాయ్‌పుర్ ఎయిర్పోర్ట్ ఇబ్బందులు రాయ్‌పుర్‌కు ఉన్నాయి.
ఇక్కడి నుంచి రోజూ 27 విమానాలు పైకి లేస్తాయి. 27 విమానాలు కిందికి దిగుతాయి. ఉదయం 8–10 గంటల మధ్య, సాయంత్రం 4–6 మధ్య మొత్తం నాలుగు గంటల పాటు ఎనిమిది పార్కింగ్ బేస్‌లు విమానాలకు అవసరం అవుతాయి. డగ్లాస్ 83 కారణంగా ఆ సమయంలో వేరొక ప్రదేశంలో విమానాలను ఉంచవలసి వస్తోంది. ఇది మన వైపు ఇబ్బంది. ఇక వాళ్ల వైపు.. యుౖ¯ð టెడ్ ఎయిర్వేస్ నష్టాల్లో కూరుకుపోయి ఉంది. 2016 నుంచి ఒక్క విమానం కూడా పొయ్యి లోంచి లేవని పిల్లిలా పైకి ఎగరనేలేదు. ఎనిమిది విమానాలను తీసుకెళ్లి ఢాకా హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ‘కార్గో అప్రోచ్ ఏరియా’లో వదిలేశారు. అవి కూడా అక్కడ కార్గో ఫ్లయిట్స్ కాలికీ చేతికీ అడ్డం పడుతున్నాయి. ఈ పరిస్థితిలో రాయ్‌పుర్ విమానాశ్రయానికి పార్కింగ్ చార్జీలు చెల్లించలేక, విమానాన్ని తీసుకెళ్లలేక.. చివరికి.. ‘మీరే ఓ గిరాకీని వెతికి పట్టుకుని, డగ్లాస్ 83ని అమ్మేసి, మీ పార్కింగ్ ఛార్జీలను మినహాయించుకుని, మిగతా డబ్బును పంపించండి’ అని యునైటెడ్ ఎయిర్వేస్.. మన ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాను కోరవచ్చు.
ఆ రోజు ఏం జరిగింది?
విమానం బంగ్లాదేశ్లోంచి పైకి లేచింది. వారణాసి–రాయ్‌పుర్ గగనతల హద్దులోకి వచ్చేసరికి ఇంజిన్ పాడైంది. లోపల 173 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసరంగా ల్యాండ్ అవకపోతే గాల్లోనే పేలిపోయే ప్రమాదం ఉందని పైలట్ షాబాజ్ ఇంతియాజ్ ఖాన్ గ్రహించాడు. భూమికి 32 వేల అడుగుల ఎత్తున విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంజన్‌లోంచి మంటలు వచ్చి, ఇంజన్ బద్దలెపోయింది. లోపల కూర్చొని ఉన్న ప్రయాణికులకు ఇదేమీ తెలియదు. విమానం కుదుపులకు లోనవడం మొదలైనప్పుడేమైనా కొందరు గ్రహించగలిగారేమో. లక్కీగా విమానంలో లోపల ఒక ఫ్లయిట్ ఇంజినీరు ఉన్నాడు. పరిస్థితి మరింత క్షీణించకుండా అతడు చేయగలిగిందేదో చేశాడు. పైలట్ వెంటనే తొలి ‘మేడే కాల్’ను గాలిలోకి పంపించాడు.
మేడే కాల్ అంటే ‘ప్రమాదంలో ఉన్నాం. ల్యాండింగ్‌కి అనుమతి ఇవ్వండి’ అని విజ్ఞప్తి చేసే సంకేతం. ఆ సంకేతాన్ని కోల్‌కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కి పంపితే దురదృష్టవశాత్తూ అది చేరలేదు! కోల్‌కతా చెబితేనే రాయ్‌పుర్ చేస్తుంది. ఏమైతే అయిందని రాయ్‌పుర్‌లో దించేయాలని పైలట్ నిర్ణయించుకున్నాడు. అయితే ఒక విమానాన్ని అత్యవసరంగానే అయినా ల్యాండ్ చేయించే అధికారం రాయ్‌పుర్ ఎయిర్‌పోర్ట్‌కు లేదు. కోల్‌కతా నుంచి ఆర్డర్స్ రావాలి. దురదృష్టంతోపాటే అదృష్టమూ వారి వెంట ఉన్నట్లుంది. పైలెట్ ఇచ్చిన మేడే కాల్‌ను ముంబై నుంచి కోల్‌కతా వెళుతున్న ఇండిగో ఫ్లయిట్ పైలట్ పికప్ చేసుకుని ఆ సమాచారాన్ని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు అందించారు.
కోల్‌కతా ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే రాయ్‌పుర్ అధికారులకు సమాచారం ఇచ్చి ల్యాండ్‌కి అనుమతి ఇవ్వమని కోరారు. రాయ్‌పుర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎలా దిగాలో తెలిపే నేవిగేషన్ చార్ట్ లేకుండానే విమానం సురక్షితంగా దిగేందుకు ఇండిగో పైలట్ నిర్విరామంగా రేడియో కాంటాక్ట్‌లో ఉండి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. విమానం అయితే దిగింది కానీ, ప్రయాణికులకు వేరే విమానం అందుబాటులో లేకుండా పోయింది. 27 గంటల పాటు వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. బంగ్లాదేశ్ నుంచి ఆగస్టు 8 రాత్రి గం. 10.27కు ప్రత్యేక విమానం వచ్చి వారిని మస్కట్ తీసుకెళ్లింది.