ఆజాద్‌ను కలవనున్న అద్వానీ!
న్యూఢిల్లీ: బీజేపీలో అరుణ్ జైట్లీ, కీర్తి ఆజాద్ మధ్య నెలకొన్న వివాదం విషయంలో బీజేపీ కురువృద్ధ నేతలు తలదూర్చనున్నారు. వారు కీర్తీ ఆజాద్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఆజాద్ కూడా బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషితో భేటీ అవనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసి, ట్వీట్ల యుద్ధం ప్రకటించడంతో పార్టీ నుంచి ఆజాద్ సస్పెన్షన్ వేటు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నిజాలు చెప్పడమే తాను చేసిన నేరమైతే.. ఎప్పటికీ నేరాలకు పాల్పడుతూనే ఉంటానని కూడా ఆజాద్ అన్నారు. దీంతో కీర్తి ఆజాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితంగా బీజేపీలో కలకలం రేగింది.
పార్టీ సీనియర్ నేతలు తమ పార్టీ చేసిన పనిని ఎలా సమర్థించాలో అని తలలు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. గురువారం మురళీ మనోహర్ జోషి నివాసంలో భేటీ అయిన ఎల్ కే అద్వానీ, శాంతకుమార్, జోషి, యశ్వంత్ సిన్హా సస్పెండ్ ఈ అంశాన్ని చర్చించారు. తమ అసంతృప్తిని గతంలో మాదిరిగా బహిరంగంగా ప్రకటించకుండా పార్టీలోనే లేవనెత్తాలని నిర్ణయించారు. బీహార్ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ ఓటమిపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీని బహిరంగంగా విమర్శించిన విషయం తెలిసిందే.